ప్రతి ఇంటి చావడిలో ఆయన నవ్వుంది

29 Jul, 2020 04:13 IST|Sakshi

తరచి చూడాలేగాని నాలుగు సంసారాల చోటులో కూడా నవ్వు చూడొచ్చు. ఆ నవ్వుని పట్టుకుని నాలుగిళ్ల చావడి నాటికతో ప్రసిద్ధుడయ్యాడాయన. నటుడు, రచయిత, కాలమిస్ట్, జర్నలిస్ట్‌ రావికొండలరావు తెలుగు వారి సాంస్కృతిక పాయలో ఒక చిన్నచిర్నవ్వును నింపి మంగళవారం సెలవు తీసుకున్నారు. ఆయనకు నివాళి.

‘ప్రేమించి చూడు’లో రావి కొండలరావు అక్కినేని తండ్రి. ముక్కోపి అయిన తెలుగు మేస్టారు. అక్కినేనికి ఆ సినిమాలో పూటకు ఠికానా లేదు. ఎలాగో ఫ్రెండు జగ్గయ్య దగ్గర అప్పు చేసి ఏదో ఉద్యోగం వెలగబెడుతున్నట్టు మనీఆర్డర్‌ చేస్తుంటాడు. ఆ నెల పోస్ట్‌మేన్‌ వస్తాడు కానీ మనీఆర్డర్‌ తేడు. తెలుగు మేస్టారుకు చిర్రెత్తుకొస్తుంది. ‘మనీఆర్డర్‌ ఏదోయ్‌’ అంటాడు. ‘రాలేదండీ’ అంటాడు పోస్ట్‌మేన్‌ భయంగా. ‘రాకపోయినా తెచ్చివ్వాలి. వచ్చాక తెస్తే నీ గొప్పతనం ఏముంది బోడి’ అని బెదరగొడతాడు. హాల్లో అందరూ నవ్వుతారు. రావి కొండలరావు అలా నవ్విస్తూ తెలుగువారి నవ్వులో ఒక భాగం అయ్యారు.

‘సామర్లకోట’ అంటే ఎస్‌.వి.రంగారావు గుర్తుకొస్తారు. రావి కొండలరావుది కూడా ఆ ఊరే. కాని బాల్యం శ్రీకాకుళంలో గడిచింది. వాళ్ల నాన్న పోస్ట్‌మాస్టర్‌ కనుక ఏ మెయిల్‌ అయినా చేతుల మీదుగా అందాలి కనుక సినిమా హాళ్ల వాళ్లు ఫ్రీగా ఫ్యామిలీని సినిమా చూడనిచ్చేవారు. రావి కొండలరావు అలా సినిమా అభిమాని అయ్యారు. ‘నా జీవితం ఇలా ఈ కొసన గడిచిపోవడానికి వీల్లేదు’ అని ఆయన పియుసి పాస్‌ అయిన వెంటనే నిర్ణయించుకున్నారు. మద్రాసు (ఇప్పుడు చెన్నై) నుంచి వచ్చే ‘ఆనందవాణి’ అనే పత్రికలో చిన్న ఉద్యోగం వస్తే చదివిన చదువు చాల్లే అనుకుని వెళ్లిపోయారు. ‘ఆనందవాణి’ పత్రికలో ఉద్యోగం ఉంది కాని జీతం లేదు. ‘ఇస్తాం ఇస్తాం’ అనే ఆ రాని జీతం కోసం ఎదురు చూసి చూసి మానేశాడాయన. అప్పుడే పరిచయం అయిన ముళ్లపూడి వెంకటరమణ అతన్ని ఇంటికి తీసుకువెళ్లి తన వద్దే ఉంచుకుని భోజనం పెట్టారు.
రావి కొండలరావు చిన్నప్పుడే నాటకాలు వేశారు. ‘తెలుగు మేస్టారు’ అనే కేరెక్టరు ఆయన తయారు చేసుకున్నారు. ఎవరినైనా గద్దించి ఎవరిలోనైనా లోపం వెతికి సరి చేసే ముక్కోపి ఈ తెలుగు మేస్టారు. రూళ్లకర్రలో కూడా వంకలు వెతగ్గలడు. ఏదో ఒకటి చేసి ఎలాగోలా బతుకుదాం అనుకుంటున్న రావి కొండలరావు నటుడిగానే మద్రాసు మహానగరంలో మెరుగ్గా బతగ్గలరని కనిపెట్టినవాడు ముళ్లపూడి. బి.ఎన్‌.రెడ్డి దగ్గర ‘పూజాఫలం’ సినిమాకి, కమలాకర కామేశ్వరరావు దగ్గర ‘నర్తనశాల’ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన రావి కొండలరావును ‘మీరు నటుడిగా ప్రయత్నించండి’అని ‘దాగుడుమూతలు’ సినిమా కోసం ఓ పాత్ర రాసి ఆ పాత్ర ఆయనకొచ్చేలా చేశారు ముళ్లపూడి. రావికొండలరావు దర్శకుడు బాపు గారికి కూడా నచ్చారు. వారిదో స్నేహత్రయం. బాపూ తనకు బుద్ధిపుట్టినప్పుడల్లా ‘ఏదీ, ఆ తెలుగు మేష్టారు ఓసారి చేయండ’ని అడిగేవారట.

రావికొండలరావు తొలి తెలుగు సినిమా జర్నలిస్టులలో ఒకరు. ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక వారానికి ఒకసారి సినిమా పేజీ తేవాలని నిర్ణయించినప్పుడు ఆ పేజీ మొత్తం వార్తలను చెన్నై నుంచి పంపి అందుకు పారితోషికంగా పదిహేను రూపాయలు పొందేవాడాయన. ఐదువారాలకు 75 రూపాయలు ముట్టేవి. ఈ అనుభవంతో పాటు ‘చందమామ’ పత్రికలో పని చేయడం వల్ల ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావుతో పరిచయం పొంది ఆయన సిఫార్సు మేరకు ‘విజయచిత్ర’ మాసపత్రికకు ఎడిటర్‌ అయ్యారు. ‘మంచి మాత్రమే చెప్తాం. చెడు ఉన్నా చెప్పం’ అనే పాలసీ తో ఆరోగ్యకరమైన సినిమా వార్తలతో ఈ పత్రిక మూడో సంచికతోనే లక్ష కాపీల సర్క్యులేషన్‌కు వెళ్లింది. ఆ పత్రికకు ఆయన 26 ఏళ్లు ఎడిటర్‌గా పని చేశారు. సినిమాల్లో నటిస్తూనే ఆ ఉద్యోగం చేయడం వల్ల డెడ్‌లైన్‌ను అందుకోవడానికి షూటింగ్‌ నుంచి వచ్చి విగ్గుతోనే ఫ్రూఫులు చూసిన రోజులు ఉన్నాయని చెప్పుకున్నారు.

‘ప్రతిభ కంటే ప్రవర్తన ముఖ్యం’ అని నమ్మిన రావి కొండలరావు తన ప్రవర్తన వల్లే సినిమా రంగంలో సుదీర్ఘకాలం మనగలిగానని చెప్పుకున్నారు. ఎన్‌.టి.ఆర్‌ ఆయనను మెచ్చి ‘వరకట్నం’ నుంచి తన ప్రతి సొంత సినిమాలో తప్పక వేషం ఇచ్చేవారు. ఆయన రాసిన నాటకం ‘కథ కంచికి’లో రాజబాబుకు చిన్న పాత్ర ఇచ్చి ప్రోత్సహించడంతో ఆ పాత్ర కె.వి.రెడ్డి దృష్టిలో పడి రాజబాబు కెరీర్‌కు రాజమార్గం వేసింది. ఆయన రాసిన ‘నాలుగిళ్ల చావడి’,‘కుక్కపిల్ల దొరికింది’, ‘ప్రొఫెసర్‌ పరబ్రహ్మం’... నాటికలు తెలుగు నేలంతా విజయయాత్ర చేశాయి.

మలినం, శ్లేష, వికారం లేని హాస్యం ఉన్న రచనలు అవి. ‘స్త్రీ పాత్ర రాస్తే పాతిక రూపాయలు పారితోషికం ఇవ్వాల్సి వస్తుందని మగపాత్రలతోనే నాటికలు రాశాను. రాధాకుమారిని వివాహం చేసుకున్నాక ఆమె చేస్తుందనే ధైర్యంతో స్త్రీ పాత్ర నాటికలు రాశాను’ అని చెప్పాడాయన. రాధాకుమారి, రావికొండలరావు నిజ జీవితంలోనే కాక సినీ తెర మీద కూడా వందకు పైగా సినిమాల్లో భార్యాభర్తలుగా నటించారు. ఇలా నటించడం ఒక రికార్డు కావచ్చు.

రావికొండలరావు రాసిన కథ బాపూరమణ లు ‘పెళ్లి పుస్తకం’గా తీస్తే దానికి మూడు నంది పురస్కారాలు దక్కాయి. విజయ సంస్థ తిరిగి సినిమా నిర్మాణంలోకి వచ్చినప్పుడు ఆ సంస్థ తరఫున సమస్త బాధ్యతలు నిర్వహించారాయన. ‘బృందావనం’, ‘భైరవద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’ సినిమాలు ఆయన చేతుల మీదుగా రూపుదిద్దుకున్నాయి. ‘భైరవద్వీపం’ సినిమాకు కథ, మాటలు రావి కొండలరావు రాశారు.

చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డాక ఆయన ఊరికే కూర్చోకుండా కామెడీ క్లబ్‌ నిర్వహణ చేస్తూ హాస్యం పంచారు. సినిమా జ్ఞాపకాలను ‘హ్యూమరథం’,‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ పేరుతో పుస్తకాలుగా వెలువరించారు. ‘మాయాబజార్‌’ సినిమాను నవలగా రాశారు. ‘నాగావళి నుంచి మంజీర వరకు’ ఆయన ఆత్మకథ. రావికొండలరావు కథలు కూడా పఠనీయమైనవి. ‘నేను అరవై ఏళ్లు సినిమా పరిశ్రమలో పని చేశాను’ అని చెప్పుకున్నాడాయన. ఆరు దశాబ్దాల ఆయన కృషి బహుముఖీనమైనది. విశాలమైనది. అలసట, బద్దకం ఎరగనిది. డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌ను నమ్ముకున్నది. కరోనా తెచ్చిన దేవుడిని నాలుగు చీవాట్లు పెట్టడానికి తెలుగు మేష్టారుగా ఆయన అమరపురిని చేరుకున్నాడు. ఆయనకు హాస్యశాంతి కలుగుగాక. – కె

ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్, కేసీఆర్‌ సంతాపం..
బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు మరణంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినీ ప్రముఖుడిగా, దర్శకుడిగా, నాటక రచయితగా, నాటక ప్రయోక్తగా, జర్నలిస్టుగా ఆయన చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా అనేక చిత్రాల్లో నటించిన రావి కొండలరావు తెలుగు సినీ ప్రేక్షకులకు శాశ్వతంగా గుర్తుండిపోతారన్నారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మరో పెద్ద దిక్కును కోల్పోయినట్లయిందని సీఎం జగన్‌ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

సీనియర్‌ నటుడు, రచయిత, నాటక రంగ కళాకారుడు రావి కొండలరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తన కాలానికి చెందిన గొప్ప క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ కొండలరావు అని సీఎం పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బహుముఖ  ప్రజ్ఞాశాలి ఇకలేరు
ప్రముఖ తెలుగు సినీ నటులు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి రావికొండలరావు (88) మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నటుడిగా సినీ రంగానికి ఆయన చేసిన కృషి మరువలేనిది. సుమారు 600కు పైగా సినిమాల్లో నటించారాయన. ఎన్టీఆర్, ఏయన్నార్‌ వంటి సీనియర్‌ నటుల నుంచి ఇప్పటి నటీనటులతోనూ కలసి నటించారాయన. 1932, ఫిబ్రవరి 11న శ్రీకాకుళం లో జన్మించారు రావికొండలరావు. బాల్యంలోనే నాటికలు, సినిమాల మీద ఆసక్తి ఏర్పడింది. అదే ఆయన్ను సినిమాల్లోకి తీసుకువచ్చింది. 1958లో వచ్చిన ‘శోభ’ సినిమాతో నట ప్రస్థానాన్ని ప్రారంభించారు రావికొండలరావు. ‘రాముడు భీముడు’, ‘తేనె మనసులు’, ‘ప్రేమించి చూడు’, ‘ఆలీ బాబా 40 దొంగలు’, ‘అందాల రాముడు’, ‘దసరా బుల్లోడు’ వంటి పాపులర్‌ సినిమాల్లో కనిపించారాయన.

రామ్‌గోపాల్‌ వర్మ తీసిన ‘365 డేస్‌’ ఆయన ఆఖరి చిత్రం అనొచ్చు. సినిమాల్లోకి రాకముందు ఆనందవాణి, వనిత,జ్యోతి, విజయ చిత్ర వంటి పత్రికల్లో పని చేశారు. సినిమా మీద లెక్కలేనన్ని వ్యాసాలు, కొన్ని పుస్తకాలు రాశారు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు సంభాషణలు సమకూర్చారు. ‘పెళ్లి పుస్తకం’, ‘భైరవద్వీపం’ వంటి చిత్రాలకు కథను అందించారాయన. రావి కొండలరావు భార్య రాధాకుమారి కూడా సినిమా యాక్టరే. 2012లో రాధాకుమారి మరణించారు. వీరికి ఒక కుమారుడు (రావి వెంకట శశికుమార్‌) ఉన్నారు. రావి కొండలరావు మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నేటి ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. 

మరిన్ని వార్తలు