వంటగది అన్నం పెడుతోంది

12 Aug, 2020 00:00 IST|Sakshi

సాంబార్‌ స్టోరీ

స్నేహ సిరివర... ఈ అమ్మాయి ముఖం చూస్తే అమ్మ చేసిన సాంబార్‌ను అన్నంలో కలుపుకుంటూ ‘అమ్మా! సాంబార్‌ ఏ పిండితో వండుతారు?’ అని అడిగేటట్లు ఉంది. ఈ అమ్మాయే కాదు, ఈ తరంలో చాలామంది అమ్మాయిల పరిస్థితి ఇలాగే ఉంది. మూడేళ్లు నిండేలోపు ప్లే క్లాస్, ఆ తర్వాత నర్సరీ, ఎల్‌కేజీతో మొదలైన విద్యా ప్రస్థానం మినిమమ్‌ బీటెక్‌ దగ్గర ఆగుతోంది. ఈ మధ్య కాలమంతా పిల్లలు వంటగదిలోకి అడుగుపెట్టేది అమ్మ సర్దిన లంచ్‌బాక్స్‌ తీసుకోవడానికి మాత్రమే. ఇలా తయారైన తరానికి పెళ్లయిన వెంటనే వంటగది భూతంలా భయపెడుతుంది. స్నేహ సిరివర మాత్రం ‘‘నాకు రుచిగా భోజనం చేయడం చాలా ఇష్టం. అందుకోసం జీవితకాలమంతా వంటగదిలోనే గడిపేస్తాను. ఇతర ఉద్యోగాలు– వ్యాపారాల్లో బిజీగా ఉండే వాళ్లకు సహాయంగా ఉంటాను. జీవితం వంటగదికి బానిసైపోతోందని బాధపడే గృహిణులకు కావలసినంత వెసులుబాటు ఇచ్చి వాళ్లు తమకు ఇష్టమైన వ్యాపకాన్ని కొనసాగించుకునే సౌకర్యం కల్పిస్తాను. నాకు ఇష్టమైన వంటగదితోనే ఉపాధి పొందుతాను’’ అంటోంది. 

ఇంజనీర్‌ ఉద్యోగం వద్దు
స్నేహ సిరివర ఈ మాటలు అనడమే కాదు. ఆచరణలో నిరూపించింది కూడా. కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజనీరింగ్‌ చేసిన స్నేహ ఒక ఏడాదిపాటు విప్రో కంపెనీలో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసింది. ‘‘ఆ ఏడాది కాలంలో తరచుగా నా కెరీర్‌ ఇది కాదు... అనిపిస్తుండేది. దాంతో మా అమ్మానాన్నలను ఒప్పించి 2013లో మా కారు గ్యారేజ్‌లోనే నా యూనిట్‌ని ప్రారంభించాను. నా తొలినాటి ఉత్పత్తులు సాంబార్‌ పొడి, రసం పొడి, బిసిబేళాబాత్‌ మసాలా, పులియోగరే మిక్స్‌. వీటినే ఎంచుకోవడానికి కారణం ఉంది.

నా ఫ్రెండ్స్, బంధువులు చాలా మంది విదేశాల్లో ఉన్నారు. వాళ్లకు అక్కడ ఇండియా ఉత్పత్తుల దుకాణాల్లో ఇండియన్‌ మసాలా పొడులంటే ఉత్తరాది రాష్ట్రాల మసాలా పొడులే దొరుకుతాయట. అక్కడి దుకాణాల వాళ్లకు దక్షిణాది రుచులు వేరే ఉంటాయనే సంగతే తెలియదని చెప్తూ ఇక్కడ నుంచి ఏడాదికి సరిపడిన పొడులు చేయించుకుని వెళ్లేవాళ్లు. అలా తొలుత మా కన్నడ రుచులతో కెరీర్‌ ప్రయోగం చేశాను. సక్సెస్‌ అయింది. తర్వాత చట్నీపొడి, పచ్చళ్లు, పదిహేను శాతం చికోరీతో ఫిల్టర్‌ కాఫీ పొడి కూడా సొంతంగా చేశాను. 
తమిళ కోడలు
నేను తమిళ కోడల్ని కావడం అనుకోకుండా జరిగిపోయింది. మా అత్తగారి దగ్గర మోర్‌ కొళంబు, మురుకు, అప్పళం, నిప్పట్టు వంటి గ్రామీణ రుచులను నేర్చుకుని నా ఉత్పత్తులలో చేర్చాను. ఈ ఏడేళ్లలో నేను గ్రహించినదేమిటంటే... ప్రతి వంటకానికీ దానికంటూ ప్రత్యేకమైన రుచి ఉంటుంది. మనం వేసే మసాలా పొడి ఆ రుచిని పరిరక్షించగలగాలి. నేను ముడిసరుకుగా ఉపయోగించే దినుసులు యాభై రకాలకు మించవు. వాటి నిష్పత్తులను, కాంబినేషన్‌లను మారుస్తూ వందల రకాల ఘుమఘుమలను, రుచులను తీసుకురావచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే... భోజనానికి రమ్మని వంటగది పిలవాలి. మసాలా పొడులు ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఎటువంటి రంగులనూ వాడకపోవడం కూడా నా ఉత్పత్తులకు మంచి పేరు తెచ్చి పెట్టింది’’ అని చెప్పింది స్నేహ సిరివర. 

స్నేహ ‘సాంబార్‌ స్టోరీస్‌’ అనే తన చిన్న యూనిట్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా అందుకునే నెల జీతంకంటే మంచి రాబడినే చూస్తోంది. అయితే ఆమెకు యూనిట్‌ నిర్వహణలో సవాళ్లేమీ ఎదురు కాలేదనుకుంటే పొరపాటే. కుటుంబంలో ఎవరూ వ్యాపార రంగంలో లేకపోవడంతో ముడిసరుకు ఎక్కడ దొరుకుతుందో సూచించేవాళ్లు కూడా లేరు. తల్లిదండ్రులు ఇంట్లో ఆమెకు సహాయంగా ఉండేవాళ్లు. ముడిసరుకు సేకరణ నుంచి ఉత్పత్తులను ప్యాకింగ్‌ చేయించి, కొరియర్‌ చేయించడం వరకు ఆమె సొంతంగా చేసుకునేది. ఇప్పటికీ అలాగే యూనిట్‌ని ఒంటి చేత్తో నిర్వహిస్తోంది. ‘వన్‌ మ్యాన్‌ ఆర్మీ’ అని వింటుంటాం. ‘ఒన్‌ ఉమన్‌ ఆర్మీ’ని స్నేహలో చూస్తున్నాం.

మరిన్ని వార్తలు