జీవితం పచ్చగా ఉంది

27 Jul, 2020 01:51 IST|Sakshi

బీటెక్‌ కంప్యూటర్స్‌ చేసింది. కూరగాయలు అమ్ముతోంది. ఏం పచ్చగా ఉన్నట్లు?! మూడు నెలలు జీతం తీసుకుంది. తర్వాతి నెల్లో జాబ్‌ పోయింది. ఏం పచ్చగా ఉన్నట్లు?! నాలుగు రాళ్లు వస్తున్నాయి.
మూడు రాళ్లు ఇంటి అద్దెకే పోతున్నాయి. ఏం పచ్చగా ఉన్నట్లు?! అన్నీ ఉండటం పచ్చదనం మనకు. కష్టకాలంలోనూ.. ధైర్యమే పచ్చదనం శారదకు.

‘నీ కష్టం, శ్రమ లేకుండా నీకు అంది వచ్చిన గౌరవాలేవీ నీకు సంతృప్తినివ్వలేవు’ ఈ కొటేషన్‌ చెప్పింది తత్వవేత్త కాదు. ఒక మామూలు అమ్మాయి. అత్యంత సామాన్యమైన అమ్మాయి. ఈ ఒక్కమాటలో ఆమె తన జీవితాన్ని చెప్పుకుంది. నిజమే... ఇది ఆమెకు ఆమె చెప్పుకున్న సూక్తి. అలాంటి ఎన్నో సూక్తులను సొంతంగా రాసుకుంది శారద. తాను రాసుకున్న ఆ సూక్తులతోనే తనను తాను చైతన్యవంతం చేసుకుంది ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా ఆమె రాసుకున్న స్ఫూర్తిదాయకమైన వచనాలే ఆమెను ధైర్యంగా నిలబెట్టాయి. ‘‘కరోనా కష్టకాలంలో ఎదురైన చేదు అనుభవం నుంచి నన్ను నేను నిలబెట్టుకున్న ధైర్యవచనాలవి’’ అంటోంది శారద.

కూరగాయలతో కొత్త దారి
శారద బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చేసి, కొన్నాళ్లు ఢిల్లీలో ఉద్యోగం చేసింది. తర్వాత హైదరాబాద్‌లోనే ఉద్యోగం చూసుకుందామనుకుని వెనక్కి వచ్చేసి కొత్త ఉద్యోగంలో చేరింది. కార్మికనగర్‌కు దగ్గరలోని ఎస్‌పీఆర్‌ హిల్స్‌లో నివాసం. ఓ ఆరు నెలల కిందట మరో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అక్కడ మూడు నెలలు జీతం తీసుకోగానే ఓ విపత్తు. కరోనా విలయతాండవం మొదలైంది. ఆ కంపెనీ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం సంక్షోభంలో పడింది. ఉద్యోగులను సమావేశ పరిచి ‘ఈ పరిస్థితుల్లో సంస్థను నడిపించడం కష్టం కాబట్టి అర్థం చేసుకోవలసింది’గా సూచించారు పై స్థాయి ఉద్యోగులు. ‘‘జీవితంలో ఎదురయ్యే సంఘటనలన్నీ మనకు నచ్చినవే ఉండవు. ఎదురైన వాటిని యథాతథంగా స్వీకరించి తీరాల్సిందే.

మనకు మరొక ఆప్షన్‌ ఉండదని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. అయితే ఆ క్షణంలో ఉద్వేగాన్ని అదిమి పెట్టుకోగలిగాను కానీ, ఇంటికి వచ్చిన తర్వాత ఆ రాత్రంతా ఏడ్చాను. ఉదయానికి ఒక నిర్ణయానికి వచ్చేశాను’’ అని చెప్పింది శారద. ఆ నిర్ణయమే ఇప్పుడామె చేస్తున్న కూరగాయల వ్యాపారం. ‘‘సౌకర్యవంతమైన జీవితం అనేది దేవుడిచ్చే బహుమతి. ఆ బహుమతిని దేవుడు ఇచ్చినప్పుడు ఆస్వాదించాలి. ఇవ్వనప్పుడు మనంతట మనం మనకు సాధ్యమైన జీవితాన్ని జీవించాలి. అంతే’’ అని చిరునవ్వు నవ్వింది. ఇంత చిన్న వయసులో ఆమెలో ఇంతటి పరిణతి, జీవితం పట్ల ఆ అమ్మాయికి ఉన్న స్పష్టత ఆశ్చర్యం కలిగిస్తాయి. పెద్ద పాఠాలున్న తన చిన్న జీవితాన్ని శారద అలవోకగా వివరించింది.

ర్యాంక్‌ రుచి
‘‘మాది వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట. నాన్న వెంకటయ్య, అమ్మ సరోజిని వ్యవసాయం చేసేవాళ్లు. మేము ముగ్గురమ్మాయిలం, ఒక అబ్బాయి. చెల్లికి రెండేళ్ల వయసులో మా కుటుంబం హైదరాబాద్‌కి వచ్చేసింది. నలుగురు పిల్లలను పెంచడానికి నాన్న ఎంతో కష్టపడ్డాడు. కూరగాయలమ్మేవాడు. వాచ్‌మన్‌గా పని చేశాడు. అమ్మ ఇళ్లలో పని చేసింది. వాళ్లు ఎన్ని కష్టాలు పడినప్పటికీ మమ్మల్ని చదివించడంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదు. మేము బాగా చదువుకుంటూ ఉండడంతో మా ఇంటి దగ్గర ఉండే గోవిందరెడ్డి సార్, ప్రభావతి మేడమ్‌ ఇంకా కొందరు సహాయం చేశారు. నాలుగో తరగతిలో అనుకుంటాను నాకు ఒకసారి థర్డ్‌ ర్యాంక్‌ వచ్చింది. ర్యాంక్‌తో వచ్చే సంతోషం ఎలా ఉంటుందో అప్పుడు తెలిసింది. అప్పటి నుంచి ఫస్ట్‌ ర్యాంక్‌ నా టార్గెట్‌ అయింది. టెన్త్‌ సెవెన్‌టీ పర్సెంట్‌తో పాసయ్యాను. జీవితంలో మంచిగా స్థిరపడాలంటే ఇది చాలదు, పర్సంటేజ్‌ ఇంకా పెంచుకోవాలనిపించింది. ఇంటర్‌ ఎనభైశాతంతో పాసయ్యాను. బీటెక్‌లో ఫ్రీ సీట్‌ వచ్చింది.

నాదే కాదు, మా అక్క, చెల్లిది కూడా ఫ్రీ సీటే. మేము జీవితకాలమంతా మర్చిపోలేని స్కీమ్‌ ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌. నేను బీటెక్‌లోకి వచ్చేటప్పటికీ వైఎస్‌ఆర్‌ లేరు. కానీ మాలాంటి వాళ్ల కోసం ఆయన వేసిన అక్షరాల బాట ఉంది. మా అమ్మానాన్నలకు మమ్మల్ని చదివించాలనే కోరిక ఎంతలా ఉన్నా, ముగ్గురికి వేలాది రూపాయల ఫీజులు కట్టి ఇంజనీరింగ్‌ కోర్సు చేయించగలిగేవాళ్లు కాదు. స్కూల్‌ ఫీజులు, పుస్తకాలకు పెద్ద మనసున్న వాళ్లు సహాయం చేశారు. కానీ ఇంజనీరింగ్‌ ఫీజులు కట్టమని ఎవరినీ అడగలేం కదా! అంతంత ఫీజు కట్టాలంటే ఎవరికైనా కష్టమే. వైఎస్‌ఆర్‌ అనే మహానుభావుడు మా ముగ్గురినే కాదు, మా కాలనీలో ఉన్న మూడు వందల కుటుంబాల్లో కనీసం వంద మందిని గ్రాడ్యుయేట్‌లను చేశారు. మా జీవితమంతా ఆయన పట్ల కృతజ్ఞతతో ఉంటాం’’ అని చెమర్చిన కళ్లతో చెప్పింది శారద.

నాన్న పడిన కష్టం ఇక చాలు
మా అక్క ఎంటెక్‌ చేసి వరంగల్‌లో వాగ్దేవి కాలేజ్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తోంది. చెల్లి హైదరాబాద్, బంజారా హిల్స్‌ కేర్‌ హాస్పిటల్‌లో ఇన్సూరెన్స్‌ పాలసీ మేకర్‌. అన్నయ్య టెన్త్‌తో ఆపేశాడు. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేసేవాడు. కరోనా లాక్‌డౌన్‌ వల్ల అన్నయ్యకు కూడా ఉద్యోగం పోయింది. నాన్న మనందరినీ కూరగాయల బండి మీదనే బతికించాడు. అదే కూరగాయలతో మనం మాత్రం బతకలేమా!, గౌరవంగా డబ్బు సంపాదించుకునే ఏ పనినైనా చేసుకోవచ్చని అన్నయ్యకు నచ్చచెప్పాను. అడవిలో వదిలినా బతికేయగలననే నమ్మకం ఉంది. నాన్నను ఇంట్లోనే ఉండమని చెప్పాం. దుకాణాన్ని విస్తరించాం.

ఇక నాకు మనసు బాధ పడిన క్షణాలంటే... నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బులో పెద్ద మొత్తం ఇంటి అద్దెకే వెళ్లిపోతోంది. నేను అద్దె కడుతున్నప్పుడు నాకు అనుభవంలోకి వచ్చిన ఆవేదన ఇది. ఇన్నాళ్లూ మా అమ్మానాన్న రెక్కల కష్టంలో కూడా ఎక్కువ భాగం అద్దెలకే సరిపోయింది. అలాగని కుంగిపోవడం ఏమీ ఉండదు. ఉన్నంతలో హాయిగా తింటున్నాం, దేవుడి దయ వల్ల అనారోగ్యాల్లేవు, ఆరోగ్యంగా బతుకుతున్నాం. ‘నా పెళ్లి కోసం అప్పులు చేయవద్దు. నేను సంపాదించుకున్న తర్వాత చేసుకుంటాను’... అని మా నాన్నకు చెప్పేశాను. ‘ఇంకా ఎప్పుడు చేసుకుంటావే’ అని అమ్మ తిడుతోంది’’ అని నవ్వుతూ చెప్పింది శారద. 

శారద మాటలు వింటుంటే... ‘‘నీలో దృఢనిశ్చయం శక్తిమంతంగా ఉండాలి. ఆత్మస్థయిర్యం అత్యున్నత స్థాయిలో ఉండాలి. నీ కలల మీదనే దృష్టిని కేంద్రీకరించాలి. అప్పుడే నీ గమ్యాన్ని చేరగలుగుతావు’’ అని ఆమె రాసుకున్న కొటేషన్‌ను అక్షరాలా ఆచరణలో పెడుతున్నట్లు అనిపించింది. కాలేజీ రోజుల్నుంచి తనకు వచ్చిన భావాన్ని కాగితం మీద రాసుకోవడం ఆమెకు అలవాటు. అలా ఆమె రాసుకున్న కొటేషన్‌లు ముప్పైకి పైగా ఉన్నాయి. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: గడిగె బాలస్వామి

ఒకటి పోతే మరొకటి ఉంటుంది
రోజూ ఉదయాన్నే అన్నయ్య మార్కెట్‌కెళ్లి కూరగాయలు తెస్తాడు. నేను షాప్‌లో అమ్ముతున్నాను. ఉద్యోగం పోతే బతకలేమని భయపడే వాళ్లకు నేను చెప్పేదొక్కటే. మీ అమ్మానాన్నలు చేసిన పనినే చేయండి. వాళ్లకంటే మరింత మెరుగ్గా చేయండి. మా మట్టుకు మేము మార్కెట్‌ నుంచి తెచ్చిన కూరగాయలను అలాగే అమ్మకుండా శుభ్రం చేసి అమ్ముతున్నాం. మనకు తెలిసిన నైపుణ్యాలతో జీవితాన్ని నిలబెట్టుకోవాలి కానీ కుంగిపోతే సాధించేదేమీ ఉండదు. ఒకటి చేజారి పోయిందంటే... మనకోసం మరొకటేదో ఉండి ఉంటుందని నమ్ముతాను. – శారద, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా