కర్నాటకలో ‘త్రీ ఇడియట్స్‌ కాన్పు’

1 Aug, 2020 00:52 IST|Sakshi

భారతదేశంలో అన్ని సక్రమంగా ఉంటేనే కాన్పులు చిత్ర విచిత్ర పరిస్థితుల్లో జరుగుతుంటాయి. కరోనా సమయంలో అయితే కొన్ని కాన్పులు మరీ బాధ పెట్టేలా కొన్ని మరీ సంతోషపెట్టేలా జరుగుతున్నాయి. ఈ కాన్పు అయితే మనల్ని సంతోషపెట్టేదే. ‘త్రీ ఇడియెట్స్‌’ సినిమా క్లయిమాక్స్‌లో ఐఐటి స్టూడెంట్‌ అయిన ఆమిర్‌ ఖాన్‌ తన డీన్‌ కుమార్తె కాన్పును వీడియో కాల్‌లో డాక్టర్‌ అయిన కరీనా కపూర్‌ సలహా ప్రకారం చేస్తాడు. హటాత్తుగా నొప్పులు మొదలై భోరువానలో ఆమె హాస్పిటల్‌కు వెళ్లే పరిస్థితి ఉండనందున ఈ కాన్పు చూసే ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగిస్తూ జరుగుతుంది. జూలై 26 ఆదివారం కర్నాటకలో కూడా ఇలాంటి కాన్పే జరిగింది.

హుబ్లీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉండే హనగల్‌ అనే ఊళ్లో వాసవి అనే మహిళకు డ్యూ డేట్‌ కన్నా ముందే హటాత్తుగా నొప్పులు మొదలయ్యాయి. సహాయం కోసం తక్షణం ఇరుగుపొరుగు స్త్రీలు చేరే సమయానికి ఇంచుమించు ప్రసవం జరిగిపోయే పరిస్థితి ఉంది. భర్త అంబులెన్స్‌కు ఫోన్‌ చేస్తే కరోనా హడావిడి వల్ల రావడానికి 45 నిమిషాలు పడుతుందన్నారు. ఆగే సమయం లేదని సహాయానికి వచ్చిన మహిళలకు అర్థమైంది. వారిలోని ఒకామె తనకు తెలిసిన ప్రియాంక అనే డాక్టరుకు వాట్సప్‌ కాల్‌ చేసింది. ప్రియాంకది ఆ ఊరే. హుబ్లీ కిమ్స్‌లో గైనకాలజీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేస్తోంది. కాన్పు అర్జెన్సీని గ్రహించిన ప్రియాంక ‘నేను వీడియో కాల్‌ ద్వారా మిమ్మల్ని గైడ్‌ చేస్తాను. మీరు కాన్పు చేసేయండి’ అని చెప్పింది.

మహిళలు ఆమె ఉన్నదన్న ధైర్యంతో రంగంలోకి దిగారు. కొత్త బ్లేడ్‌ తెచ్చి కాన్పుకు సిద్ధమయ్యారు. ‘నేను వారికి చెప్పిందల్లా బొడ్డుతాడు ఎలా జాగ్రత్తగా కట్‌ చేయాలన్నదే’ అని చెప్పింది డాక్టర్‌ ప్రియాంక. మహిళలు ప్రియాంక సూచనల ప్రకారం కాన్పు చేయడం, బిడ్డను శుభ్రం చేసి పొడిబట్టలో చుట్టడం, పాలకు తల్లి ఎద దగ్గర పరుండబెట్టడం చేసే సమయానికి అంబులెన్స్‌ వచ్చి తల్లి బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లింది. ‘తల్లిబిడ్డ క్షేమంగా ఉండటం మాకెంతో సంతోషంగా ఉంది’ అని కాన్పులో పాల్గొన్న స్త్రీలు చెప్పారు. ప్రస్తుతం ఆ స్త్రీలు, డాక్టరమ్మ ప్రశంసలలో తడిచి ముద్దవుతున్నారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా