తండ్రివి నీవే చల్లగ కరుణించిన దీవెన నీవే

1 Sep, 2020 02:59 IST|Sakshi

ఒక మహా నాయకుణ్ణి చూసే అదృష్టం ఈ నేలకు దక్కింది. ఒక చరితార్థుడి పాలనలో మసలే ధన్యత ఈ జాతికి దక్కింది. అభయం అనే మాట సింహాసనం ఎక్కితే ఎలా ఉంటుందో చూశాము. సుభిక్షత వర్తమానంలో కూడా సాధ్యమే అని తెలుసుకున్నాము. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కేవలం భౌతికంగా లేరు. కాని ఆ రాజ్యం వర్ధిల్లుతోంది. ఆ సంక్షేమం ముందంజలో ఉంది... ఆ సంస్కారం తలమానికం అయింది. ఆ దయా, ఆ ఆర్ద్రత ద్విగుణం, త్రిగుణం అయ్యాయి... మంచి జయకేతనం ఎగురవేస్తోంది. ప్రజల దీవెనల తోడు తీసుకుని సహస్రవిధాల వికాసం వెలుగులు చిమ్ముతోంది.

పిల్లలు దిగులు ఎరగక చదువుకుంటున్నారు. పసిబిడ్డలు కడుపారా గోరుముద్దను భుజిస్తున్నారు. ప్రతి అమ్మ తన చీరకొంగులో నాలుగు డబ్బులను పదిలంగా ముడివేసుకుంటోంది. బతుకు మీద భరోసాతో రైతు భుజాన నాగలి వేసుకొని పొలం వైపు అడుగులు వేస్తున్నాడు. ఆంధ్రరాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తమ జీవితానికి ఒక ఆసరా ఉందని గుండెల మీద చేతులు వేసుకుని నిదురపోతున్నారు. భీతావహమైన ఈ కరోనా కాలంలో కూడా పేదోడికి వైద్యం ఒక ఫోన్‌కాల్‌ దూరంలోకి వచ్చింది. ఆధునిక వైద్యానికి అన్ని విధాలా హామీ లభించింది. కాళ్లు చాపుకుని పడుకునేందుకు కూడా కల కనలేని నిరుపేద సొంత ఇంటి స్థలం పట్టాను కళ్లకద్దుకోనున్నాడు. కంటి వెలుగుతో చూపును సవరించుకున్న సగటు మనిషి తన రాష్ట్రంలోని సురక్ష పాలనను మరింత స్పష్టంగా చూస్తున్నాడు. ఒకప్పుడు రాజధానిలో మాత్రమే వినే/కనే ‘సచివాలయం’  ఇప్పుడు ప్రతి ఊళ్లో కొలువుదీరింది.

ఇదంతా నువ్వు వేసిన దారి రాజన్నా. నీ మార్గం ధృడతరం అయ్యింది చూడు రాజన్నా. ఏ ఒక్క ప్రాంతమో కాదిక ప్రాధాన్యం. అన్ని ప్రాంతాలదే తిరుగులేని జయం. కృష్ణ పారే నేల కళకళలాడనుంది. విశాఖ సముద్రం సమృద్ధితో గర్జించనుంది. కర్నూలు సీమ సమోన్నతంగా నిలబడనుంది. మూడు ప్రాంతాలకూ ప్రజల రాకపోకలు సాగనున్నాయి. మూడు నేలల తెలుగు ముచ్చట్లాడుకోనుంది. మూడు సంస్కృతుల ముక్కెర మెరవనుంది. కలిసి పడే అడుగులు శక్తిని పుంజుకోనున్నాయి. మంచి రోజులు రావడం మనుషులకే కాదు ప్రకృతికి కూడా తెలుస్తుంది. అందుకే నిండైన వానలతో హర్షధ్వానాలు చేస్తోంది. ఇది నువ్వు పాదు వేసిన పాలన రాజన్నా. ఇది దేవుని ఆశీర్వాదం ఉన్న తెలుగు నేల రాజన్నా.

మహా కట్టడాలు కొనసాగుతున్నాయి. నదుల మహోధృతిని మచ్చిక చేసుకొని కయ్యల్లోకి మళ్లించే పని అద్భుతంగా సాగుతోంది. ఉపాధికి కొత్త ద్వారాలు తెరుచుకుంటున్నాయి. కుల వృత్తులు కొత్త ఊపిరులు పోసుకుంటున్నాయి. నేతన్నల కుటుంబం నిండుగా బట్ట కట్టుకోగలుగుతోంది. ఆర్టీసీ డ్రైవర్‌ స్టీరింగ్‌ను ఆత్మవిశ్వాసంతో పట్టుకుంటున్నాడు. ఆటో డ్రైవర్‌ తనక్కూడా ప్రభుత్వం సహాయం చేస్తుందా అని ఆశ్చర్యపోతున్నాడు. లక్షల మంది కొత్తతరం యువతీ యువకులు వాలెంటీర్లుగా, సచివాలయ సిబ్బందిగా ప్రజాసేవలో మమేకం అయ్యారు.

ఇది నీ పెట్టే చెయ్యి చూపిన ఆనవాయితీ రాజన్నా. ప్రజలకు మేలు చేయడమే ప్రభుత్వ నిబద్ధత అనే నీ మార్గమే రాజన్నా. ప్రతి అక్కచెల్లెమ్మ ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇంటిని చక్కదిద్దుకుంటోంది. పిల్లల నవ్వు ముఖాలను చూసి, చేయడానికి పని దొరుకుతున్న పెనిమిటిని చూసి సంబరపడుతోంది. ఆడపిల్లల రక్షణకు ‘దిశ’ చట్టం ఉక్కుడాలులా రక్షణనివ్వడం ఆమెకు ధైర్యమిచ్చింది. తాగుడు నుంచి మళ్లించే కఠిన చర్యలు భర్తలను తొందరగా ఇల్లు చేర్చుతున్నాయి. ఇంటికి రేషన్, పెద్దలకు పెన్షన్, ఒంటరి స్త్రీలను ఆదుకోవాలనే తలంపు ఇవన్నీ పొయ్యిలోని పిల్లి వైపు బెంగగా చూసే రోజులను తరిమి కొట్టాయి. స్త్రీ సంతోషంగా ఉంటే సమాజం సంతోషంగా ఉన్నట్టే. 

అక్కచెల్లెమ్మలు నీకు పట్టిన హారతికి ఇది కృతజ్ఞత రాజన్నా. నీవు వారి ఆపద్బంధువు అయినందుకు కడుతున్న రక్షాబంధనం రాజన్నా. ప్రజలను పీడించె లంచం ఇప్పుడు ఆ పని చేయడానికి బెదురుతోంది. అవినీతికి చేయి చాపే ఫైలు ఇప్పుడు ఆ మాటంటేనే ఉలిక్కి పడుతోంది. ప్రతి నిత్యం తిప్పుకుంటూ ప్రజల కన్నీరు తాగే∙పాత అవలక్షణాల అధికారం ఇప్పుడు సెట్‌రైట్‌ అయ్యి ‘ఏం సహాయం కావాలి’ అని వినమ్రం అయ్యింది. ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీ అయ్యారు. ప్రజాధనంలోని ప్రతి పైసా తిరిగి ప్రజలకే చేరుతోంది. దళారీలు చేష్టలుడిగి చూస్తున్నారు. రాబందులు తమకు రోజులు కావని దేశాంతరం వెళ్లాయి. ప్రతి ఇంటి పెరడులో  పిచుకలు గింజలకు వాలుతున్నాయి.

ఇది కదా నువ్వు కలగన్నావు రాజన్నా. ఇదిగో సాకరమయ్యింది చూడు రాజన్నా. నీవు లేని లోటు ఎప్పటికీ తీరదు. చిరునవ్వుతో నిలిచే నీ రూపం ఎప్పటికీ మరపుకు రాదు. నువ్వు పంచిన జ్ఞాపకాలు చెరిగిపోవు. కష్టం కనిపిస్తే చాలు చలించే నీ ఆర్ద్రత గుర్తుకొస్తే కళ్లు చెమరుస్తాయి. నువ్వు వేదిక పై ఎక్కి సింహంలా నిలిచిన క్షణాలు ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతాయి. సిసలైన తెలుగుతనం నువ్వు. అసలైన తెలుగు వాగ్దానం నువ్వు. నువ్వు సర్వవ్యాప్తం అవడానికే అంతర్థానం అయ్యావు. తెలుగునేలన నిత్యస్మరణుడివి కావడానికే విరామం ఇచ్చావు.

నీ వారసత్వ ఘనతను చూసి ప్రజాశ్రేణి గర్విస్తోంది రాజన్నా నీ ఇంటి దీపం నీవంటి రూపం దేదీప్యతను, దక్షతను, ధీరోధాత్తతను మెచ్చుకోలుతో చూస్తోంది రాజన్నా సాధించిన లక్ష్యాలకు, సొంతం చేసుకున్న విజయాలకు సలామ్‌ చేస్తోంది రాజన్నా! చెడు చేద్దామని చూసేవారు చెదిరిపోతారు. కుట్రలూ కుతంత్రాలు వీగిపోతాయి. కుత్సిత బుద్ధులు చతికిల పడతాయి. ప్రజల ఈసడింపులో పాములు కొన్ని పడగలు చితికి మాడిపోతాయి. నిలిచేదంతా తెలుగువారి దీప్తి. తెలుగువారి కీర్తి. – సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి 

మరిన్ని వార్తలు