అక్షయ తృతీయ విశిష్టత ఏమిటో తెలుసా?

14 May, 2021 07:37 IST|Sakshi

అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మ. దీనిని  సద్వినియోగం చేసుకుని అనంతమైన పుణ్యఫలాలు అందుకోవాలని అందరూ ఆకాంక్షిస్తారు.  అక్షయ అంటే తరిగిపోనటువంటిది. నేడు చేసే పుణ్యకార్యాల ఫలం అక్షయం చేస్తూ తరగిపోకుండా చేయమని చేసే వ్రతమే అక్షయ తృతీయ వ్రతం.  ఈ రోజు చేసే దేవతా ప్రీతి కర్మలు, జపదాన, హోమాలు క్షయం కానంత మంచి ఫలితాన్నిస్తాయి.  ఈ రోజు చేసే దానాలు అనుష్టానపరులకు, యోగ్యులకు చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు సంతృప్తి చెంది అనుగ్రహిస్తాడని శాస్త్ర వచనం.  మనలో జీవుడు మరొక శరీరంలో ప్రవేశించిన తరువాత కూడా అన్న వస్త్రాలకు లోటు లేకుండా అక్ష్జమై సంపదలు కలుగచేసేదే ఈ పండుగ. సంకల్ప సహిత సముద్రస్నానం విశేష ఫలితాన్నిస్తుంది. నక్త వ్రతం, ఏక భుక్తం విశేషం.

ఈ రోజు పరశురామ జయంతిగా కూడా కొలుస్తారు.  క్లిష్ట సమస్యలకు పరిష్కారం కావాలనుకునేవారు ‘పరశురామ స్తుతి’ ఈ రోజునుంచి  మండల కాలం పారాయణ చేసినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. రోజంతా ఉపవసించి రాత్రి సమయంలో స్త్రీలు లక్ష్మీదేవిని పూజించి కనకధారా స్తోత్రం, శ్రీ సూక్తం, అష్టలక్ష్మీ స్తోత్రం మొదలైనవి పారాయణ చేసినట్లయితే సౌభాగ్యవంతులై వారి కుటుంబాలు సుఖసంతోషాలతో వర్థిల్లుతాయి. ఈ రోజున చల్లని పానీయాలైన నారికేళం, తేనె, చెరకు రసం, గోక్షీరం మొదలైన వాటితో అభిషేకం చేసి, వాటిని గృహమంతా చిలకరించినట్లయితే క్షేమ సౌభాగ్యాలతో, శాంతిప్రదంగా జీవించగలుగుతారు.

జాతక చక్రంలో పితృదోషం ఉంటే, దాని నివారణకు పరమ పవిత్రమైన పుణ్యదినం అక్షయతృతీయ.  మన కంటికి కనిపించే గ్రహాలు సూర్యుడు, చంద్రుడు. సకల పితృదేవతలను సూర్యభగవానునిలో దర్శించవచ్చును.  అక్షయ తృతీయ శుభకాలంలో పితృదేవతలను తలచుకుంటూ అన్నం, నెయ్యి, పప్పు కలిపిన చిన్న ముద్దలను ఎండు కొబ్బరిలో నిక్షిప్తం చేసి ఆహుతి చేసినట్లయితే వంశపారంపర్యంగా శుభఫలితాలు పొందవచ్చునని జ్యోతిష పండితులు చెబుతారు. అక్షయ తృతీయ నాడు శ్రీ మహావిష్ణువుకి చందనం సమర్పిస్తే విశ్వమంతా చల్లగా సుభిక్షంగా వుంటుంది. దేవాలయాలలో ధవళ వర్ణానికి అధిక ప్రాధాన్యమిస్తారు. ధవళ పీత వస్త్రాలతో విగ్రహాలంకారాలు చేస్తారు. ఈ రోజు  చేసే ఏ దానానికైనా అక్షయ ఫలితం ఉంటుంది.  మనం చేసే దాన ఫలితం మన తరువాత తరాలు కూడా అనుభవించ వచ్చును అనే నమ్మకం.  కొన్ని ముఖ్యమైన దానాలు తెలుసుకుందాం

1. స్వయం పాకం – బియ్యం, కందిపప్పు, రెండు కూరలు, చింతపండు, మిరపకాయలు, పెరుగు, నెయ్యి, తాంబూలంతో సహా దానమిస్తే అన్నానికి లోటు ఉండదు అని భావిస్తారు.
2. వస్త్రదానం– ఎర్రని అంచు కలిగిన పంచెల చాపు, కండువా తాంబూలంతో దానమిస్తే వస్త్రాలకు లోటుండదు.
3. ఉదక దానం – కుండ నిండుగా మంచి నీటిని నింపి దానం చేస్తే ఉత్తర కర్మ ద్వారా పరలోక యాత్రకు సహకరించే చక్కని సంతానం కలుగుతుంది. ఉత్తమ గతులు సంప్రాప్తించటానికి ఇది ఎంతో సహకరిస్తుంది.
ఈ రోజు సింహాచల నరసింహుని చందనోత్సవం జరుగుతుంది. సంవత్సర కాలమంతా చందనం పూతలో సేదదీరే స్వామి తన నిజ స్వరూపాన్ని భక్తులకు చూపి కనువిందు చేస్తాడు. స్వామి వారిది ఉగ్రరూపం కావటం వలన, వారికి శాంతి కలుగుటకై చందనాన్ని ఆయనపై లేపనం గా పూస్తారు. ఈ రోజు లక్షలాది భక్తులు స్వామి వారి నిజస్వరూపాన్ని చూడటానికి అన్ని రాష్ట్రాలనుండి తరలి వస్తారు.
ఈ ఆచార వ్యవహారాలు మరుగున పడిపోయి, నేడు బంగారం కొనుగోలుకు మాత్రమే పరిమితమౌతోంది. శ్రీ పార్వతీ పరమేశ్వరులను, శ్రీ లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించి, శక్తి మేరకు దానధర్మాదులు ఆచరించి ఉత్తమ గతులు పొందుదాం. మన తోటివారిని కూడా సుఖసంతోషాలతో జీవించేలా సహకరిద్దాం.        
(నేడు అక్షయ తదియ)
–డా. దేవులపల్లి పద్మజ 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు