ఫొటో తీస్తే ముఖం మీద ఉమ్మేస్తారు!

15 Mar, 2021 00:00 IST|Sakshi
సావర్కర్‌ విగ్రహం 

అండమాన్‌

అండమాన్‌ ప్రజలు అబద్ధం చెప్పరు, మోసం చేయరు. మన వస్తువులను ఎక్కడైనా మర్చిపోయినా కూడా వాటిని తీసుకోరు, తమది కాని వస్తువు కనిపిస్తే పోలీసులకు అప్పగిస్తారు. ఇక్కడ స్థానికులు అంటే బ్రిటిష్‌ కాలంలో అండమాన్‌ జైలు నిర్వహణ కోసం వచ్చిన ఉద్యోగుల కుటుంబాలే. అలా స్థిరపడిన వారిలో బెంగాలీలు, తమిళులు, తెలుగు వాళ్లు చెప్పుకోదగిన సంఖ్యలో ఉంటారు.  

పాన్‌ దో
జార్వాన్‌ అనే ఆటవిక తెగల వాళ్లు వర్షం వస్తే బయటకు రారు. పర్యాటకుల కారణంగా వీళ్లకు పాన్‌ అలవాటైంది. వెళ్లిన వారందరినీ ‘పాన్‌ దో’ అని అడుగుతారు. హిందీలో వీళ్లకు వచ్చిన పదం ఇదొక్కటే. వీళ్లను ఫొటో తీస్తే ఒప్పుకోరు. వాహనంలో 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఫొటో తీసినా సరే అంతవేగంతోనూ పరుగెత్తుకు వచ్చేసి వాహనం ఎదురుగా నిలబడతారు. ఫొటో తీసిన వాళ్ల ముఖాన కోపంగా ఉమ్మేస్తారు.

గోనె దుస్తులు
సెల్యూలార్‌ జైల్‌ దగ్గరకు వెళ్తే మనకు తెలియ కుండానే భావోద్వేగాలకు లోనవుతాం. జాతీయోద్యమంలో పాల్గొన్న మన జాతీయ నాయకులను బంధించిన జైలు గదుల్లో తిరుగుతుంటే ఆ సంఘటనలన్నీ కళ్ల ముందు మెదలుతాయి. స్వాతంత్య్రం కోసం పోరాడిన నాయకులు జైల్లో గోనెసంచులతో కుట్టిన దుస్తులను ధరించారని తెలిసినప్పుడు మనసు పిండేసినట్లవుతుంది. లేజర్‌ షో బ్యాక్‌గ్రౌండ్‌ ఆడియోలో జైలు అధికారి సావర్కర్‌ సెల్‌కు రావడం, గద్దించి ప్రశ్నించడం, సావర్కర్‌ వంటి వీరులు సమాధానం చెప్పడం ఉంటుంది. ఇక్కడి పోర్ట్‌ హాల్‌లో జాతీయపోరాట యోధులను ఉరితీసేవాళ్లు. విచారణ కాలంలో కూడా ఇక్కడే జైల్‌లో ఉంచేవారు.

చూడాల్సిందే
అండమాన్‌ తీరంలో ముత్యాలు వలిచిన చిప్పలు, పగడపు అవశేషాలు, శంఖువులు  ఉంటాయి. వాటిని చూడాల్సిందే తప్ప మనం తెచ్చుకోవడానికి అనుమతించరు. ముత్యాలు, పగడాలు తక్కువ ధరలో వస్తాయి. ఇది కేంద్రపాలిత ప్రాంతం కావడంతో పన్నులు ఉండవు. చాలా వస్తువులు చవగ్గా దొరుకుతాయి, ముఖ్యంగా లిక్కర్‌ సగం ధరకే వస్తుంది.  

మరిన్ని వార్తలు