బాలికలకు ప్రత్యేకం.. డిజైనర్‌ యూనిఫామ్‌

17 Oct, 2020 04:04 IST|Sakshi

ఫ్యాషన్‌ డిజైనర్‌ సబ్యసాచి ముఖర్జీకి ఇండియన్‌ ఫ్యాషన్‌ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ డిజైనర్‌ స్కూల్‌లో చదువుకునే బాలికలకు యూనిఫామ్‌ రూపకల్పన చేసి మరింత ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పుడా చిత్రాలు సోషల్‌ మీడియా వేదిక మీద అందరి ప్రశంసలు పొందుతున్నాయి. 

రాజస్థాన్‌ సిటీ జైసల్మేర్‌లో రాజ్‌కుమారి రత్నావతి బాలికల పాఠశాల ఉంది. ఇందులో 400 మంది బాలికలు చదువుకుంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం మూసిఉన్న ఈ పాఠశాల డిసెంబర్‌లో తెరుచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడి బాలికల కోసం సబ్యసాచి ముఖర్జీ కళాత్మకమైన యూనిఫామ్‌లను రూపొందించారు. సబ్యసాచి దేశీయ చేనేతలను తన డిజైన్ల రూపకల్పనలో ఉపయోగిస్తాడని తెలిసిందే. అలాగే ఈ యూనిఫామ్‌లలో మేలిమి చేనేతలను ఉపయోగిస్తూ వాటిపైన సేంద్రీయ రంగులు, బ్లాక్‌ ప్రింట్‌తో కూడిన అజ్రఖ్‌ ఆర్ట్‌తో డిజైన్‌ చేశారు. ఈ కళాత్మకమైన యూనిఫామ్‌లు ధరించిన అమ్మాయిల ఛాయాచిత్రాలను సబ్యసాచి ముఖర్జీ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ పేజీలో పంచుకున్నారు. 

యూనిఫామ్‌ మీద స్థానిక కళ
మోకాలి పొడవున ఏకరీతిగా ఉండే ఫ్రాక్‌. గుండ్రటి మెడ, త్రీ క్వార్టర్‌ స్లీవ్స్, మెరూన్‌ స్లగ్స్‌తో ఉన్న ఈ యూనిఫామ్‌కి ప్యాచ్‌ చేసిన రెండు పాకెట్స్‌ కూడా ఉన్నాయి. ఈ ఫ్రాక్స్‌పైన అజ్రఖ్‌ ప్రింట్‌ ఉంటుంది. అజ్రఖ్‌ అనేది రాజస్థాన్, గుజరాత్‌ల వారసత్వ కళ. ఇది హరప్పా కాలం నాటిదిగా చరిత్ర చెబుతోంది. సాధారణంగా ఈ ప్రింట్‌ను ఖనిజ, కూరగాయల రంగుతో తయారు చేస్తారు. అజ్రఖ్‌ ప్రింట్‌ ఉన్న దుపట్టాలను ఆడ–మగ తేడా లేకుండా ధరిస్తుంటారు. ‘అజ్రఖ్‌ భారతీయుల శక్తివంతమైన శైలి. మన దేశంలో పిల్లలు కూడా ధరించడానికి అనువుగా దుస్తుల శైలి ఉండాలి. అజ్రఖ్‌ స్థానిక వారసత్వం. ఇక్కడి కళ ప్రాముఖ్యత ఈ విధంగా పిల్లలకు అర్ధమవుతుంది. స్థానిక కళకు ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే అజ్రఖ్‌ ఆర్ట్‌ను యూనిఫామ్‌కు వాడుకున్నాను’ అని తెలిపారు సబ్యసాచి. అంతేకాదు ఈ యూనిఫామ్‌కు ‘అజ్రఖ్‌’ అనే పేరు పెట్టారు. ‘బాతిక్, ఇకత్‌తో పాటు అంతర్జాతీయంగా గౌరవనీయమైన వస్త్రాల పంధాలోకి అజ్రఖ్‌ ప్రవేశిస్తుంది. ఇండిగో, మాడర్‌ రూట్‌ రంగులతో ముద్రించడంతో కాటన్‌ క్లాత్‌ చాలా ఆకర్షణీయంగా మారింది’ అని అజ్రఖ్‌ కళ గురించి మరింతగా వివరించారు సబ్యసాచి. ఇటీవల సిట్టా అనే లాభాపేక్షలేని సంస్థతో కలిసి పనిచేశారు సబ్యసాచి. 

కళా నైపుణ్యాలపై శిక్షణ
సిట్టా భారతదేశంలోని పేదల విద్య, ఆరోగ్యం వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పనిచేస్తుంది. బాలికల విద్య, స్థానిక మహిళలకు సంప్రదాయ కళా నైపుణ్యాలపై అధికారికంగా శిక్షణ ఇవ్వడానికి శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. వీరి సహకారంతో ఈ డిజైనర్‌ 400 మంది బాలికలకు యూనిఫామ్‌ రూపకల్పన చేసి ఇచ్చాడు. 
సంప్రదాయ హస్తకళలను తీసుకొని వాటిని సమకాలీన డ్రెస్సింగ్‌కు తగినట్లుగా యూనిఫామ్‌లను రూపకల్పన చేశారు డిజైనర్‌ సబ్యసాచి. స్థానిక సహకార కేంద్రం ఉత్పత్తి చేసే అజ్రఖ్‌ ప్రింట్‌ను ఉపయోగించి పాఠశాల బాలికల కోసం యూనిఫామ్‌లను రూపొందించారు. దీని వల్ల స్థానిక సహకార కేంద్రంలో పనిచేస్తున్నవారికి ఉపాధి పెరిగింది. 

మరిన్ని వార్తలు