50 ప్లస్‌లో అదరగొడుతోంది..

18 Feb, 2021 01:41 IST|Sakshi

ర్యాంప్‌ వాక్‌ అనగానే జిగేల్మనే లైట్ల వెలుగులు... ఆ వేదిక మీద అంతకన్నా జిగేల్మనే భామలు కళ్ల ముందు మెదులుతారు. కానీ, 50 ఏళ్ల వయసులో  ముంబైకి చెందిన శ్రీమతి గీతా జెనా మోడలింగ్‌ చేస్తూ..
అందాల పోటీల్లో పాల్గొనడమే కాకుండా ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచి ప్రశంసలు అందుకుంది.

‘‘ఒక వయస్సు తర్వాత మహిళలు ప్రకటనలలో తల్లులుగా మాత్రమే ఎందుకు కనిపించాలి? అని నాకు నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడే,  మోడలింగ్‌ను వృత్తిగా ప్రారంభించాను. అందుకు నన్ను నేను మెరుగులు దిద్దుకున్నాను. నిజానికి టీనేజ్‌ నుంచి మోడల్‌ని అవాలని కల. దానికి తగ్గట్టే సరిగ్గా అప్పుడే గుజరాతీ సినిమాలో నటించే అవకాశం వచ్చింది, కానీ, మా ఇంట్లో అందుకు ఒప్పుకోలేదు.

కుటుంబ బంధం
చదువుకునే వయసులోనే పెళ్లి చేసేశారు.  చాలా ఏళ్లు కుటుంబ జీవనంలో బిజీగా ఉండిపోయాను. కానీ.. ఏదో వెలితి. నా సొంత గుర్తింపు కావాలనుకున్నాను. పిల్లలు పెరిగే వయసులో ప్రీ స్కూల్లో టీచర్‌గా చేరాను. కానీ, అక్కడ డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరి. షిఫాన్‌ చీరలు అస్సలు కట్టకూడదని చెప్పారు. దాంతో ఆ నిబంధనలన్నీ పాటించాను.

మూడేళ్ల క్రిందట..
నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మోడలింగ్, బ్యూటీ కాంటెస్ట్‌లపై దృష్టి పెట్టేదాన్ని. 2019లో, నా కల నెరవేర్చుకునే సమయం పలకరించింది. ‘ఇండియా బ్రైనీ బ్యూటీ కాంటెస్ట్‌’లో పాల్గొనే అవకాశం రావడం, అందులో ఫస్ట్‌ రన్నరప్‌గా పోటీలో నిలవడం ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్నీ ఇచ్చింది. ఇప్పుడు 2021 సెకండ్‌ సీజన్లో, జ్యూరీ సభ్యులలో ఒకరిగా అవకాశం లభించింది. 50 ఏళ్ల వయసులో ర్యాంప్‌పై ఎలా నడవాలో నేర్చుకున్నాను. రన్నరప్‌ టైటిల్‌ గెలుచుకున్న తర్వాత నా ప్రొఫైల్‌ బయటకు వచ్చింది. స్టార్టప్స్‌ నుంచి చిన్న బ్రాండ్ల వరకు మోడలింగ్‌కి అవకాశాలు వచ్చాయి. అయితే, నా వయస్సు తెలుసుకొని, వారు వెనక్కి తగ్గారు.

ప్లస్‌ సైజ్‌ మోడలింగ్‌..
ప్లస్‌ సైజ్‌ మోడల్స్‌ విషయానికి వస్తే బాడీ ఫిట్‌నెస్‌కు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. దీంతో ఈ విభాగంలో పనిచేయాలనుకున్నాను. కానీ, ఇందులోనూ నా ఫిట్‌నెస్‌ నాకు అవకాశాలు రానీయకుండా చేస్తుందని గుర్తించాను. ఒక జత ఫాన్సీ లోదుస్తులు, యాక్టివ్‌ వేర్‌ కోసం ఆన్‌లైన్‌లో విపరీతంగా శోధించాను. ఈ ప్రకటనలలో ఏ భారతీయ బ్రాండ్‌కు వయసు ప్రాతిపదికన సరైన మోడల్స్‌ లేరని తెలుసుకున్నాను. పాశ్చాత్య దేశాల్లో కూడా వయసు పైబడిన స్త్రీ లో దుస్తులకు మోడల్‌గా కనిపించదు. దీనివల్ల ‘ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత ఇక మీరు కొన్ని రకాల బట్టలు ధరించడానికి తగినవారు కాదని ఒక సందేశం పంపడంగా భావించాను. దీంతో లో దుస్తులతోపాటు అన్ని రకాల ఉత్పత్తులకు అన్ని వయసుల వారిని మోడలింగ్‌లోకి తీసుకోవాలని ఆన్‌లైన్‌ పిటిషన్‌ ప్రారంభించాను. కాబట్టి ఇప్పుడు మోడలింVŠ  మొదలు పెట్టాను. లోదుస్తుల వెబ్‌సైట్‌నూ ప్రారంభించాను. నలభై ఏళ్లు పైబడిన మహిళలు తమ ఏకైక ఎంపిక చీరలు, సల్వార్‌ కమీజ్‌ మాత్రమే అని భావించకూడదు. లో దుస్తుల బ్రాండ్‌  ఈ మూసను విచ్ఛిన్నం చేస్తే అది అన్నిరకాల జీవనశైలి బ్రాండ్‌లకు పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది’’ అని వివరిస్తోంది ఈ యాభై ఏళ్ల మోడల్‌ గీతా జెనా.

మరిన్ని వార్తలు