విశ్వాసానికి శుభ శుక్రవారం

2 Apr, 2021 08:02 IST|Sakshi

సమయం మధ్యాహ్నం 3 గంటలు. అప్పుడే ఓ భయంకరమైన దుర్ఘటన జరిగింది. మానవాళి సిగ్గుతో తల దించుకోవలసిన సంఘటన అది. ఈ దృశ్యం చూడలేక భూన బోంతరాలు దద్దరిల్లినవి. కొండలు పగిలాయి. దేవాలయంలో తెర రెండుగా చిరిగిన రోజది. దేవాది దేవుడు తన ఏకైక కుమారుడైన ఏసుక్రీస్తును లోకానికి నరావతారిగా పంపాడు. అయితే అవినీతి పరులైన మతాధికారులు, దుష్టప్రజలు యేసు చెప్పిన పవిత్రమైన నీతిబోధలకు తాళలేక ఆయనను శిలువ వేసిన రోజది. 

క్రీ.పూ 700 సంవత్సరాలు. యెహోవా అనే భక్తుడు ఈ దుస్సంఘటన గురించి ఇలా ప్రవచించాడు. మన అతిక్రమ క్రియలే అతడిని (క్రీస్తు) గాయపరిచాయి. మన సమాధానార్థమైన శిక్ష అతనిపై పడింది. అతని దెబ్బలతో మనకు స్వస్థత కలుగుతోంది. (యెష 53:5).

ఆకాశం, భూమి, సముద్రాలలోనున్న సమస్తాన్ని సృష్టించిన దేవుడు పాపాలతో నశించే మానవులను కాపాడేందుకు యేసును భూమిపై అవతరింప జేసాడు. పవిత్ర రక్తం చిందిస్తేనే తప్ప వేరే మార్గంలో పాప విముక్తి కలుగదని వేదాలు ఘోషిస్తున్నాయి. ఏసంటే రక్షకుడని క్రీస్తు అనగా అభిషిక్తుడని భావం. పాప పంకిలం నుండి నరుడు విముక్తి పొంది, పవిత్ర జీవితం గడిపి స్వర్గానికి బాట నిర్దేశించే నీతి నియమాలతో కూడిన ప్రణాళికను ప్రభువైన ఏసు విశదం చేశాడు. సాతాను ఏర్పరిచిన ధనం, కీర్తి, సౌఖ్యం, వినోదం, అశ్లీలతతో కూడిన లైంగికానందాలనే పంచరంగుల వలలో మానవుడు చిక్కుకున్నాడు.

ఆ వల నుండి నరుని విముక్తి చేయడమే ఏసుక్రీస్తు ధ్యేయం. ఆశతో ఎగబాకే ఆయా రంగాల్లో ఎంత ఉచ్చస్థితి సాధించినా హృదయానికి తృప్తి, మానసికానందం లభించడం లేదు. అవన్నీ దూరపు కొండలే కదా!ఏసు తానే దైవకుమారుణ్ణని చెప్పినా యూదులంగీకరించలేదు. అక్రమ సంపాదపరులైన మతాధిపతులు తమ అన్యాయార్జితం క్రీస్తు సద్బోధలతో ఎక్కడ దూరమవుతుందోనని భయాందోళనలకు గురై ఎలాగైనా క్రీస్తును చంపేందుకే కుట్ర పన్నారు. తత్ఫలితంగా న్యాయాధికారి పిలాతు కు తప్పుడు సాక్ష్య నివేదిక సమర్పించారు. 

ఆనాటి ఇశ్రాయేలీయుల రాజైన హేరోదుపై కూడా క్రీస్తును అంతం చేయాలని ఒత్తిడి తెచ్చారు. దాంతో చెయ్యని నేరాన్ని పవిత్రుడైన ఏసుపై ఆపాదించి శిక్షకు పరాకాష్ట అయిన శిలువ మరణమనే శిక్ష వేశారు. ఆ విధంగా శిలువ మరణం పొంది, తాను చెప్పిన ప్రకారం సమాధి చేధించుకుని మూడోనాడు ఏసు మృత్యుంజయుడై లేచి వచ్చాడు. ఆ రోజే గుడ్‌ఫ్రైడే. శుభ శుక్రవారం. సమాధి లోనుండి ప్రభువు తిరిగి లేచిన మూడవ రోజు ఆదివారం. దానినే ఈస్టర్‌ పండుగ అని పిలుస్తారు. ఇది క్రైస్తవులకు గొప్ప పండుగ.

ప్రపంచమంతా వారంలో ఒక్కరోజు (ఆదివారం) అన్ని వ్యాపారాలు, పనులు మాని జనులు గుంపులుగా, సమూహాలుగా కూడి ఆయనను ఆరాధించేందుకు వెడతారు. ‘‘చివరిగా చెప్పాలంటే, ఏసుక్రీస్తు మానవ జాతికి దేవుడిచ్చిన గొప్ప బహుమానం. దీన్ని పొందేందుకు మనం ప్రయాసపడాల్సిందేమీ లేదు. ఆయన్ను విశ్వసించడం తప్ప. 

ఓ భక్తుడు ఏసు గురించి చెబుతూ ‘‘2020 సంవత్సరాల క్రితం అరుదైన రీతిలో ఒక మనుష్యుడు జన్మించాడు. అతడు పేదరికంలో పుట్టి పేదరికంలోనే పెరిగాడు. అతడు ఎక్కువ దూరం ప్రయాణం చేయలేదు. ఓ సారి తన దేశ సరిహద్దులు దాటి వెళ్లి కొద్దికాలం అక్కడ జీవించాడు. పేరు ప్రఖ్యాతులు, ఆస్తి అంతస్థులు అతనికి లేవు. ఆయన బంధువర్గమంతా సామాన్యులే. విద్యావంతులు కారు, ఆయన ఏ విధమైన మందులు వాడకుండానే ఆ మహానుభావుడు రోగులను బాగు చేశాడు. అయితే దాని కోసం వారి దగ్గర ఏ ప్రతిఫలం ఆశించలేదు. ఒక పుస్తకం కూడా ఆయన రాయలేదు. కానీ దేశంలో ఉన్న గ్రంథాలయాలన్నీ ఆయన గురించి రాసిన పుస్తకాలకు సరిపోవు. ఒక పాట కూడా ఆయన రాయలేదు.

కాని పాటల రచయితలందరికి ఆయన కేంద్ర బిందువయ్యాడు.  ఒక కళాశాలను కూడా ఆయన స్థాపించలేదు. కాని ప్రపంచంలోని విద్యార్థులందరిని కలిపినా ఆయనకున్నంత మంది విద్యార్థులుండరు. ఎప్పుడూ ఆయన ఒక సైన్యాన్ని తయారు చేయలేదు. ఒక తుపాకీ గుండూ ఆయన పేల్చలేదు. అయినా అందరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారు.  ఆయన ఎప్పుడూ మానసిక వ్యాధులకు మందులివ్వలేదు. అయితేనేం, మానసిక రోగుల నిమిత్తం పని చేసే మానసిక వైద్యులందరూ కలిసి బాగుచేయలేనంత మంది పగిలిన హృదయాలను ఆయన బాగు చేశాడు. 

మరిన్ని వార్తలు