యంగ్‌ టాలెంట్‌ విభిన్న ఆకాశం

3 Jan, 2021 03:39 IST|Sakshi

కాసేపు కేఫ్‌లో పాప్‌ మ్యూజిక్‌తో కచేరీ ఇస్తుంది. ఇంకాసేపు ఓ ప్రసిద్ధ బ్రాండ్‌ కోసం మోడలింగ్‌ చేస్తుంది. ఆ తర్వాత కిక్‌ బాక్సింగ్‌తో దడదడలాడిస్తుంది. థియేటర్‌ ఆర్టిస్టుగా వేదికపై అదరగొడుతుంది. గుర్రపు స్వారీలో గాలితో పోటీపడుతుంది. తాను కన్న కలలను కళాత్మకంగా మలచుకుని పంతొమ్మిదేళ్ల వయసులో విభిన్న రంగాల్లో రాణిస్తున్న సంజన ఆకాశం హైదరాబాద్‌లో ఎల్‌ఎల్‌బి చేస్తోంది.   ఒకేరంగంలో ప్రతిభ చూపితేనే సరైన అవకాశాలు వస్తాయనుకునేవారి ఆలోచనలకు సంజన కళ్లెం వేస్తోంది. విభిన్నరంగాల్లో ప్రతిభను చూపుతూ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్న సంజన ఇన్ని కళలను
ఎలా సుసాధ్యం చేసుకుంటున్నదో వివరించింది.

‘‘జీవితం ‘కళ’వంతంగా గడవాలంటే ఎక్కడా బోర్‌ అనిపించకూడదు. మెదడు చురుగ్గా ఉండాలంటే నచ్చిన వాటిని ఇష్టంగా ఎంచుకుంటూనే, నచ్చని వాటితోనూ పోటీ పడాలి. అప్పుడే విజయతీరాలను చేరుకోవచ్చు. నాలో నటి ఉందనే విషయం మూడేళ్ల క్రితం వరకు తెలియదు. ‘మూడేళ్ల క్రితం సమాహార థియేటర్‌ వర్క్‌షాప్‌ చూసినప్పుడు నేనూ వారితో కలిసి పని చేయాలనుకున్నాను. సమాహార థియేటర్‌ వర్క్‌షాప్‌లో పాల్గొని, నటన నేర్చుకున్నాను. ‘పంచ్‌లైడ్‌’ అనే బిహారీ హిందీ నాటకంలో చేశాను. ఛాలెంజింగ్‌గా అనిపించే అందులోని స్త్రీ పాత్ర నన్ను మరిన్ని నాటకరంగ పాత్రల్లో ఒదిగిపోయేలా చేసింది. అప్పటికప్పుడు లైవ్‌లో ప్రదర్శన ఉంటుంది. ఎంతో నేర్చుకోవచ్చు. ప్రజెంటేషన్, పంక్చువాలిటీ.. అన్నీ థియేటర్‌ నేర్పిస్తుంది.

హుషారు నింపిన పాప్‌ అండ్‌ రాక్‌

ఆరవ తరగతి నుంచి పాప్‌ అండ్‌ రాక్‌ సాంగ్స్‌ పాడుతూ వచ్చాను. లండన్‌ ట్రినిటీ మ్యూజిక్‌ కాలేజీ టీమ్‌ మెంబర్స్‌తోనూ కలిసి వర్క్‌ చేశాను. ఇప్పుడు సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా ఆల్బమ్స్‌ విడుదల చేస్తున్నాను. లాక్‌డౌన్‌ ముందు వరకు రాక్‌ అండ్‌ పాప్‌ బ్యాండ్స్‌తో కలిసి షోలు చేసేదాన్ని. లాక్‌డౌన్‌ సమయం నా కళల సాధనకు మరింత ఉపయోగపడింది. ప్రొఫెషనల్‌ వీడియోలు చేయడం, ఆ¯Œ లై¯Œ లో పోస్ట్‌ చేయడం ద్వారా సోషల్‌మీడియా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాను.

భయం పోగొట్టిన ర్యాంప్‌వాక్‌
‘వేదవస్త్రం’ అనే బ్రాండ్‌ ఫ్యాబ్రిక్‌కు మోడలింగ్‌ చేస్తున్నాను. అమ్మ ఫ్యాషన్‌ డిజైనర్‌. తను బొటిక్‌ నడుపుతుంది. తను డిజైన్‌ చేసిన డ్రెస్సులు అమ్మ నా మీద ప్రయోగించేది. అలా మోడలింగ్‌ వైపు వచ్చాను. ర్యాంప్‌వ్యాక్‌ బాగా ఇష్టం. మొదట్లో నలుగురిలోకి వెళ్లాలంటే కొంచెం బెరుకుగా ఉండేది. మోడలింగ్‌తో ఇప్పుడా భయం పోయింది.

సాహసాల స్వారీ

కళల నుండి అడ్వంచర్స్‌ వైపు దృష్టి మొదట్లో టీవీ ప్రోగ్రాముల్లో చూసినప్పుడు మళ్లింది. అమ్మానాన్న అనుమతితో హార్స్‌రైడింగ్‌ నేర్చుకున్నాను. అక్కడి ట్రెయినర్‌ మంచి లాయర్‌ కూడా. ఆమెలా నేనూ అడ్వకేట్‌గా రాణించాలనుకున్నాను. అందుకే, లా చదువుతున్నాను. అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య అవసరమనుకున్నాను. అంతేకాదు, ఆత్మవిశ్వాసానికీ కిక్‌బాక్సింగ్‌ బాగా పనిచేస్తుంది. అందుకే, కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. నా వయసువారికి కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ ఇస్తున్నాను.

అటు కళలు .. ఇటు చదువూ
థియేటర్‌ రిహార్సల్స్‌ ఉన్నప్పుడల్లా, బ్రేక్‌ టైమ్‌లో చదువుకోవడానికి స్కూల్‌ బుక్స్‌ తీసుకువెళ్లేదాన్ని. అలా ఇటు చదువు, అటు కళలను రెండింటినీ బ్యాలెన్స్‌ చేయగలిగాను. 14 ఏళ్ల వయసు నుంచి నా గొంతును కాపాడుకోవాలనే ధ్యాస పెరిగింది. దీంతో ఐస్‌క్రీమ్‌లు తినడం, కూల్‌ డ్రింక్స్‌ తాగడం మానేశాను. స్కూల్‌ చదువులో అంతగా రాణించేదాన్ని కాదు.  కళలపై ఇంట్రస్ట్‌ చూపేదాన్ని. దీంతో మా నాన్న రఘునాథ్‌ నన్ను ఆ దిశగా ప్రోత్సహించారు. అమ్మ భార్గవి నాకు మేకప్‌ నేర్పించింది. మేకప్‌ క్లాసులకు కూడా తీసుకెళ్లేది. దీంతో సహనం అబ్బింది’ అని వివరించింది సంజన.

మిగతావన్నీ ప్యాషన్‌. ‘లా’ నా ప్రొఫెషన్‌ అని వివరించిన సంజన ఇప్పుడు ఎంబీబిఎస్‌ రెండవ సంవత్సరం చదువుతోంది. చార్టర్డ్‌ అకౌంటెంట్‌ అయిన తండ్రి రఘునాథ్‌ ఆకాశం, తల్లి భార్గవి లు తాను కళల్లో రాణించడానికి ఎంతో సహకారం అందించారని తెలిపిన సంజన తాను పఠించే మంత్రాల గురించి తెలిపింది. మొదటిది చొరవ. రెండవది కఠోర శ్రమ. మూడవది స్థిరత్వం. నాల్గవది సహనం. ఎవరైనా సరే కోరుకున్నది సాధించాలనుకునే వారందరికీ ఇవి మంత్రాల్లా పనిచేస్తాయి.

– నిర్మలారెడ్డి
 

మరిన్ని వార్తలు