లక్ష్యమంటే లోతైన జ్ఞానానికి మెట్టు..

23 Oct, 2020 02:51 IST|Sakshi
దాదాజీ

తత్వవేత్త, సామాజికవేత్త పాండురంగ శాస్త్రి ఆథావలే జీవితం, శాస్త్రీజీ అని, దాదాజీ అని ప్రేమగా పిలుచుకునే ఆథావలే దృష్టిలో లక్ష్యమంటే ఒక ప్రాజెక్టునో లేదా బడ్జెట్‌నో పూర్తి చేయడానికి నిర్దేశించుకునేలాంటిది కాదు. సువిశాలమైన, లోతైన జ్ఞానానికి మెట్టు. సరైన లక్ష్యం మానవ జీవితాన్ని మార్చేస్తుంది. వందేళ్ల క్రితం ఆనాటి బొంబాయి నగరంలో ఒక సనాతన కుటుంబంలో పుట్టిన దాదాజీ వేదాలను అధ్యయనం చేశారు. మార్క్స్‌ను చదివారు. తత్త్వవేత్తలైన సోక్రటీస్‌ నుంచి రస్సెల్‌ వరకు లోతుగా అధ్యయనం చేశారు. వేదాలను నేటి ఆధునిక జీవన విధానానికి అన్వయించుకునే విధంగా సరళమైన భాషలో రచనలు చేశారు.

సామాన్యులకు కూడా వేద విజ్ఞానాన్ని అందించాలని తపన పడ్డారు. విశ్వాసం, కులం, వయసు, సమర్థత, రాజకీయ అనుబంధాలకు అతీతంగా సర్వమానవాళికీ వర్తించేలా కొన్ని సూత్రాలను ప్రతిపాదించారు. దేనినైనా నమ్మడం వేరు, ఆచరించడం వేరు. తెలుసుకోవడానికీ, తెలిసిన దానిని అమలు పరచడానికి ఎంతో వ్యత్యాసం ఉందని, ఆచరణ అన్నింటికన్నా ముఖ్యమైనదని చెప్పిన దాదాజీని, ఆయన శిష్యులను స్వాధ్యాయులు అని పిలిచేవారు. నేటి ఆధునిక శాస్త్రవేత్తలు చెబుతున్న పర్యావరణ పరిరక్షణ, జీవ సమతుల్యతల ఆవశ్యకత గురించి దాదాజీ ఏనాడో చెప్పారు. దాదాపు 20 గ్రామాలలో వృక్షాలు నాటించి, అవి పెరిగి పర్యావరణాన్ని పచ్చగా మార్చడం, తద్వారా మానవ జీవితాలు  ఏ విధంగా ఫలప్రదం అవుతాయో గ్రామస్థులు స్వయంగా తెలుసుకునేలా చేశారు. ఆయన బోధలన్నీ విశ్వమానవుల ఆత్మగౌరవానికి తోడ్పడేవే. అక్టోబర్‌ 19 ఈ గౌరవనీయ తాత్వికుడి శతజయంతి. ఆరోజును ఆయన అనుయాయులు మానవాళి ఆత్మగౌరవ దినోత్సవంగా జరుపుకున్నారు. 
  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు