వేసవిలో మొక్కలు ఆరోగ్యంగా ఉండాలంటే...

13 Mar, 2021 00:27 IST|Sakshi

వేసవిలో మొక్కలను చాలా జాగ్రత్తగా కంటిపాపలా చూసుకోవాలి. కొన్ని మొక్కలు వేసవిలోనే బాగా పెరుగుతాయి. ఆకులు రాలి, కొత్తగా చిగురుస్తాయి, మరికొన్ని మొక్కలు ఎండిపోతాయి. అయితే ఎక్కువ కాలం ఉండే మొక్కలు పెరగడానికి వేసవికాలం అనువుగా ఉంటుంది. అందువల్ల వేసవిలో పెరిగే మొక్కల గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో పెంచుకొనే మొక్కలు వేసవిలో వడిలిపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇండోర్‌ ప్లాంట్స్‌ ఇంట్లో స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. వీటిని సూర్యరశ్మి నేరుగా తగలని ప్రాంతాలలో ఉంచాలి.

బాగా ఎండలు మొదలు కాకుండా అంటే మార్చి, ఏప్రిల్‌ మాసాలలో మొక్కలను ట్రిమ్‌ చేయాలి. ఎండిన ఆకులు, కొమ్మలను తీసేయాలి. మొక్కలకు నీళ్లు ఎంత అవసరం అన్న సంగతి కుండీలోని మట్టిని తాకగానే తెలిసిపోతుంది. తాకగానే ఎండినట్లు అనిపిస్తే వెంటనే నీళ్లు పోయాలని అర్థం. నెలకి ఒకసారి ఏదైనా ఎరువుల రసాయనాన్ని నీళ్లలో కలిపి తగు మోతాదులో మొక్కలకు పోయాలి. అలా చేయటం వల్ల మొక్కలు ఆరోగ్యంగా, పచ్చగా కనిపిస్తాయి. అలాగని మోతాదు పెరిగితే మాత్రం మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది.

మొక్కలు పెద్దవయ్యేకొద్దీ వేళ్లు విస్తరిస్తుంటాయి. కాబట్టి మొక్కల సైజును బట్టి చిన్న కుండీలో ఉన్న మొక్కలను పెద్ద కుండీలలోకి మార్పు చేయటానికి ఇది అనువైన కాలం. ఇండోర్‌ మొక్కలను సూర్యరశ్మి నేరుగా పడకుండా చూసుకోవాలి. గదిలో ఉండే ఉష్ణోగ్రత సరిపోతుంది. ఈ మొక్కలకు చెదలు పట్టవు. పురుగుల బెడద కూడా ఉండదు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా రెండు చుక్కల వేప నూనెను నీళ్లలో కలిపి మొక్కల మీద పిచికారీ చేయటం మంచిది. ఇలా చేయటం వల్ల మట్టి నుంచి  సంక్రమించే తెగుళ్లు రాకుండా నివారించుకోవచ్చు. మొక్కలను ఎప్పుడూ ఒకేచోట ఉంచకూడదు. ఒకటి లేదా రెండు వారాలకు ఒకసారి స్థలం మారుస్తూ ఉండాలి.

మరిన్ని వార్తలు