Ramappa Temple: ఇక... అన్ని దారులూ ఇటువైపే!

6 Aug, 2021 23:00 IST|Sakshi

రామప్ప గుడి

ఎనిమిది వందల ఏళ్ల కిందటి మాట. రేచర్ల రుద్రుడు ముచ్చటపడి నిర్మించిన ఓ నిర్మాణం. ప్రాశస్త్యానికి కొదువలేదు...  కొరవడింది ప్రచారమే. మన వాస్తుశిల్పుల నైపుణ్యానికి  ఇది ఓ మచ్చుతునక. అయినా ఇటువైపు తిరిగి చూసిన వాళ్లు ఎందరు?

వాస్తుశిల్పి రామప్ప పేరుతో రామప్ప గుడిగా వ్యవహారంలోకి వచ్చిన రుద్రేశ్వర ఆలయం నిర్మాణనైపుణ్యం గురించి చెప్పుకుంటూ పోతే పేజీలు చాలవు. ఓ గ్రంథమే రాయాలి. కాకతీయులు స్వతంత్ర రాజులైన తర్వాత నిర్మాణశైలిలోనూ స్వతంత్రతను, సృజనాత్మకతను ప్రదర్శించారు. కాకతీయుల తర్వాత ఈ ఆలయం ఆదరణకు నోచుకోలేదనే అభిప్రాయమే బలంగా ఉంది. కానీ ఇది వాస్తవం కాదంటారు పురావస్తు పరిశోధకులు, స్థపతి డాక్టర ఈమని శివనాగిరెడ్డి. నిజాం రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంతో కలిసిన తరవాత ప్రభుత్వం రామప్పగుడికి సమీపంలో ఒక గెస్ట్‌ హౌస్‌ కట్టించి పర్యాటక ప్రాధాన్యం కల్పించింది. అయితే పర్యాటక ప్రదేశంగా రావల్సినంత ప్రాముఖ్యత రాకపోవడానికి కారణం ప్రచారం పెద్దగా లేకపోవడమే. డాక్టర్‌ సి. నారాయణరెడ్డి, పీవీ నరసింహారావు రచనలతో ఈ నిర్మాణం వెలుగులోకి వచ్చింది. కానీ ఆ తర్వాత కూడా చాలాకాలం శ్రీకాకుళం వాళ్లకు కానీ చిత్తూరులోని సామాన్యులకు కానీ దీని గురించి తెలియనే తెలియదు. పత్రికలు కథనాలు రాయడం, టీవీలు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయడంతో ఇక్కడ ఇంత గొప్ప నిర్మాణం ఉందనే సంగతి సామాన్యులకు చేరింది. ఈ ప్రదేశం కేంద్రపురావస్తుశాఖ అధీనంలో ఉండడం కూడా ఒక కారణమే. పురావస్తు శాఖ ఒక సైట్‌ను పరిరక్షిస్తుంది తప్ప ప్రచారం కల్పించి పర్యాటకులకు సౌకర్యాలు కల్పించలేదు. అది రాష్ట్రప్రభుత్వాల పని. ఈ నిర్మాణం నిర్లక్ష్యానికి గురైందని చెప్పలేం. కానీ కొంతమేర ఆక్రమణలకు గురైన మాట నిజం. 2008 నుంచి మొదలైన ఒక ప్రయత్నం ఇప్పటికి నెరవేరింది. ఈ మధ్యలో చాలా జరిగాయి. మనదేశంలో ఉన్న హెరిటేజ్‌ కమిటీ పాలంపేటలో పర్యటించి... ఆక్రమణలను తొలగించమని, నిర్మాణాన్ని రీస్టోర్‌ చేయమని ఇంకా అనేక సూచనలు చేసింది. కేంద్రప్రభుత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ శాఖ, కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో ఈ పదకొండేళ్ల కాలంలో చాలా పనులు జరిగాయి. గుడి వాస్తుశైలి, నీటి మీద తేలే ఇటుకలతో నిర్మాణ ప్రతిభ ఎంత గొప్పగా ఉన్నప్పటికీ యునెస్కో నియమావళికి తగినట్లు ఇతర ఏర్పాట్లకు కొంత సమయం పట్టింది.

ఇన్నాళ్లూ ఎందుకిలా!
రామప్ప గుడి నిర్మాణశైలిపరంగా, శిల్పలాలిత్యపరంగా ఎంత విశిష్టమైనదైనప్పటికీ పర్యాటకుల మనసును పెద్దగా తాకలేదు. కాకతీయుల నిర్మాణాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్లు సాధారణంగా హైదరాబాద్‌ నుంచి ఉదయం బయలుదేరి నేరుగా హన్మకొండకు వెళ్లి వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం చూస్తారు. వరంగల్‌ కోటను చూస్తారు. వరంగల్‌ కోట చూడడానికి షెడ్యూల్‌లో అనుకున్న టైమ్‌కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత రామప్ప గుడి ఉంటుంది ప్రణాళికలో. అయితే భోజనాలు పూర్తయ్యేటప్పటికి మూడున్నర అయిపోతుంది. ఇప్పుడు రామప్పగుడికి వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు చేరేటప్పటికి ఎంత టైమవుతుందోనని మెల్లగా పునరాలోచన మొదలవుతుంది. గైడ్‌లు, స్నేహితులు కూడా తమవంతుగా నిరుత్సాహపరిచేవాళ్లు. పర్యాటకుల డైలమాను పోగొట్టడానికి ‘రామప్ప గుడి కూడా వేయిస్తంభాల గుడి ఉన్నట్లే ఉంటుంది. పైగా రెండూ శివాలయాలే. మళ్లీ అంతదూరం వెళ్లడం ఎందుకు? దూరం వంద కిలోమీటర్ల లోపే. అటవీ ప్రాంతం. తిరిగి వచ్చే సమయానికి చీకట్లు అలుముకుంటాయి. అక్కడ ఉన్నవి కూడా ఇలాంటి శిల్పాలే’ అని చెప్పి పర్యాటకులను తిరుగుముఖం పట్టించేవాళ్లు. అలా... వేయిస్తంభాల గుడి పర్యాటకుల్లో రామప్ప గుడి వరకు కొనసాగే వాళ్ల నంబరు సగానికి లోపే ఉండేది. రెండు రోజుల టూర్‌ ప్లాన్‌ ఉన్నవాళ్లు మాత్రం... లక్నవరంలో రాత్రి బస చేసి రెండవ రోజు రామప్ప గుడిని కవర్‌ చేసేవాళ్లు. ఇలాగ... ఈ నిర్మాణం పెద్దగా ప్రాచుర్యానికి నోచుకోకపోవడంలో అందరి పాత్ర ఉంది.

ఇకపై రూట్‌ మారుతుంది!
ఇప్పుడు రామప్ప గుడికి ప్రపంచస్థాయి వచ్చింది. ఇక పర్యాటకుల టూర్‌ రూట్‌ కూడా మారిపోతుంది. రామప్ప గుడి దగ్గర మెరుగైన బస సౌకర్యాలు పెరుగుతాయి. రామప్ప గుడిని చూడడానికి ములుగు జిల్లా, పాలంపేటకు వచ్చిన పర్యాటకులు... ఆ తర్వాత రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్పచెరువు, హన్మకొండలోని వెయ్యి స్థంబాల గుడి, వరంగల్‌ ఖిలాలు కవర్‌ చేస్తారు. ఇకపై పాలంపేటలో బస చేసి ఇవన్నీ చూసుకుని తిరుగు ప్రయాణమయ్యే అవకాశాలే ఎక్కువ. అలాగే ట్రెకింగ్, బోటింగ్‌ వంటివీ పెరుగుతాయి. ఈ పాలంపేట గ్రామం హస్తకళాకారులకు కూడా మంచి మార్కెట్‌ పాయింట్‌ అవుతుంది. వరంగల్‌ డరీస్, పెంబర్తి ఇత్తడి బొమ్మల వంటి స్థానిక హస్తకళలు మన ఖ్యాతిని చాటుతూ గర్వంగా ప్రపంచదేశాలకు చేరతాయి.

భవిష్యత్తు బంగారమే!
రామప్ప గుడి ప్రాశస్త్యాన్ని ఇప్పటి వరకు మనం మాత్రమే రాసుకున్నాం, చదువుకున్నాం. ప్రపంచ వారసత్వ నిర్మాణంగా గుర్తింపు పొందిన తర్వాత ఈ నిర్మాణం గురించి దేశవిదేశాల్లో రచనలు వెలువడతాయి. మన దగ్గర కూడా ఈ నిర్మాణం గురించి ఇంకా ఎక్కువ పుస్తకాలు రావాలి. పర్యాటకులు ప్రతి ఒక్కరూ వెళ్తూ వెళ్తూ ఒక పుస్తకం కొనుక్కుని వెళ్తారు. వాళ్ల స్నేహితులకు, బంధువులకు చూపిస్తారు. ఇప్పటి వరకు మల్లారెడ్డి, కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇందుకు అవసరమైనట్లు సంక్షిప్త సమాచారంతో చిన్న పుస్తకాల అవసరం ఉంది. యునెస్కో ప్రకటనతో ఇక ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. పర్యాటకుల సంఖ్య పెరిగితే గైడ్‌లు, బస కోసం లాడ్జిలు, పేయింగ్‌ గెస్ట్‌ అకామడేషన్, భోజనానికి హోటళ్లు పెరుగుతాయి. హౌస్‌కీపింగ్, ఎస్కార్ట్, లాండ్రీ వంటి సర్వీస్‌ రంగాలకు డిమాండ్‌ ఎక్కువవుతుంది. డాన్స్‌ షో ఏర్పాటు చేస్తే కళాకారులు, వాద్యకారులు ఉపాధి పొందుతారు. అలాగే వసతుల కల్పనలో ప్రకృతి సుందరీకరణ చెక్కు చెదరకుండా జాగ్రత్త పడాలి. 

మరిన్ని వార్తలు