ఐటీ రాజధానిలో హైటెక్‌ మయసభ..!

17 Jul, 2022 08:28 IST|Sakshi

స్మార్ట్‌ క్యాంపస్‌

ఇరవై అంతస్తుల భవనం...వేల మంది ఉద్యోగులు.. వందల సంఖ్యలో కార్లు! నేలపై.. భూగర్భంలోనూ పార్కింగ్‌! హైటెక్‌ యుగంలో ఏ ఐటీ ఆఫీసును తీసుకున్నా ఇలాగే ఉంటుంది! ఇలాంటి ఆఫీసులో మిత్రుడిని కలిసేందుకు వెళ్లారనుకోండి... పార్కింగ్‌ స్థలం వెతుక్కునేందుకు పదిహేను నిమిషాలు.. సెక్యూరిటీ వ్యవహారాల పూర్తికి ఇంకొన్ని నిమిషాలు.. రిసెప్షన్‌లోనో.. క్యాంటీన్‌లోనో పడిగాపులు..ఇదీ తంతు! వందేళ్ల రాబర్ట్‌ బాష్‌ కంపెనీలో మాత్రం దీనికి భిన్నం!

ఉద్యాన నగరి, దేశ ఐటీ రాజధానిగా చెప్పుకునే బెంగళూరులోని ఆడుగోడి ప్రాంతంలో ఉంటుంది బాష్‌ కంపెనీ ఫ్యాక్టరీ. 1922లో భారత్‌లోకి అడుగు పెట్టిన ఈ జర్మన్‌ కంపెనీ ఆటోమొబైల్‌ రంగంతోపాటు అనేకానేక రంగాల్లో ఉత్పుత్తులు తయారు చేస్తోంది. సేవలందిస్తోంది. ఇందులో పెద్దగా ప్రత్యేకత ఏమీ ఉండకపోవచ్చు కానీ... వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆడుగోడిలోని 76 ఎకరాల విస్తీర్ణంలోని ఫ్యాక్టరీలో బాష్‌ నిర్మించిన స్మార్ట్‌ క్యాంపస్‌ స్పార్క్‌ నెక్స్‌ట్‌లో మాత్రం నిలువెల్లా ప్రత్యేకతలే!

పర్యావరణ పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా నిర్మించిన ఈ బహుళ అంతస్తుల భవనం ఒక రకంగా హైటెక్‌ మయసభ! అతిథ్యంతో మొదలుపెట్టి... పీల్చే గాలి, వినిపించే శబ్దం... కూర్చునే సీట్లు అన్నింటిలోనూ కృత్రిమ మేధ, బిగ్‌ డేటా టెక్నాలజీలు పూర్తిస్థాయిలో పనిచేస్తూంటాయి. ఒకొక్క దాని గురించి స్థూలంగా...  

విజిటర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ 
ఏదైనా ఆఫీసుకెళ్లి ఉద్యోగిని కలవాలంటే ముందుగా సెక్యూరిటీ, రిసెప్షన్‌లను దాటాలని మనకు తెలుసు. బాష్‌లోనూ ఈ ఏర్పాట్లు ఉన్నాయి కానీ పనంతా చిటికెలో అయిపోతుంది. స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ ద్వారా మీరు కలవాలనుకున్న ఉద్యోగి పేరు, మీ వివరాలను ముందుగానే తెలియజేసి ఓ సెల్ఫీ తీసుకుంటే చాలు.. స్మార్ట్‌ క్యాంపస్‌ రిసెప్షన్‌లో ఉండే ‘విజిటర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’... మిమ్మల్ని చూడగానే మీకో పాస్‌ జారీ చేసేస్తుంది. ఫేషియల్‌ రికగ్నిషన్‌ ద్వారా మీరు అప్పటికే తీసి పంపిన సెల్ఫీని పోల్చుకుంటుందన్నమాట.

ఆ తరువాత పక్కనే ఉన్న లాకర్లపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే నచ్చిన లాకర్‌ను ఎంచుకోవచ్చు. అందులో మీ సామాన్లు భద్రపరచుకోవచ్చు. మిత్రుడు లేదా ఉద్యోగిని కలవాల్సిన చోటుకుS దారి చూసేందుకు ‘వే ఫైండర్‌’ పేరుతో ఇంకో స్మార్ట్‌ సాఫ్ట్‌వేర్‌ మీకు సాయం చేస్తుంది. మీటింగ్‌ అయిపోయినట్లు మిత్రుడు లేదా ఉద్యోగి స్మార్ట్‌ ఆప్‌లో నోటిఫై చేసిన వెంటనే రిసెప్షన్‌లో మీ ఎగ్జిట్‌ పాస్‌ రెడీ! మిగిలిన ఆఫీసులతో పోలిస్తే సెక్యూరిటీ వద్ద గడిపే సమయం 75 శాతం తక్కువ అవుతుందట ఈ విజిటర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ వల్ల!

సీట్ల కేటాయింపుతో బోలెడు ఆదా...
ఆఫీసులో మీ సీటెక్కడ? అంటే.. రెండో ఫ్లోర్‌లో ఎడమవైపు మూడో క్యాబిన్‌ అని చెబుతూంటారు కొందరు. బాష్‌ స్మార్ట్‌ క్యాంపస్‌లో ఇలా ఒకరికి ఒక సీటు కచ్చితంగా ఉండదు. కోవిడ్‌ అనంతర పరిస్థితుల్లో ఇప్పుడు హైబ్రిడ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారిక్కడ. కొన్ని రోజులు ఇంట్లో,  మిగిలిన రోజులు ఆఫీసులో అన్నమాట. ఆఫీసుకు రావాలనుకుంటే... ఉద్యోగి తన సీటు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. బాష్‌ తయారు చేసిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌... ఏ ఫ్లోర్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో పరిశీలించి, తగిన సీటు కేటాయిస్తుందన్నమాట.

ఒక ఫ్లోర్‌లో సీట్లు నిండిన తరువాత మాత్రమే ఇంకో ఫ్లోర్‌లో సీట్ల కేటాయింపు జరుగుతుంది. దీనివల్ల ఉపయోగంలో లేని అంతస్తుల్లో దీపాలు, ఏసీల వృథా అస్సలు ఉండదు. కాఫీ, టీలు, నీళ్లు, బాత్రూమ్‌ల వాడకం ఇలా అన్ని అంశాల్లోనూ ఆదా జరుగుతుందని కంపెనీ చెబుతోంది. అదే సమయంలో ఒక ఫ్లోర్‌లో ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా దీపాల కాంతిలో హెచ్చుతగ్గులు ఉంటాయి కూడా. పగటి వెలుతురును పూర్తిగా వినియోగించుకునేందుకు వీలుగా భవనం మొత్తం అద్దాలతోనే నిర్మించారు. 

సౌకర్యానికి తగ్గట్టుగా ఏసీ...
ద బాష్‌ ఇంటెలిజెంట్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ అండ్‌ కంఫర్ట్‌ అసిస్టెంట్‌.. క్లుప్తంగా బియాంక స్పార్క్‌ నెక్స్‌ట్‌లోని హైటెక్‌ ఏసీ సిస్టమ్‌. ఉద్యోగులు తాము కూర్చుంటున్న చోట ఏసీ ఎంత సౌకర్యవంతంగా ఉందో చెబితే (స్మార్ట్‌ అప్లికేషన్‌ గ్రేడింగ్‌ ద్వారా) మెషీన్‌ లెర్నింగ్‌ సాయంతో అందరి ఫీడ్‌బ్యాక్‌ను విశ్లేషించి.. వీలైనంత వరకూ వారి అనుకూలతకు తగ్గ ఏసీ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లోనే సీట్ల కేటాయింపు జరుగుతుంది.

ఉదాహరణకు మీకు 18 –23 డిగ్రీ సెల్సియస్‌ మధ్య ఉష్ణోగ్రత బాగుంటుందని అనుకుందాం. ఇంకో ఉద్యోగికి 16 – 26 మధ్య ఏసీ ఉన్నా ఓకే అంటే.. వీరిద్దరి సీట్ల వద్ద ఉష్ణోగ్రతలను 20 – 22 డిగ్రీ సెల్సియస్‌ మధ్య ఉండేలా బియాంక చర్యలు తీసుకుంటుందన్నమాట. కృత్రిమ మేధ సాయంతో వ్యక్తుల ఇష్టాయిష్టాల ఆధారంగా నిర్ణయాలు జరుగుతాయి. బియాంక వాడకం వల్ల ఏసీ విద్యుత్తు ఖర్చు 30 నుంచి యాభై శాతం వరకూ తగ్గుతుందని బాష్‌ చెబుతోంది. 

వాయు కాలుష్యానికీ చెక్‌...
స్పార్క్‌ నెక్స్‌ట్‌లో కాలుష్యం చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇందుకోసం కంపెనీ క్యాంపస్‌లో దాదాపు 20 వృక్షాలను ట్రాన్స్‌ లొకేట్‌ (ఇతర ప్రాంతాల్లోని చెట్లను నాటడం) చేసింది. అంతేకాకుండా.. వాయు కాలుష్యాన్ని పసిగట్టేందుకు బాష్‌ ప్రత్యేకంగా ఒక పరికరాన్ని కూడా తయరు చేసింది. స్పార్క్‌ నెక్స్‌ట్‌ క్యాంపస్‌లో వేర్వేరు ప్రాంతాల్లో ఈ పరికరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాయు కాలుష్యాన్ని పరిశీలిస్తూంటారు.

పరిమితులు మించితే ఉద్యోగులు వీలైనంత వరకూ భవనాల్లోపలే పని చేసుకోవాల్సిందిగా సూచనలు వెళతాయి. బాష్‌ బెంగళూరు నగరం మొత్తమ్మీద వాయు కాలుష్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు గుర్తించేందుకు ఓ సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించింది. నగర ట్రాఫిక్, వాతావరణం, నగరంలో నిర్మాణ కార్యక్రమాల వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తిస్తుంది. తదనుగుణంగా నగర పరిపాలన యంత్రాంగానికి సూచనలు చేస్తుంది. 

స్పార్క్‌ నెక్స్‌ట్‌ హైటెక్‌ హంగులు ఇక్కడితోనే అయిపోలేదు. భవనంలోని వేర్వేరు వ్యవస్థలు, పరికరాల ద్వారా అందే సమాచారాన్ని విశ్లేషించేందుకు కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ మేళవింపుతో ‘డీప్‌సైట్స్‌’ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉంది. నీటి సరఫరా, నిర్వహణ, విద్యుత్తు వినియోగం వంటి అనేక అంశాలపై ఇది ఓ కన్నేసి ఉంచుతుంది. వీలైనంత వరకూ వీటిని ఆదా చేసేలా నిర్ణయాలు తీసుకుంటూంటుంది.

ఇప్పటికే ఈ డీప్‌సైట్స్‌ కారణంగా సంస్థకు ఏడాది విద్యుత్తు బిల్లులో ఆరు శాతం ఆదా అవుతూన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతోపాటు పదివేల మంది పనిచేసే ఈ క్యాంపస్‌లో వాహనాల స్మార్ట్‌ పార్కింగ్‌ కోసం ‘జ్యూస్‌’ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉంటుంది. పార్కింగ్‌ ప్రాంతంలో ఏది ఖాళీగా ఉందన్న విషయాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఖాళీ కోసం వెతికే ప్రయాస తగ్గడం వల్ల 1500 పనిదినాలు, 2500 లీటర్ల ఇంధనం, ఐదు వేల కిలోల కార్బన్‌ డైయాక్సైడ్‌ ఉద్గారాలను తగ్గించగలిగారు. -గిళియారు గోపాలకృష్ణ మయ్యా

  

మరిన్ని వార్తలు