షేర్డ్‌ పేరెంటింగ్‌: విడాకులు తీసుకున్నా విద్యార్థికి తల్లిదండ్రులే

28 Jun, 2022 01:09 IST|Sakshi

ఇటీవల కోల్‌కతాలోని ఒక స్కూల్‌ పిల్లల అడ్మిషన్ ఫామ్‌లో తల్లిదండ్రులకు ‘మీరు డైవర్సీనా?’ అనే కాలమ్‌ పెట్టింది. విడాకులు తీసుకుని ఉంటే ఆ ఎడబాటును ఇంటివరకే పరిమితం చేయాలని పిల్లల చదువు విషయంలో సమాన బాధ్యత తీసుకోవాలని విద్యారంగ నిపుణులు చెప్పడమే ఇందుకు కారణం.

‘ఆన్ లైన్  క్లాస్‌లో అతన్ని రానీయవద్దు’ అని తల్లిగాని ‘స్కూల్‌ రిపోర్ట్స్‌ ఆమెకు పంపొద్దు’ అని తండ్రి గాని అనడానికి వీల్లేదని వీరు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువులో ‘భాగస్వామ్య పెంపకం’ తీసుకోకపోతే పిల్లలు ఘోరంగా దెబ్బ తింటున్నారని తేల్చి చెబుతున్నారు. విడాకులు తీసుకున్న తల్లిదండ్రులు ఈ విషయమైనా సీరియస్‌గా ఆలోచించాలి.

కోల్‌కతాలోని ‘సౌత్‌ సిటి ఇంటర్నేషనల్‌ స్కూల్‌’ ఈ సంవత్సరం పిల్లల అడ్మిషన్‌ ఫామ్స్‌లో తల్లిదండ్రులకు ‘మీరు విడాకులు తీసుకున్నారా/విడిగా ఉంటున్నారా/ సింగిల్‌ పేరెంటా’ అనే కాలమ్‌ పెట్టింది. అది తప్పనిసరిగా నింపాల్సిందే. ‘ప్రతి ఏటా పెరుగుతున్న విడాకుల కేసుల దరిమిలా పేరెంట్స్‌ వచ్చి పిల్లల విషయంలో పెడుతున్న పేచీలే ఇందుకు కారణం’ అని స్కూల్‌ యాజమాన్యం తెలిపింది.

వీరి పద్ధతి ప్రకారం స్కూల్లో పిల్లల్ని వేయాలనుకుంటున్న తల్లిదండ్రులు ‘తాము విడిపోయినా, గొడవలతో దూరంగా ఉంటున్నా, భర్త/భార్య మరణించి సింగిల్‌గా ఉంటున్నా’ ఆ సంగతి తెలియ చేయాలి. ‘దీనివల్ల మేము మా దగ్గర చదువుతున్న విద్యార్థి గురించి ఎలాంటి శ్రద్ధ పెట్టాలో అవగాహన వస్తుంది’ అని తెలిపింది.

అంతేకాదు, విడాకులు తీసుకుని ఉన్నా, మనఃస్పర్థలతో దూరంగా ఉంటున్నా తల్లిగాని తండ్రిగాని పిల్లల్ని స్కూల్లో చేర్పించాలనుకుంటే యాజమాన్యం ఆ విడిపోయిన భాగస్వామికి సమాచారం ఇస్తుంది. ‘మా దగ్గర మీ పిల్లలు చేరుతున్నారు. ఈ సంగతి మీకు తెలుసా? మా స్కూల్లో చేర్పించడం మీకు సమ్మతమేనా?’ అని అడుగుతుంది. సమ్మతి పత్రం తీసుకుంటుంది. అంతే కాదు ‘తండ్రిని పిల్లల్ని చూడనివ్వద్దు అని తల్లి... తల్లిని పిల్లల్ని కలవనివ్వదు అని తండ్రి’ చెప్పినా అందుకు అంగీకరించదు. పిల్లల చదువు, ప్రోగ్రెస్‌ రిపోర్ట్సు ఇద్దరికీ పంపాల్సిందేనని నిర్ణయించింది. పిల్లల చదువు గురించి వాకబు చేసే హక్కు ఇద్దరికీ ఉంటుందని, క్లాస్‌ టీచర్‌తో మాట్లాడవచ్చునని, పేరెంట్స్‌ మీటింగ్‌కు హాజరు కావచ్చునని ఈ స్కూలు తెలిపింది.

‘ఇందుకు కారణం మా దగ్గరకు చాలామంది డైవోర్సీలు వచ్చి విడిపోయిన పార్టనర్‌ని స్కూలు దగ్గరకు రానివ్వొద్దు అని చెప్పడమే. ఇలా చేయడం వల్ల పిల్లల చదువు సరిగ్గా సాగదు. చదువు విషయంలో పిల్లలు తల్లిదండ్రుల సపోర్ట్‌ కోరుకుంటారు. విద్యారంగ నిపుణులు కూడా అదే చెబుతున్నారు. వారి హక్కును తల్లిదండ్రులు కాదనడానికి లేదు’ అని యాజమాన్యం తెలిపింది.

షేర్డ్‌ పేరెంటింగ్‌
దీనినే తెలుగులో భాగస్వామ్య పెంపకం అనొచ్చు. భార్యాభర్తలకు తాము విడిపోయే హక్కు ఉంది. విడిపోక తప్పని పరిస్థితులు కొందరికి వస్తాయి కూడా. అంతమాత్రం చేత వారు తల్లిదండ్రులుగా ఉండే బాధ్యతను విస్మరించడానికి వీల్లేదని ఈ షేర్డ్‌ పేరెంటింగ్‌ భావన చెబుతోంది. పిల్లల పెంపకం విషయంలో పంచుకోవాల్సిన బాధ్యతలను అలాగే కొనసాగించాలని దీని అర్థం.

కలిసి లేని తల్లిదండ్రుల వద్ద పెరుగుతున్న పిల్లలను ఇటీవల అధ్యయనం చేసిన విద్యారంగ నిపుణులు బాల నేరస్తులుగా మారుతున్న వారిలో, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నవారిలో, స్కూళ్లలో చదువులో వెనుకబడి కుంగిపోతున్నవారిలో విడిపోయిన తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి దగ్గరే పెరుగుతున్న పిల్లలు ఎక్కువమంది ఉండటం గమనించారు.

విడాకుల తర్వాత పిల్లల కేర్‌టేకర్‌లు మారిన తల్లిగాని తండ్రిగాని తమతో లేని పార్టనర్‌ మీద పిల్లలకు చెడు మాటలు చెప్పడం, వారిని కలవడానికి పూర్తిగా నిరాకరించడం వ్యక్తిత్వం విషయంలోనే కాదు చదువు విషయంలో కూడా చాలా ప్రభావం చూపుతున్నట్టుగా తెలుసుకున్నారు. విడిపోయిన కోపంతో పిల్లల్ని దూరంగా ఉంచాలని స్కూళ్ల యాజమాన్యాల దగ్గరకు వచ్చి తమ అనుమతి లేకుండా తండ్రి/తల్లిని రానివ్వొద్దని డిమాండ్స్‌ పెట్టడమే ఇప్పుడు స్కూలు యాజమాన్యాల కొత్త విధానాలకు కారణం అవుతోంది.

కలిసే సందర్భాలు ఉండాలి
పిల్లల పుట్టిన రోజులు, స్కూల్‌ డే, పేరెంట్స్‌ టీచర్‌ మీటింగ్‌ సమయాలు... ఇలాంటి సందర్భాల్లో పిల్లల కోసం కలవడం తప్పనిసరి అని ఫ్యామిలీ కౌన్సిలర్లు కూడా సూచిస్తున్నారు. ‘అమ్మా నాన్నా ఇప్పుడు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ కాకపోవచ్చు. కాని నా కోసం అప్పుడప్పుడు కలుస్తారు’ అనే చిన్న ఆశ పిల్లల్ని చాలా ఉత్తేజ పరుస్తుంది. విడిపోయిన తల్లిదండ్రులు ఎప్పుడో ఒకసారి పిల్లలతో రెస్టరెంట్‌కు వెళ్లడం పిల్లలకు తక్కువ వరం కాదు. ఏ విడాకుల్లోనైనా భార్యాభర్తల కంటే ఎక్కువ బాధితులు పిల్లలే. చదువు వారికి అత్యంత ముఖ్యమైన భవిష్యత్‌ సాధనం. ఆ నిచ్చెనకు అటూ ఇటూ తల్లిదండ్రులు నిలవాల్సిందేనని నిపుణులు చెబుతున్న మాట దూరమైన భార్యాభర్తలు వినదగ్గది. ఆలోచించదగ్గది.     

చదువులో ఇద్దరూ అవసరమే
కలిసి ఉన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులతో చదువుకు సంబంధించి ఎన్నో విషయాలు చెప్పుకుని వొత్తిడి తగ్గించుకుంటారు. కొన్ని సలహాలు తల్లి ఇస్తే కొన్ని తండ్రి చెప్తేగాని ధైర్యం చిక్కదు. హఠాత్తుగా తల్లిదండ్రులు విడిపోతే ఈ విషయం లో పెద్ద అగాథం వస్తుంది. పిల్లలు పైకి నోరు తెరిచి చెప్పకపోయినా తల్లి దగ్గరో/తండ్రి దగ్గరో హుషారుగా పెరుగుతున్నట్టు కనిపించినా వారి లోలోపల ఎన్నో ఆలోచనల వొత్తిడి ఉంటుంది. అసలే చదువుకు సంబంధించిన వొత్తిడి ఉన్నప్పుడు ఈ వొత్తిడి కూడా పని చేయడం వారి ప్రవర్తనను విపరీతంగా ప్రభావితం చేస్తుంది. ‘కొన్ని అమ్మకు చెప్పుకుందాం. కొన్ని నాన్నకు చెప్పుకుందాం’ అనే ఛాయిస్‌ వారికి తల్లిదండ్రులు కలిసి ఉన్నా విడిపోయినా తప్పక ఉండాలి. ఏ మాట ఎవరు వింటారో పిల్లలకు తెలుసు. తమ కంఫర్ట్‌ సాధించుకోవాలనుకుంటారు. ఒక ఆప్షన్‌ పూర్తిగా కూల్చివేస్తే వారు కుంగిపోతారు.

మరిన్ని వార్తలు