సత్యార్థ ప్రకాశకులు స్వామి దయానంద సరస్వతి

8 Mar, 2021 07:10 IST|Sakshi

పరాయి పాలనలో మగ్గుతున్న దేశాన్ని బానిసత్వపు శృంఖలాల నుంచి విడిపించి, సమాజాన్ని బాగుపరచడానికి ఎన్నో సంస్కరణలు చేపట్టి నవీన భారతదేశ సంస్కర్తలలో అగ్రగణ్యులుగా నిలిచారు స్వామి దయానంద సరస్వతి. దయానందుల అసలు పేరు మూల శంకర్‌. చిన్ననాడే భగవంతుడ్ని దర్శించాలనే తలంపుతో ఇల్లు వదలి వెళ్లి మధురలోని విరజానంద సరస్వతుల వద్దకు చేరారు. వారి సాన్నిధ్యంలో వేద, వేదాంత విద్యలను అభ్యసించి, సమాజం పట్ల అవగాహన రావడానికి గురువుల అనుమతితో దేశాటనకు బయలుదేరారు. ఆనాటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను చూసి చలించిన దయానంద తన జీవితం ఇక సమాజసేవకే అంకితమని నిశ్చయించుకున్నారు.

సంఘసంస్కారం–ఆర్యసమాజం: దయానంద సరస్వతి సతీ సహగమనం, బాల్యవివాహాలపై తీవ్రంగా పోరాడి జనాలలో గణనీయమైన మార్పు తీసుకొచ్చారు. కర్మసిద్ధాంతాన్ని, పునర్జన్మను గట్టిగా విశ్వసించే దయానందులు ఆచార వ్యవహారాలను మాత్రం వ్యతిరేకించారు. ఆర్యసమాజాన్ని స్థాపించి స్త్రీ జాతి సముద్ధరణకు నడుం బిగించారు. స్వధర్మానికి తిరిగి చేరుకునే వారికోసం ఆర్యసమాజం ద్వారా శుద్ధి కార్యక్రమం నిర్వహించేవారు. వీరు చేపట్టిన సంస్కరణలకు ఆనాటి ప్రముఖ నాయకులు సైతం ప్రభావితమయ్యారు.

దయానంద భాష్యం: వేదాలు మానవులు రచించినవి కావనీ, సాక్షాత్తూ పరమాత్మ నుండే ఉద్భవించాయని బలంగా నమ్మిన వీరు  ‘సత్యార్థ్‌ ప్రకాశ్‌’ పేరుతో వేదాల సారాన్ని సామాన్యుడి దాకా చేర్చే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా వేదాలను ఆధునిక కోణంలో చూడాలన్న దృక్పథంతో  వేదాలకు వీరు రాసిన భాష్యం ‘దయానంద భాష్యం’ పేరుతో సుప్రసిద్ధమైంది. వేదాలు చెప్పిన స్త్రీ సమానత్వం గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. వేదాలతో పాటు ప్రాథమిక విద్య అవసరాన్ని గుర్తించి అనేక కళాశాలలు నెలకొల్పి విద్యాదానం చేశారు.జాతీయవాదిగా తన బోధనలతో భారతదేశాన్ని సాంఘికంగా, మతపరంగా సంఘటిత పరచి ప్రజలలో దేశభక్తిని, జాతీయభావాన్ని పెంపొందించేలా అవిరళ  కృషి సల్పి, హిందూధర్మానికి దయానందులు చేసిన సేవ తరువాతి సమాజ సంస్కర్తలకు ఆదర్శంగా నిలిచింది. (నేడు స్వామి దయానంద సరస్వతి జయంతి)
 -అప్పాల శ్యామప్రణీత్‌ శర్మ అవధాని
 వేదపండితులు

చదవండి: 
వివాహ బంధం: బ్రహ్మముడి అంటే...? 
‘రాగాలు’ రాగిణులై   కనబడ్డాయి

 

మరిన్ని వార్తలు