తిరుమలేశుని వైకుంఠ ద్వార దర్శనం

25 Dec, 2020 08:49 IST|Sakshi

పర్వదినం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు రావడం తెలిసిన విషయమే. ఇప్పటివరకు తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే ద్వారాలు తెరిచేవారు. దీనిద్వారా స్వామివారి దర్శనం తక్కువ మందికే దక్కేది. ఇకపై శ్రీరంగం తరహాలో పదిరోజుల పాటు తిరుమల వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. నేటి నుంచి జనవరి 3 వరకు ఉత్తర ద్వార దర్శనం జరగనుంది. ఆలయంతో అనుసంధానం వున్న 26 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, పెద్ద సంఖ్యలో భక్తుల సూచనలు, సలహాల మేరకు టీటీడీ తీసుకున్న నిర్ణయానికి భక్తులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

108 వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తర ద్వారదర్శనం
శ్రీవారి ఆలయంలో వైకుంఠ ప్రదక్షణ మార్గానికి వైకుంఠ ద్వారంగా పేర్కొంటూ భక్తులను అనుమతిస్తుండగా 108 దివ్య వైష్ణవ క్షేత్రాలులో శ్రీరంగం, పార్తన్పల్లి, తిరుచ్చేరయ్, నాచియ్యార్‌ కోయిల్, తిరుకన్నపురం, తిరు కన్నమంగై, తిరునాగై, చక్రపాణి టెంపుల్, సారంగిపాణి ఆలయం, తిరుకన్నన్‌ గుడి, సిర్గాయి, తిరువలియన్‌ గుడి, తిరునిండ్రపూర్, తిరు అన్‌ బిల్, అప్పా కుడాటన్, తిరువెళ్ళరయ్యై, శ్రీవల్లి పుత్తూరు, అలగర్‌ కోయిల్, కూడాల్‌ అలగర్, తిరుముక్కురు, తిరుతంగల్, వానమామలై, కేశవ పెరుమాల్‌ కోయిల్, తిరునూరుమలై వంటి దివ్యదేశాలలో ఉత్తర ద్వారం వుండగా అనాది కాలంగా ఈ ఆలయాలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచుతారు.


ప్రతిరోజు స్వామివారు ఈ ద్వారం నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత భక్తులను అనుమతిస్తారు. ట్రిపులికేన్, అన్నన్‌ కోయిల్, పురుషోత్తం కోయిల్, తిరునగరై వంటి ఆలయాల్లో ఉత్తర ద్వారం లేకపోయినా మరోవైపున మార్గాన్ని వైకుంఠ ద్వారంగా భక్తులను అనుమతిస్తూన్నారు. ఈ దివ్యదేశాలలో కూడా పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వెష్ణవ ఆలయాలలో ఆగమశాస్త్రబద్ధంగా అ«ధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు. 21 రోజులపాటు నిర్వహించే ఈ అ«ధ్యయనోత్సవాల సందర్భంగా పన్నిద్దరు ఆళ్వార్లు రచించిన నాలుగు వేల పాశురాలను వేదపండితులు ఆలయంలో పఠిస్తారు.

మొదట పదిరోజులు నమ్మాళ్వైర్‌ మినహా మిగిలిన ఆళ్వార్లు రచించిన 2 వేల పాశురాలను పఠిస్తూండగా, మిగిలిన పదిరోజులు నమ్మాళ్వార్లు రచించిన వెయ్యి పాశురాలను 21వ రోజున ఆళ్వార్లు అందరూ రచించిన వెయ్యిపాశురాలను పఠిస్తారు. నమ్మాళ్వార్‌ రచించిన పాశురాలను పఠించే పది రోజులు వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ద్వారాలను తెరిచి భక్తులను అనుమతిçస్తున్నారు. టీటీడీ కూడా ప్రస్తుతం భక్తుల సౌకర్యార్థం వైష్ణవ ఆలయాల తరహాలో శ్రీవారి ఆలయంలో కూడా పదిరోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం భక్తులకు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారికి అలంకరించే పుష్పాలను వైకుంఠ ప్రదక్షణ మార్గం ద్వారా ఉరేగించి స్వామివారికి అలంకరించిన తరువాత భక్తులను అనుమతిస్తారు.
- అలిదేన లక్ష్మీకాంత్, తిరుమల

మరిన్ని వార్తలు