వైదిక విజ్ఞానం 

25 Sep, 2020 10:24 IST|Sakshi

వేద వాఙ్మయం 

వేద వాఙ్మయంలో ఆరు విభాగాలున్నాయి. అవి శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం. వీటినే షడంగాలు అంటారు. ఇవి వేదాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఈ షడంగాలను అధ్యయనం చెయ్యకుండా వేదాలను చదువ కూడదన్నది సాంప్రదాయం. షడంగాలను అధ్యయనం చేయకుండా వేదాలను చదివితే, అవి సరైన రీతిలో అర్థంకాకపోగా, విపరీతమైన అర్థాలు వచ్చేదానికి అవకాశం వుంటుంది. అందుకే ముందుగా మనం  వేదాంగాల గురించి తెలుసుకుందాం...

వేదాల్లోని అక్షరాలు, పదాలు, అవి పలికే విధానం గురించి, వేద మంత్రాల స్వరాలు, ఒత్తిడి, శ్రావ్యతల గురించి, మంత్రాలు పలికే సమయంలో పదాల కలయిక, వాటి నియమాల గురించి శిక్షాశాస్త్రం వివరిస్తుంది. మనిషి ఆలోచనలను వ్యక్తపరచడానికి కావలసిన పదాలు, వాక్యనిర్మాణం, భాషావిశ్లేషణ నియమాలు, సంధులు, పదవిఛ్ఛేదాలు, పదాల ఏర్పాటు, మొదలైన వాటిగురించి వ్యాకరణం వివరిస్తుంది. వేదమంత్రాలన్నీ ఏదో ఒక ఛందస్సులో చెప్పబడినవే కనుక ఒక క్రమ పద్ధతిలో నిర్ణీతసంఖ్యలో అక్షరాల ఆధారంగా మంత్రాలను అర్థం చేసుకోవడాన్ని ఛందస్సు వివరిస్తుంది. వేదాలలోని శబ్దాలు, వాటి వ్యుత్పత్తి, నిర్మాణం, అవి ఉపయోగించిన సందర్భాన్ని బట్టి వాటి అర్థాలు, అస్పష్టమైన అర్థంతో చేసిన పద ప్రయోగాలను అర్థం చేసుకోవడం,మొదలైనవాటి వాటిగురించి వివరించేది నిరుక్తం. ఆచారాలు, సూర్యచంద్రాది గ్రహ, నక్షత్రాలను బట్టి ఏర్పడు శుభాశుభ సమయాలు, ఋతువులు, ఇత్యాది ఖగోళ శాస్త్ర విఙ్ఞానాన్ని అందించేదే జ్యోతిష్య శాస్త్రం. యఙ్ఞయాగాదులలో నిర్మించే యఙ్ఞగుండాలు, వేదికలు, యాగశాలల నిర్మాణ విధానాలు, జననం, మరణం, వివాహం వంటి సంఘటనలలో జరుపవలసిన ఆచారాలు మొదలైన వాటి గురించి కల్పం వివరిస్తుంది. వేదవాఙ్మయానికి  జ్యోతిష్యం నేత్రం వంటిది అని శాస్త్రోక్తి.  

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. అలాగే షడంగాలలో జ్యోతిష్యం ప్రధానం. ఎందుకంటే, మిగిలిన ఐదు శాస్త్రాలూ ఎక్కువభాగం భాషకు సంబంధించినవి. కానీ జ్యోతిష్యశాస్త్రం మాత్రం ఖగోళంలోని గ్రహనక్షత్రాది జ్యోతుల గతులను, వాటివలన ఏర్పడే పరిణామాలను వివరిస్తుంది. ఆ రోజుల్లో ఖగోళాన్ని దర్శించి అధ్యయనం చేసేవారు. కాంతివంతంగా వుంటాయి కనుక గ్రహాలను నక్షత్రాలను కలిపి, జ్యోతులు అంటారు. వాటిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని జ్యోతిష్య శాస్త్రం అన్నారు. ఈ జ్యోతిష్య శాస్త్రం ద్వారానే వేదాల్లో వుండే ఎన్నో ఖగోళ అద్భుతాలను, విఙ్ఞానాన్ని అర్థం చేసుకోవచ్చు. వేదాల్లో వుండే ఖగోళ విఙ్ఞానాంశాలు మచ్చుకి కొన్ని.

ఋగ్వేద ప్రథమ మండలంలో సూర్యుడు తన కక్ష్యలో చరించడాన్ని, సూర్యాకర్షణశక్తి వల్లనే భూమి, ఇతర పదార్థాలు సూర్యుడిచుట్టూ తిరుగుతున్నాయని, సూర్యుడు చాలా భారీగా వుంటాడనీ, అతని ఆకర్షణశక్తి వల్లనే గ్రహాలు ఒకదానితో మరొకటి ఢీకొనకుండా వుంటాయని తెలిపారు. మరొక మంత్రంలో, ‘కదిలే చంద్రుడు నిత్యం సూర్యునినుండి కాంతికిరణాలను పొందుతాడు’ అనీ, ‘చంద్రుడి వివాహానికి సూర్యుడు తన కుమార్తెలాంటి ఒక కిరణాన్ని బహుమతిగా ఇచ్చాడు’ అని, చంద్రకళలు మారడంలో సూర్యకిరణాల పాత్రని తెలియజేశారు. ఋగ్వేదం ఐదవ మండలంలో ఒక మంత్రం ‘ఓ సూర్యదేవా! ఎవరికైతే నీ వెలుగును బహుమతిగా ఇస్తున్నావో వారి (చంద్రుడు) వలన నీవెలుగు నిరోధించబడినప్పుడు, భూమి అకస్మాత్తుగా చీకటిలో భయపడుతుంది‘ అంటూ గ్రహణాలకు కారణం సుర్యుడు, చంద్రుడు, భూమియే అని చెప్పింది.

ఋగ్వేద ఎనిమిదవ మండలంలో, సౌరకుటుంబంలోని ఆకర్షణశక్తుల గురించి, ‘ఓ ఇంద్రా..! గురుత్వాకర్షణ, ఆకర్షణ, ప్రకాశం, కదలిక లక్షణాలను కలిగియున్న శక్తివంతమైన కిరణాలను ప్రసరించి ఆకర్షించడం ద్వారా ఈ విశ్వాన్ని నిలపండి‘ అంటూ సూర్యుణ్ణి, భోగప్రదాత అయిన ఇంద్రుడితోపోల్చి చెప్పారు. మరొక మంత్రంలో సృష్టికర్తను ఉద్దేశించి ‘ఓ దేవా! మీకున్న అనంతమైన శక్తితో సూర్యుని సృష్టించి, ఆకాశంలో ధృవపరచి, సూర్యుని, ఇతర గోళాలను సమన్వయపరచి స్థిరం చేసినారు’ అని సూర్యుని చుట్టూ గ్రహాలు స్థిరంగా తిరగడం గురించి తెలిపారు. ఋగ్వేద పదవ మండలంలో ‘ఈ భూమికి కాళ్ళు, చేతులు లేకపోయినప్పటికీ అది సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దానితోబాటూ దానిమీద వుండే అన్నీ కదులుతాయి’ అని చెప్పారు. యజుర్వేదంలో ఒక మంత్రంలో సూర్యుని ఆకర్షణశక్తి గురించి, ‘సూర్యుడు తన కక్ష్యలో కదులుతూ తనతోబాటు భూమివంటి వస్తువులను తనతోబాటు తీసుకు వెళ్తున్నాడు’ అని చెప్పారు. అథర్వవేదంలో ‘సూర్యుడు భూమిని, ఇతర గ్రహాలను పట్టి వుంచాడు’ అని తెలియజేశారు. 
– ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు 

మరిన్ని వార్తలు