వెండి తెరపై చినుకుల తుళ్లింత

26 Jun, 2022 16:52 IST|Sakshi

 దర్శకుల వాన 

నిజ జీవితంలోనే కాదు సినిమాలో కూడా వాన కురిస్తే సన్నివేశంలోని ఎమోషనే మారిపోతుంది. వానలో ప్రేమ... వానలో వాదన... వానలో సంఘర్షణ బలం ప్రేక్షకుణ్ణి తాకుతాయి. తడుపుతాయి. అయితే అందరు దర్శకులు వానను సరిగ్గా తీయలేరు. వానంటే ప్రేమ ఉన్నవారే గొప్ప వాన సన్నివేశాలు తీశారు.ఈ ఆదివారం కొన్ని  గొప్ప వాన సన్నివేశాల గురించి...

గొప్ప దర్శకులు వానను కూడా పాత్రగా తీసుకున్నారు. ప్రఖ్యాత జపనీస్‌ దర్శకుడు అకిరా కురసావా తీసిన ‘రోషమాన్‌’ సినిమా ప్రారంభంలోనే రోషమాన్‌ నగర శిథిల ద్వారం దగ్గర హోరుమని కురిసే వర్షాన్ని చూపుతాడు దర్శకుడు. ఆ శిథిల ద్వారం, ఆ క్రూర వర్షం 12వ శతాబ్దపు జపనీయ స్థితిగతులకు సంకేతం. 1950లో తీసిన ఈ సినిమాకు ముందు వానను అలా చూపినవారు లేరు.

స్టూడియోల్లో వాన కాదు ఇది. ఔట్‌డోర్‌లో వాన. ఆ వానలో లాంగ్‌షాట్‌లో ఒక మనిషి పరిగెత్తుకొని ప్రధాన ద్వారం దగ్గరకు వెళ్లడం ప్రేక్షకులు నోరు వెళ్లబెట్టుకుని చూశారు. అంటే కథలో వెంటనే లీనమైపోయారు. ఈ సన్నివేశం తీస్తున్నప్పుడు ముందు కురుస్తున్న వానే తప్ప వెనుక కొండల మీదుగా కురుస్తున్న వాన కెమెరాలో రిజిస్టర్‌ కావడం లేదని కురసావా గమనించాడు. వాన ముందు కురిసి వెనుక కురియకపోతే సహజత్వం ఉండదు. ఈ సమస్య అధిగమించడానికి వెనుక కురిసే వానలో కొంచెం నల్ల ఇంకును కలిపారు. రెయిన్‌ మిషన్‌లతో కృత్రిమంగా సృష్టించిన ఈ వాన అందువల్ల అత్యంత సహజంగా ఉంటుంది.

దీని తర్వాత ‘సింగింగ్‌ ఇన్‌ ది రెయిన్‌’లో నటుడు జీన్‌ కెల్లి తన స్వీయ దర్శకత్వంలో, స్వీయ కొరియోగ్రఫీలో పాడిన ‘సింగింగ్‌ ఇన్‌ ద రెయిన్‌’ పాట చరిత్ర సృష్టించింది. ప్రియురాలికి ముద్దు పెట్టి గుడ్‌నైట్‌ చెప్పాక ఆ పారవశ్యంతో బయటికొస్తే వాన కురుస్తుంటుంది. టాక్సీని వద్దని అతడు వానలో తడవడానికి ఇష్టపడతాడు. ఆనంద తాండవం చేస్తాడు. బజారులో తెరిచిన, మూసిన దుకాణాల మీదుగా అతడు ఆడి పాడుతూ ఉంటే ఇవాళ్టికి కాపీ చేయని దర్శకుడు లేదు.


1955లో ఇదే మేజిక్‌ని దర్శకుడు రాజ్‌ కపూర్‌ ‘శ్రీ 420’లో సాధించాడు. ఆ సినిమాలో భారతీయ తెర మీద ఇప్పటికీ పునరావృత్తం కానంత అందంగా ‘ప్యార్‌ హువా ఇక్‌రార్‌ హువా హై’ పాటను చిత్రీకరణ చేశారు. హీరో రాజ్‌ కపూర్, హీరోయిన్‌ నర్గీస్‌ అంతవరకూ స్నేహంలో ఉండి ఆ క్షణంలో ఒకరి పై మరొకరికి ప్రేమ ఉన్నట్టు గ్రహిస్తారు. వాన మొదలవుతుంది. అద్భుతమైన పాట కూడా. రాజ్‌ కపూర్‌ దీనిని స్టూడియోలోనే తీసినా రోడ్డు, వంతెన, దూరంగా వెళ్లే రైలు, చాయ్‌ బడ్డీ, వానలో తడిసే పిల్లలు, వణికే ప్రియురాలు, మురిసిపోయి చూసే ప్రియుడు ఇందరిని తెచ్చి పాటను చిరపుంజీ చేశాడు.

తెలుగులో 1961లో వచ్చిన ‘ఆత్మ బలం’లో ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ పాటను మనోహరంగా చిత్రీకరించిన దర్శకుడు విక్టరీ మధుసూదనరావుకు పేరు రావాల్సిందేగానీ నిజానికి ఆ పేరుకు వారసుడు ఆయన కాదు. ఎందుకంటే అక్కడ వాన పాట ఉండాలని అనుకోలేదు. ఆత్రేయ బెంగళూరులో పాట రాయడానికి వెళ్లి పల్లవి తోచక తిరుగుతూ అప్పుడే మొదలైన వానను చూసి రాశాడు. అక్కినేని కంటే బి.సరోజా ఎక్కువ మార్కులు కొట్టేసిన పాట ఇది.


వాన సన్నివేశాలు, పాటలు తీయడం కష్టం. కారణం అందుకు చాలా ఖర్చవుతుంది. నటీనటులు పదేపదే తడవాలి. కొందరు ఒప్పుకోరు. నీటి సమస్య. ఇవన్నీ ఉంటాయి. అయినప్పటికీ కొందరు దర్శకులు పట్టుబట్టి వానను సినిమాల్లోకి తెచ్చారు. ‘బలిపీఠం’ సినిమాలో క్లయిమాక్స్‌ అంతా భీకరమైన గాలివానలో జరిగినట్టు చూపి ఉత్కంఠ కలిగిస్తాడు దర్శకుడు దాసరి నారాయణ రావు. రీమేకే అయినప్పటికీ బాపు ‘తూర్పు వెళ్లే రైలు’ సినిమాలో వానను అత్యంత గొప్పగా తీశాడనిపిస్తుంది. ప్రేక్షకులు కూడా గాలివానలో ఉన్నట్టు చూపారు ఈ సినిమాలో.

అసలు నిజ జీవితంలో పగలూ ఉంటుంది... రాత్రి ఉంటుంది... ఎండ ఉంటుంది... వాన ఉంటుంది. కొందరు దర్శకులు మొత్తం కథంతా పగలే జరుగుతున్నట్టు తీస్తారు. కొందరు దర్శకులు పగలు సన్నివేశాలు, రాత్రి సన్నివేశాలతో కనెక్ట్‌ చేస్తారు. కొందరు దర్శకులు ఎండను, వానను చూపి కనెక్ట్‌ చేస్తారు. ‘శంకరాభరణం’లో అవమానం పొందిన శంకరశాస్త్రి దానిని ‘శంకరా నాదశరీరాపరా’ అని శివుడితో చెప్పుకుంటాడు. అంతటితో ఎఫెక్ట్‌ రాదు. ఆ ఆలయం మీద హోరున కురిసే వానలో ప్రాథేయ నృత్యం చేస్తాడు శంకర శాస్త్రి. గొప్ప ఎమోషన్‌ కలుగుతుంది. దర్శకుడు మణిరత్నం ‘గీతాంజలి’ సినిమాలో గిరిజ నాగార్జునను నిలదీసే సన్నివేశానికి వానను వాడుకున్నాడు. అద్భుతంగా ఉంటుంది ప్లాట్‌ఫాం పై కురిసే ఆ వాన. అలాగే ‘అమృత’ సినిమాలో అమృతకు తల్లి కనిపించే క్లయిమాక్స్‌లో గొప్ప వానను చూపిస్తాడు. ఎల్‌టిటిఇ పోరాటంలో ఉన్న ఆ తల్లి వానలాంటిదే. శాశ్వతం కాదు. అందుకే పెంపుడు తల్లి సిమ్రాన్‌కు గాఢంగా ముద్దు పెడుతుంది అమృత.

‘మనసంతా నువ్వే’లో వానను ఒక సన్నివేశంలో అద్భుతంగా ఉపయోగించుకున్నాడు దర్శకుడు వి.ఎన్‌.ఆదిత్య. ప్రేమ సఫలమయ్యే వేళకు అది విఫలం అయ్యే ఘడియ రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు ఉదయ్‌ కిరణ్‌. బయటకు చెప్పుకోలేడు. స్నేహితుడు సునీల్‌ ఆ క్షణంలో కుండపోత కురియడం చూసి ‘ఏడవరా... ఈ వానలో నీ ఏడుపును దాచుకో’ అంటాడు. 

అజిత్‌ నటించిన ‘ప్రేమలేఖ’ సినిమాలో క్లయిమాక్స్‌ అంతా వానలో తీయడం దర్శకుడు అగస్త్యన్‌కు పేరు తెచ్చింది. అజిత్‌ను వెతుక్కుంటూ వచ్చిన దేవయాని ఆ రాత్రి సిటీలో ఆటోలో వానలోనే అటూ ఇటూ తిరుగుతుంది. ఆ వాన కృత్రిమంగా అనిపించదు. సినిమాలో అందరూ తడిసినట్టే ప్రేక్షకులూ తడుస్తారు. వానకు తడిసిన షర్ట్‌ తీయడం వల్లే అజిత్‌ వేసుకున్న స్వెటర్‌ బయటపడి దాని ద్వారా దేవయాని అతణ్ణి గుర్తిస్తుంది. ఆ సీన్‌ పెద్ద హిట్‌ అయ్యింది.

ఇటీవల విడుదలైన ‘విరాట పర్వం’లో దర్శకుడు వేణు ఉడుగుల వానను చాలా సమర్థంగా ఉపయోగించాడు. నక్సలైట్‌ రవన్నను వెతుక్కుంటూ వెన్నెల పాత్రధారి సాయి పల్లవి భోరున కురిసే వానలో పౌరహక్కుల నాయకురాలు నందితా దాస్‌ ఇంటికి వెళ్లడం ప్రేక్షకులను కూడా తడిసి ముద్దయిన భావనను కలిగిస్తుంది. అలాగే ‘పలాస’ సినిమాలో దర్శకుడు కరుణ కుమార్‌ వానను ఎమోషన్‌ కోసం కీలక సన్నివేశాలలో ఉపయోగించాడు.

వానలో జల్లు, తుప్పర, చినుకులు, జడివాన, హోరు వాన, కుండపోత వాన, ముసురు... అంటూ ఇన్ని రకాలు ఉన్నాయి. వేటిని వాడితే ఏ సన్నివేశం పండుతుందో తెలిసినవాడే ధన్యుడు సుమతి.                                  

మరిన్ని వార్తలు