కోవిడ్‌ కాలం.. అంకురం కోసం...

23 Jul, 2021 04:34 IST|Sakshi

భర్త ప్రాణం తీసుకెళుతున్న యుముణ్ణి సంతాన వరం కోరి భర్తను కాపాడుకుని పురాణాల్లో నిలిచింది సావిత్రి. ఇప్పుడు వడోదరాలో ఇద్దరు స్త్రీలు ఈ కారణం చేతనే అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. కోవిడ్‌ వల్ల భర్త మరణించగా ముందే నిల్వ చేసిన అతని వీర్యంతో ఒక భార్య తల్లి కావాలనుకుంటూ ఉంటే కోవిడ్‌ వల్ల చావు అంచుల్లో ఉన్న భర్త వీర్యాన్ని హైకోర్టుకు వెళ్లి మరీ సేకరించి తల్లి కావాలని నిర్ణయించుకుంది మరో భార్య. మాతృత్వ భావన, సహచరుడి పట్ల ఉన్న గాఢమైన ప్రేమ ఈ స్త్రీలను నేటి సావిత్రులుగా మార్చింది.


వివాహం అయ్యాక భార్యాభర్తలు ఎన్ని ఊసులాడుకుంటారో ఎవరికి తెలుసు? పుట్టబోయే సంతానం గురించి ఎన్ని కలలు కంటారో ఎవరికి తెలుసు? పరస్పరం ఎంత అనురాగం పంచుకుంటారో ఎవరికి తెలుసు? వైవాహిక జీవితం సంతానం కలగడంతో ఫలవంతం అవుతుంది. మనిషి తన కొనసాగింపును సంతానం తో ఆశిస్తాడు. తన ఉనికి సంతానం ద్వారా వదిలిపెడతాడు. ఆ సంతానం కలిగే లోపే ఆ ఉనికి మరుగున పడిపోయే పరిస్థితి వస్తే?

అతని సంతానం కావాలి
మూడు రోజుల క్రితం గుజరాత్‌ హైకోర్టుకు అత్యవసర ప్రాతిపదికన ఒక మహిళ అప్పీలు చేసుకుంది. ‘నేను సంతానవతిని కాదల్చుకున్నాను. అందుకు నా భర్త నుంచి వీర్యం తీసి సంరక్షించుకునేందుకు అనుమతినివ్వండి’ అని. మంగళవారం (జూలై 20) కోర్టుకు వెళితే ఆ సాయంత్రానికే కోర్టు అనుమతినిస్తే అదే రోజు రాత్రి ఆమె భర్త నుంచి వీర్యాన్ని సేకరించి భద్ర పరిచారు డాక్టర్లు. వడోదరాలోని స్టెర్లింగ్‌ హాస్పిటల్‌లో ఈ ఉదంతం జరిగింది. ‘పేషెంట్‌కు కోవిడ్‌ వల్ల మల్టిపుల్‌ ఆర్గాన్స్‌ ఫెయిల్యూర్‌ జరిగింది. అతను ఇప్పుడు సపోర్ట్‌ సిస్టమ్‌లో ఉన్నాడు. ప్రాణాలు దక్కే ఆశలు అతి స్వల్పం. అందుకే అతని భార్య అతని వీర్యం ద్వారానే కృత్రిమ పద్ధతిలో భవిష్యత్తులో సంతానవతి అయ్యే విధంగా వీర్యాన్ని సేకరించమని మమ్మల్ని కోరింది. భర్త కుటుంబం అందుకు అంగీకరించింది. అయితే అలా వీర్యాన్ని సేకరించాలంటే ఆ పురుషుడి అనుమతి ఉండాలి. అనుమతి ఇచ్చే స్థితిలో అతను లేడు. అందుకే కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోమన్నాం. ఆమె కోర్టు నుంచి అనుమతి తీసుకురావడంతో వెంటనే వీర్యాన్ని సేకరించాం. అలా వీర్యాన్ని సేకరించే ప్రొసీజర్‌కు అరగంట సమయం పట్టింది’ అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

మాతృత్వపు హక్కు ప్రతి స్త్రీకి ఉంటుంది. సహజంగా వీలు లేకపోతే కృత్రిమ పద్ధతి ద్వారా, సరొగసి ద్వారా ఆమె తల్లి కావచ్చు. కాని ఈ కోవిడ్‌ కాలంలో అన్నీ హటాత్తుగా జరిగిపోతున్నాయి. ఎన్నో ఆశలు, కలలు కన్న జీవన భాగస్వాములు రోజుల వ్యవధిలో అదృశ్యమవుతున్నారు. సంతాన కల నెరవేరక ముందే వారు మరణించే పరిస్థితి ఎన్నో కుటుంబాల్లో ఈ కోవిడ్‌ కాలంలో జరిగినా ఈ మహిళ మాత్రం భర్త ద్వారానే సంతానాన్ని కనడానికి ఈ విధం గా నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆకర్షిస్తోంది. ఆమెను అర్థం చేయించే ప్రయత్నం చేస్తోంది. హైకోర్టు ఆమె నిర్ణయానికి మద్దతుగా ‘కృత్రిమ పద్ధతిలో ఆమె తల్లి అయ్యే విషయం లో మీ అభిప్రాయం ఏమిట’ని ప్రభుత్వాన్ని, ఆస్పత్రి వర్గాలని కూడా సమాధానం కోరుతూ నోటీసులు ఇచ్చింది.  

భర్త చనిపోయాక తల్లి కావాలని...
అయితే ఇదే వడోదరాలో రెండు నెలలుగా మరో మహిళ కూడా ఇదే కారణంతో వార్తల్లో ఉంది. ఆమె పేరు హెలీ ఏర్కే. వయసు 36. వడోదరాలో అకౌంటెంట్‌గా పని చేస్తోంది. ఆమె భర్త సంజయ్‌ టీచర్‌గా పని చేసేవాడు. ఏప్రిల్‌ మొదటి వారంలో అతడు కోవిడ్‌ వల్ల మరణించాడు. ‘నా భర్త ఎంతో మంచివాడు. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనాలని నాకు చెప్పేవాడు. నేనంటే ఎంతో ప్రేమ. నాకు 30 ఏళ్లకు పెళ్లయ్యింది. ఆయన నా కంటే పెద్ద.

పెళ్లి సమయంలోనే మేము లేటు వయసు వల్ల గర్భధారణకు ఇబ్బంది వస్తుందా అని సందేహించాం. రెండు మూడు ఆస్పత్రులకు తిరిగి చివరకు ఒక ఆస్పత్రి లో మా ‘ఎంబ్రియో’ (అండం, వీర్యాల ఫలదీకరణం. దీనిని గర్భంలో ప్రవేశపెట్టాక పిండం అవుతుంది)లు ఐదారు సంరక్షించుకున్నాం. నా భర్త జీవించి ఉండగా ఒక ఎంబ్రియోతో గర్భం దాల్చడానికి ప్రయత్నించాను. నిలువలేదు. ఇప్పుడు నా భర్త లేడు. కాని అతని వారసుణ్ణి కనాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. నా కుటుంబం సమాజం ఇందుకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను’ అని హెలీ అంది.

సంతానం కలిగితే ఆ సంతానంలో భర్తను చూసుకోవాలని ఆమె తపన. ‘నా గర్భాశయం గర్భం మోయడానికి అనువుగా లేదని డాక్టర్లు తేల్చేశారు. మా ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బును నేను తల్లి కావడానికి వెచ్చిస్తాను. సరొగసీ ద్వారా నేను నా భర్త అంకురాన్ని నిలబెట్టుకునే ప్రయత్నిస్తాను’ అని హెలీ అంది.

కోవిడ్‌ ఎందరికో మరణశాసనాలు రాస్తోంది. కాని మనుషులు జీవించే ఆశను పునరుజ్జీవింప చేసే ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఒక మనిషి మరణించినా అతడి సంతానం జన్మనెత్తే వినూత్న సమయాలను ఇప్పుడు మనిషి సృష్టిస్తున్నాడు.
క్రిమి మరణిస్తుంది.
మనిషి తప్పక జయిస్తాడు.
 
హెలీ ఏర్కె, సంజయ్‌

మరిన్ని వార్తలు