Ramadan 2022 Special Story: ఆధ్యాత్మిక తరంగం రమజాన్‌

4 Apr, 2022 07:59 IST|Sakshi

ఇస్లాం వెలుగు

పవిత్ర రమజాన్‌ ప్రారంభవేళ..పగలంతా ఉపవాసాలు.. సాయంత్రం ఇఫ్తార్‌ విందులతో వీధులన్నీ కళకళలాడబోతున్నాయి. పిల్లలూ పెద్దల హడావిడితో వాతావరణమంతా అప్పుడే సందడిగా మారింది. మండువేసవిలోనూ నిండు వసంతం కుండపోతలా వర్షించడం మొదలైంది. మానవుల పాపాలను కడిగి, పునీతం చేసే పవిత్ర రమజాన్‌ నెల ప్రారంభమైంది. మనిషిలోని దుర్లక్షణాలను హరింపచేసి, ప్రేమ, దయ, జాలి, కరుణ, సానుభూతి వంటి సానుకూల భావనలను పెంపొందింపచేసే పవిత్ర రమజాన్‌ మానవాళికి సరైన జీవన సూత్రాలను ప్రబోధించే మార్గదర్శి.

రమజాన్‌ ఒక అలౌకిక భావన. తేజోమయ ఆథ్యాత్మిక తరంగం. సత్కార్యాల సమాహారం. వరాల వసంతం. మండువేసవిలో నిండు వసంతం. మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికీ, జీవన సాఫల్యానికి అవసరమైన సమస్తమూ దీనితో ముడివడి ఉన్నాయి. రమజాన్‌లో పవిత్ర ఖురాన్‌ గ్రంథం అవతరించింది. సమస్త మానవాళికీ ఇది ఆదర్శ ప్రబోధిని. కారుణ్య సంజీవిని. మార్గప్రదాయిని. రమజాన్‌ లో ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డాయి. ఇవి మానవుల్లో దైవభక్తినీ, దైవభీతిని ప్రోదిచేస్తాయి. స్వర్గానికి బాటలు వేస్తాయి. వెయ్యి నెలలకన్నా విలువైన రాత్రి ‘షబేఖద్ర్‌’ కూడా రమజాన్‌ లోనే ఉంది.

ఈ ఒక్కరాత్రి ఆరాధన వెయ్యినెలల ఆరాధనకన్నా మేలైనది. రమజాన్‌లో సత్కార్యాల ఆచరణ ఎక్కువగా కనబడుతుంది. దుష్కార్యాలు ఆగిపోతాయి. సమాజంలో చక్కని అహ్లాదకరమైన మార్పు కనిపిస్తుంది. ఐదుపూటల నమాజుతోపాటు, అదనంగా తరావీహ్‌ నమాజులు ఆచరించబడతాయి. సాధారణ దానధర్మాలతోపాటు,‘ఫిత్రా’అనే ప్రత్యేక దానాలు కూడా రమజాన్‌ లోనే చెల్లిస్తారు. దీనివల్ల సమాజంలోని పేదసాదలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. చాలామంది ‘జకాత్‌’ కూడా రమజాన్‌ లోనే చెల్లిస్తారు. ఇది కూడా పేదల అవసరాలు తీర్చడంలో గణనీయంగా తోడ్పడుతుంది.

అంతేకాదు, రమజాన్‌ నెలతో అనుసంధానమై ఉన్న విషయాలు అనేకం ఉన్నాయి. ప్రధాన ఆరాధన, ప్రత్యేక ఆరాధన మాత్రం’రోజా’ (ఉపవాసవ్రతం)యే. దేవుడు ఈ నెలను బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దాడు. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రయోజనం పొందే ప్రయత్నం చెయ్యాలి. నిజానికి ఉపవాస వ్రతమన్నది కేవలం ముహమ్మద్‌ ప్రవక్త వారి అనుచరులకు మాత్రమే, అంటే ముస్లింలకు మాత్రమే పరిమితమైన ఆరాధన కాదు. ఇది సార్వకాలికమైన, సార్వజనీనమైన ఆరాధన. దీనికి చాలా ఘనమైన, ప్రాచీన సామాజిక నేపథ్యం ఉంది.

ఇది అనాదిగా అన్ని కాలాల్లో, అన్ని సమాజాల్లో చెలామణిలో ఉన్నట్లు దైవగ్రంథం పవిత్ర ఖురాన్‌ చెబుతోంది. ‘విశ్వాసులారా..! పూర్వ ప్రవక్తల అనుయాయులకు ఏవిధంగా ఉపవాసాలు విధించబడ్డాయో, అదేవిధంగా ఇప్పుడు మీరు కూడా విధిగా ఉపవాసాలు పాటించాలని నిర్ణయించాము. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.’ (2 – 183 ) అంటే, ఉపవాసవ్రతం కేవలం ఈనాటి ముస్లిం సముదాయానికి మాత్రమే ప్రత్యేకమైనది, పరిమితమైనది కాదని, పూర్వకాలం నుండీ ఆచరణలో ఉన్న సనాతన ధర్మాచారమని మనకు అర్థమవుతోంది.

ఈరోజు కూడా ప్రపంచంలోని అన్నిదేశాల్లో అన్ని జాతులు, అన్ని మతాల వారిలో ఏదో ఒక రూపంలో ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉంది. మానవ సమాజంలో మంచి, మానవీయత, భయభక్తుల వాతావరణాన్ని జనింపజేయడం, విస్తరింపజేయడమే ఈ ఉపవాసాల ఆచరణలోని అసలు ఉద్దేశ్యం. పవిత్ర ఖురాన్‌ మార్గదర్శకంలో, ప్రవక్తవారి ఉపదేశానుసారం మనం మన జీవితాలను సమీక్షించుకుంటే, సంస్కరణ ఎక్కడ అవసరమో గుర్తించే వీలు కలుగుతుంది. తద్వారా ఆచరణకు మార్గం సుగమం అవుతుంది. ఇలాంటి స్వీయసమీక్ష కు, సింహావలోకనానికి రమజాన్‌ కంటే మంచి తరుణం మరొకటి ఉండబోదు. అల్లాహ్‌ అందరికీ రమజాన్‌ శుభాలను సొంతం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించమని వినమ్రంగా వేడుకుందాం. – ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు