ఈవారం కథ: ఎదురు చూపులు 

19 Sep, 2021 12:07 IST|Sakshi

తెల్లారితే ‘బుల్లి బుజ్జి’గాడి పెళ్లి. అంతా సందడిగా ఉంది. ఆ ఇంటి మనుషుల్లో  మాత్రం సంతోషం లేదు. పెళ్లి పందిరికి కొంచెం ఆవల.. బోదె గట్టునున్న డొక్కల గూడుకి జారబడి ఆకాశం వైపు చూస్తా ‘పెద్ద బుజ్జి’గాడి కోసం ఆలోచిస్తున్నాడు శ్రీరామ్మూర్తి. ఆడు ఇల్లొదిలి పెట్టేసి వెళ్లి ఐదేళ్లు దాటేసింది. ‘బుల్లి బుజ్జి’గాడి పెళ్లికి ముçహూర్తం పెట్టిన రోజు నుండీ అస్తమానూ ‘పెద్దబుజ్జి’గాడే గుర్తొస్తున్నాడు. అలా ఆడు గుర్తొచ్చినప్పుడల్లా  పెద్దాడికి కాకుండా చిన్నోడికి పెళ్లంటే గుండె గుబ గుబలాడిపోతోంది. పోనీ ఆడికే పెళ్లి చేద్దామంటే ఆ మనిషి ఊసే తెలియకుండా పోయింది. ఆనోటా ఈ నోటా తమ్ముడి పెళ్లి సంగతి తెలిసైనా ఇంటి మొహం చూస్తాడన్న ఆశ, ఒడిగట్టిన దీపంలా మిణుకు మిణుకు మంటూనే ఉంది. ఆరు బయట నిలబడి తల కాస్త బయటికి వంచి కళ్లు చిట్లించి రోడ్డు మలుపులోకి ఆశగా చూస్తున్నాడు శ్రీరామ్మూర్తి. రోడ్డు మీద వీధి దీపాల పలచటి వెలుగు. రోడ్డుకి అవతలున్న వరిచేలలో నుండి కీచురాళ్ళ శబ్దం లయబద్ధంగా వినిపిస్తోంది. పెళ్లి పందిరిలో పసుపు నీళ్లు చల్లడం కోసం ఇంట్లో నుండి  బయటకొచ్చింది వరలక్ష్మి.

శ్రీరామ్మూర్తిని చూసి  
‘ఏంటయ్యా చుక్కలు లెక్కెట్టేతున్నావ్‌. కొంపదీసి కొనేత్తావా ఏంటీ?’ బుగ్గలు నొక్కుకుంటూ వెటకారంగా అంది. 
‘అబ్బా.. ఊరుకోవేసే! యెప్పుడూ ఎటకారమే నీకు? మన పెద్దోడి కోసం ఆలోసిత్తన్నానే.. ఎక్కడున్నాడో ఏంటో? మనసంతా ఆడే ఉన్నాడే’ ఆ మాటలంటున్నప్పుడు శ్రీరామ్మూర్తి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. వరలక్ష్మి కళ్లల్లో వెటకారం ఆవిరైపోయింది. ఆమె మొహం మబ్బులు కమ్మేసిన ఆకాశమైపోయింది.
‘ఊరుకో లేవయ్యా! ఆడు ఎక్కడున్నా నిజంగా మనల్నే కనిపెట్టుకుని ఉండుంటే, తెల్లారే సరికి మూర్తం టైమ్‌కైనాతప్పకుండా వొత్తాడు. ఆడిప్పుడు రాలేదంటే ఇంక ఎప్పటికీ రానట్టే. ఆడు రాకపోతే ఏమయ్యా? ఎక్కడోచోట చల్లగా ఉంటే అదే చాలు! ఎక్కువ ఆలోచన ఎట్టుకోకుండా నువ్వెళ్ళి ఏదో ఓ మూల నడుం వాల్చు. తెల్లారగట్ల పెళ్లి పనులు సక్కబెట్టుకోవాలి కదా!’ అనేసి బరువెక్కిన గుండెతో ఇంట్లోకెళ్ళిపోయింది వరలక్ష్మి.

శ్రీరామ్మూర్తికి ఏం చేయాలో పాలుబోవడం లేదు. ఒకట్రెండు సార్లు రాత్రుల్లో మల్లిబాబుగాడికి లాకు సెంటర్లో కనిపించినట్టు చెప్పేడు. నిజమో! అబద్ధమో?! ఏదో శంక అడ్డొచ్చి ఇంటికి రావడానికి తన్నుకులాడుతున్నాడేమో! ఇంటి ముందున్న పంటబోదెకి, అడ్డంగా ఏసిన తాటి పట్టెల మీదగా నడిచి రోడ్డు మీదకొచ్చాడు శ్రీరామ్మూర్తి. ఆ రోడ్డు పక్కనున్న దిబ్బల మీద వేసిన గడ్డి మేటుల్లో నుండి రోడ్డు మీదకొస్తున్న ఎలుకలు అడుగుల చప్పుడుకి బెదిరిపోయి మళ్ళీ గడ్డి వాముల్లోకి దూరిపోతున్నాయి. నడుస్తూనే ‘ఆ రోజు’ జరిగిందంతా అవలోకనం చేసుకుంటున్నాడు. 
∙∙ 
అది సంక్రాంతి నెల. ఒళ్ళంతా బురద  పూసుకుని ఓ వారం తరవాత ఇంటి గుమ్మంలోకి అడుగుపెట్టాడు ‘పెద్దబుజ్జి’. యవ్వనంతో పంట బోదె పక్కన నిబ్బరంగా పెరిగిన ‘టేకు మాను’లా పిటపిటలాడుతున్నాడు. ఒంటికి అంటిన బురదతో నల్ల రాతి విగ్రహానికి మట్టి పూత పూసినట్టున్నాడు. ఆడి ఒత్తయిన నల్లటి జుట్టులో నుండి చెమట చెంపల మీదగా జారి మెడ వంపులోకి తిరిగి జారుతోంది. ముక్కు మీద  కొన్ని చెమట చుక్కలు ముత్యాల్లా మెరుస్తున్నాయి. పెదాలపైన  నవ్వు.. మబ్బుల చాటు నుండి తొంగిచూసే చందమామలా వెలుగుతోంది. కొడుకు వాలకం చూసి గబగబా పొయ్యి మీద నీళ్లు పెట్టింది వరలక్ష్మి. ఉడుకుడుకు నీళ్లు నెత్తి మీద నుండి పోసుకున్నాడు పెద్దబుజ్జి.

ఒంటి మీద బురద, పాయలు పాయలుగా నేలకి జారిపోయింది. ఆడి మెడలో వేళ్ళాడుతున్న బొటన వేలంత వీరాంజనేయుడి ‘వెండి బొమ్మ’ మంచు గడ్డలా తెల్లగా మెరిసి పోతోంది. మనిషి.. గుళ్లో రాముడిలా నల్లగా నిగనిగలాడిపోతున్నాడు. వరలక్ష్మి  కొడుకుని కళ్లారా చూసుకుని ‘నా అందమే వొచ్చింది చిట్టి నా తండ్రికి!’ అని మురిసిపోతూ మెటికలు విరిచింది. వాకిలి బయటున్న కొబ్బరి చెట్టుకి నిలబడి ఆ తంతు అంతా చూస్తూనే ఉన్నాడు శ్రీరామ్మూర్తి. కొడుకుని ఏదో అడగాలనుకుని సమయం కోసం ఆగి చూస్తున్నాడు. అప్పుడే వార్పు తీసిన వేడి వేడి అన్నంలో  పెద్దబుజ్జికి ఇష్టమైన చేమదుంపల పులుసు వేసి కొడుకు ముందు పెట్టింది. ఆవురావురుమని తింటున్న కొడుకుని చూస్తుంటే వరలక్ష్మి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.


‘ఇంకెన్నాళ్లురా ఈ చాకిరీ.. బుల్రాజుగారి పొలంలో గొడ్డులా కట్టపడుతున్నావు. బాకీ తీరడానికి ఇంకెన్నాళ్లు పడతాదంటాన్నార్రా?’ కొడుకుని ఆరా తీసింది. 
‘మొన్నే లెక్కలు చూసేరమ్మ రాజుగారు.. వొచ్చే ఏసం కాలానికి తీరిపోద్దంటమ్మ. అదయ్యాకా నేను ఎంచక్కా ఏదో యాపారం చేసుంటానే’ పెద్ద బుజ్జి కళ్ళు నక్షత్రాల్లా మెరిశాయి. 
‘మాయదారి ఇల్లు కట్టకపోయినా కొంపలేం ములగక పోదును. చేసిన అప్పుకి బంగారం లాంటి పిల్లోడ్ని ఆ కఠినాత్ముల దగ్గర పనికి పెట్టాల్సొచ్చింది. మాయదారి సంతని.. మాయదారి సంత’ వాకిట్లో నిలబడున్న మొగుడి వంక ఛీత్కారంగా చూసిందామె.
శ్రీరామ్మూర్తి తల తిప్పేసుకున్నాడు. 
‘పుణ్యవతిగారు ఎలాగున్నార్రా బుజ్జి! పాపం పట్టుమని మూడు పదులైనా నిండలేదు ఆవిడకి. భర్తపోయి  పుట్టింటి పంచకి చేరాల్సొచ్చింది. అన్నగారు చేసిన పాపాలు చెల్లి తలకి చుట్టుకున్నట్టున్నాయి. పాపం.. ఓ పసిగుడ్డునైనా కళ్ల చూడలేదు మా రాజు తల్లీ!’ బుగ్గలు నొక్కుకుంది వరలక్ష్మి.  ‘పుణ్యవతి’ పేరు వినగానే పెద్దబుజ్జిగాడి ఒళ్ళు ఉప్పొంగింది.


‘అమ్మా..  ఆవిడ చాలా మంచోరే. బోయినానికని ఇంటికిపోయి పంచలో కూకుంటే నీలాగే కడుపు చూసి అన్నం పెడతారే. వొద్దన్నా కొసరు ఏత్తారు. ఆదివారం రోజైతే నాలుగు మాంసం ముక్కలు ఎక్కువే ఎత్తారే. అమ్మా ఆవిడ ఎందుకో గానీ నేనంటే ఎక్కువ మక్కువ చూపిత్తారే. మిగిలిన పనోళ్లంతా నన్ను చూసి కుళ్ళు కుంటారే!’ పత్తి పువ్వులా నవ్వేడు బుజ్జి.
వరలక్ష్మి ఉలిక్కి పడింది.. ‘ఓరేయ్‌ పెద్దోడా! పెద్దోళ్ళతో సేగితాలు అంత మంచియివి కావురా. అయినా వన్నం ఆవిడేందుకు పెడతాది. వంట పనోళ్ళు లేరా ఆ ఇంట్లో !’ బుగ్గలు నొక్కుకుంటూ అడిగిందామె.
‘ఎప్పుడైనా కుదిరితే ఆవిడ నాకు మాత్రమే పెడతారే. నువ్వసలు మాయ తెలీనోడివిరా బుజ్జి! అని అంటారే. మా అన్న నీ చేత గొడ్డుచాకిరీ చేయుంచుకుంటున్నాడ్రా! అని బాధ పడిపోతారే. రాజుగారు ఇంట్లో లేనప్పుడే నాతో మాట్లాడతారు. ఆయనుంటే కాలు కూడా గుమ్మం బయటికి పెట్టరావిడ’ చిన్నపిల్లాడిలా సంబరంగా చెప్పుకుంటూ పోతున్నాడు పెద్దబుజ్జి. 

వరలక్ష్మి ఎందుకో కీడు శంకించింది.. ‘ఒరేయ్‌ పెద్దబుజ్జి!  ఎందుకు చెబుతున్నానో యినుకోరా. పెద్దోళ్ళతో మనలాంటోళ్ళం కొంచెం దూరంగా మసలాలి. ఆళ్ళు చనువిచ్చినా మనం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాల్రా. అందుకేనేమో మీ నాన్న నిన్నటి నుండి కిందా మీదా పడతన్నాడు. ఎవరో ఏదో చెప్పారంట నీ గురుంచి! నలుగురు నోళ్ళల్లో నానితే కొండంత నల్లరాడైనా నలుసై పోద్దిరా! కూసింత జాగ్రత్తరా నాన్నా’ కొడుకు గెడ్డం పట్టుకుని అతడి కళ్ళల్లోకి దీనంగా చూసింది వరలక్ష్మి. బుద్ధిగా తలాడించాడు పెద్దబుజ్జి.
రాత్రి భోజనాలు అయ్యాక విషయాన్ని మెల్లగా కదలేశాడు శ్రీరామ్మూర్తి.


‘ఏరా.. ఆ పుణ్యవతమ్మగారితో చనువుగా ఉంటన్నావంట. యెందాక వొచ్చిందేంటి యవ్వారం!’ అని కొడుకుని నిలదీశాడు. నులక మంచంలో పడుకున్న పెద్దబుజ్జి త్రాచుపాములా సర్రున పైకి లేచాడు. పిడికిలి బిగించాడు. పళ్ళు పటపటమని కొరికాడు.
‘ఏ ఎదవ నా కొడుకు చెప్పేడేంటీ నీతో. ఆడ్ని ఇటు రమ్మను. నరికి పోగులు పెట్టేత్తారాడయ్యా!’ అంటా బుసలు కొట్టాడు. అతడి కళ్ళల్లో గిరుక్కున నీళ్లు తిరిగాయ్‌. గొంతు గాద్గదికమైపోయింది.
‘ఎవడు చెప్తే నీకెందుకురా! నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు ముందు?’ కొడుకుని మరింత నిలదీశాడు శ్రీరామ్మూర్తి.
‘పెద్ద బుజ్జి’ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. వరలక్ష్మి ఒక్క ఉదుటన వొచ్చి కొడుకుని అక్కున చేర్చుకుంది.
శ్రీరామ్మూర్తి మింగిలా మిన్నకుండిపోయాడు. గుండె బరువు దిగే వరకూ ఎక్కెక్కి ఏడ్చాడు పెద్దబుజ్జి. మోచేత్తో కళ్ళు తుడుచుకున్నాడు. ముక్కు చీది వాళ్ళ నాన్న మొహంలోకి తీక్షణంగా చూశేడు.


‘ఇదిగో నీకైనా ఇంకెవడికైనా ఒకటే మాట చెబుతున్నా.. నన్నేమైనా అనండీ. కానీ పుణ్యవతమ్మ గార్ని ఏమైనా అన్నారంటే చెమడాలు ఎక్కదీసేత్తా ఏమనుకున్నారో!’ బట్టలున్న చేతి సంచిని తీసుకుని దిగ్గున అరుగు దిగి వెళ్లిపోయాడు పెద్దబుజ్జి.
‘అంత మొనగాడివైపోయావేరా.. ఏదీ నా చెమడాలు ఎక్కదీయి చూద్దాం’ వాకిట్లోకి ఉరికాడు శ్రీరామ్మూర్తి.
పెద్దబుజ్జి సివంగిలా బోదె దాటేశాడు. దాటినోడు దాటినట్టే చీకట్లో కలిసిపోయాడు. వెనుక నుండి వరలక్ష్మి అరుస్తూనే ఉంది. పెద్దబుజ్జి మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు. శ్రీరామూర్తిని శాపనార్థాలు పెట్టింది వరలక్ష్మి.


‘ఓ  రెండ్రోజులు ఉందామని ఇంటికొచ్చిన కొడుకుని పట్టుమని ఒక్క పూటైనా లేకుండా తరిమేశావ్‌ కదయ్యా! నీ నోట్లో మన్నడిపోనూ.. నిన్ను తగలెయ్యా!’ అంటూ. శ్రీరామ్మూర్తి ఏం మాట్లాడకుండా గమ్మున ఉండిపోయాడు. వాడెళ్ళిపోయాక ఓ రెండ్రోజులాగి కొడుక్కోసం వాకబు చేశాడు శ్రీరామ్మూర్తి. బుల్రాజుగారి కొండగట్టు పొలాల్లో దమ్ము చేస్తున్నాడని చెప్పారెవరో. పని మొదలెట్టాడంటే రాత్రి పగలు తేడా ఉండదు ఆడికి. బుల్రాజుగారి కొండగట్టు పొలం ఊరికి ఓ ఐదు కిలోమీటర్ల ఆవల ఉంటుంది. రాత్రి, పగలు ఆడికి అక్కడే మకాం. వారం గడిచిపోయింది. వారానికి ఇంటికి రావాల్సిన పెద్ద కొడుకు రాక పోయేసరికి కొంచెం కంగారు పడింది వరలక్ష్మి. రాజుగారి పొలంలో పనిచేసే మిగతా పనోళ్ళని వాకబు చేసింది.

రాజుగారి పాలేరు వీరంశెట్టి, రాజుగారి ఇంటి నుండి కేరేజీ పట్టికెళ్తే పొలంలోనే తినేసి అక్కడే పాకలో పడుకుంటున్నాడని చెప్పేరు. చూస్తుండగానే రెండో వారం వొచ్చేసింది. బుజ్జిగాడు రాజుగారి పొలాల్లో కనిపించడం లేదని చెప్పేరెవరో. రాజుగారింటికి ఎళ్ళేడు శ్రీరామ్మూర్తి. 
‘ఏరా శీరామ్మూర్తి.. ఆడు రాలేదా మీ ఇంటికి? చేలోనే ట్రాక్టరు వొదిలేసి ఎటో ఎల్లిపోయాడంట తొత్తు కొడుకు. బొత్తిగా భయం బత్తి లేకుండా పెంచేరు సన్నాసిని. ఆడింటికొస్తే నేను రమ్మన్నానని చెప్పు’ రెండే రెండు ముక్కలు మాట్లాడేసి దబ్బున కూర్చీలో నుండి పైకి లేచి భుజం మీద కండువాని ఒక్క దులుపు దులిపి విసురుగా ఇంట్లోకెళ్ళిపోయారు రాజుగారు.


చూస్తుండగానే వారాలు కదిలి నెలలైనాయి. ఎన్ని దిక్కులు తిరిగినా పెద్దబుజ్జిగాడి ఆచూకీ తెలీలేదు.  కొడుకు కోసం బెంగటిల్లి పోయాడు శ్రీరామ్మూర్తి. వరలక్ష్మి ఐతే మంచం పట్టేసింది. ఆడి కోసం వెతకని చోటు లేదు. చేయని వాకబు లేదు. ఎక్కడో టౌన్‌లో ఎవరో పిల్లతో కనిపించాడని ఒకరిద్దరు చెప్పేరు. అన్నవరం కొండమీద కనిపించాడని అన్నారు ఇంకొందరు. ఎన్ని శకునాలకి ఎళ్లినా ఏదో దిక్కున ఉన్నాడనే చెబుతున్నారు. కళ్ళు కాయలు కాసేలా కొడుకు కోసం ఎదురు చూస్తూ ఐదేళ్లుగా గుండెల్లోనే కుంపటి పెట్టుకుని భారంగానే బతుకుని వెళ్లదీస్తున్నారు ఆ ఇద్దరూ. బుల్లిబుజ్జిగాడి పెళ్లికైనా పెద్ద కొడుక్కి విషయం తెలిసి ఇంటికొస్తాడనే ఆశ వాళ్ళిద్దరిలో మిణుకు మిణుకు మంటూనే ఉంది. 
∙∙ 
శ్రీరామ్మూర్తి అడుగులు లాకు సెంటరు వైపు భారంగా పడుతున్నాయి. ‘ముత్తాలమ్మ దయ వల్ల ఆడక్కడే ఉంటే ఎంత బావుంటాది! వొచ్చే తీర్థానికి  యేట పోతుని బలిత్తాను తల్లో!’అని ఊరి దేవతకి మనసులోనే మొక్కుకుంటా లంక పొగాకు చుట్టని ఎలిగించాడు. పంచాయతీ ఆఫీసు దాటి, ఆ పక్కనే ఉన్న ముత్యాలమ్మ గుడి పక్కనుండి ఎడమ వైపుకి తిరిగి మెల్లగా కాలవ గట్టు ఎక్కేడు.  ఓ పక్క నిబ్బరంగా అంతెత్తు పెరిగి, బోర్డర్లో కాపుకాసే జవానుల్లా ఉన్నాయి తాడిచెట్లు. ఇంకో పక్క గుంపులు గుంపులుగా పెరిగి కాల్వలోకి జారిన ముళ్ల పొదలు.  నిశాచరాలు అలికిడి చేస్తున్నాయి. మెల్లగా లాకుల మీదకి వొచ్చి నిలబడ్డాడు శ్రీరామ్మూర్తి. రెండు కాల్వల మధ్యలో లాకుల దిగువున ఉన్న మొండిలో చింత చెట్ల గుబురుల్లో చిక్కటి చీకటి తలదాచుకుంది. చలికి ముడుచుకు కూర్చున్న ముసలమ్మల్లా నాలుగైదు పెంకుటిళ్లు.

ఓ పెంకుటింట్లో లైటు వెలుగుతూనే ఉంది. అది లాకు సూపెర్నెంటు ఆఫీసు. లాకు స్టాఫ్‌ కోసం కట్టిన మిగిలిన ఇళ్లు పాడుపడిపోవడం వల్ల వాటిల్లో ఎవరూ కాపురాలు ఉండట్లేదు. ఆ సూపెర్నెంటు ఆఫీస్‌ గది వెనుకనున్న కిటికిలో నుండి జారుతున్న లైటు వెలుతురు బయట ఉన్న చీకటిని చీల్చడానికి విఫలయత్నం చేస్తూ చింత చెట్ల మొదళ్లో పలచగా పరుచుకుంది. శ్రీరామ్మూర్తి చుట్టని మునివేళ్లతో తిప్పుతూ గట్టిగా ఓ దమ్ము లాగి వదిలాడు. చుట్టూ చూశాడు. ఎవరి జాడ కనిపించలేదు. కళ్ళల్లో నీళ్లు గిరుక్కున తిరిగాయి. భారంగా వెనక్కి తిరిగి వొచ్చేస్తుంటే చింతతోపులో చిన్నగా ఏదో అలికిడి అయినట్టనిపించింది. అటువైపు కళ్ళు చిట్లించి చూశాడు శ్రీరామ్మూర్తి.
చింత చెట్టు మొదట్లో, మసక మసగ్గా పరుచుకున్న వెలుతుర్లో ఏదో ఆకారం అస్పష్టంగా కదలాడినట్టన్పించింది. గట్టు మీద నుండి కొంచెం కిందకి దిగి పరకాయించి చూశాడు. ఒక్కటి కాదు రెండు ఆకారాలు. శ్రీరామ్మూర్తి కళ్ళు మెరిశాయి.


‘పెద్దబుజ్జిగాడే! ఆడి పక్కన ఉన్నది ఎవరో చెప్పిన పిల్ల గామోసు! ఆ పిల్లని ఊళ్ళోకి తీసుకు రావడానికి తన్నుకులాడుతున్నాడేమో’ గబగబా మొండిలోకి దిగిపోయాడు శ్రీరామ్మూర్తి. ఆ అలికిడికి ఆ రెండు ఆకారాలు ఉలిక్కిపడ్డాయి. దిగ్గున లేచి కూచున్నాయి. మగ ఆకారం వెంటనే తేరుకుని మసక వెలుతురులో నుండి చటుక్కున చిమ్మ చీకట్లోకి జారుకుంది. ఆడ మనిషి మాత్రం నెత్తి మీద చెంగు కప్పుకుని తలొంచుకుని అలాగే నిలబడి పోయింది. ఆ మగాడి వెనకాల పడ్డాడు శ్రీరామ్మూర్తి.

‘ఓరేయ్‌ పెద్దబుజ్జీ! నిన్నేం చేయను ఆగరా.. మీ అమ్మ నీ కోసం బెంగెట్టుకుందిరా’ అరుస్తూనే ఆ నల్లటి మనిషి వెనకాల పరుగెత్తాడు. ఆ మనిషి చీకట్లో చీకటిలా కలిసిపోతూ చేతికి చిక్కడం లేదు. శ్రీరామ్మూర్తి పరుగెడతానే ఉన్నాడు. పరుగెడుతూ పరుగెడుతూ ఇద్దరూ యించు మించుగా కాలవ వారకి వొచ్చేశారు. శ్రీరామ్మూర్తి ఆ నల్లటి మనిషి మీదకి ఉరికి లాఘవంగా చేతిని అతడి మెడ చుట్టూ మెలేశాడు. ఊపిరి ఆగిపోయినట్టు ఉక్కిరి బిక్కిరైపోయాడు ఆ మనిషి. శ్రీరామ్మూర్తిని ఒక్క తోపు తోశాడు ఆ నల్లటి మనిషి.
శ్రీరామూర్తి పట్టు తప్పి వెల్లకిలా పడబోయి తమాయించుకున్నాడు. ఆ ఊపులో ఆ నల్ల మనిషి మెడలోని తాడు శ్రీరామ్మూర్తి  చేతిలోకొచ్చేసింది. ఆ నల్లటి మనిషి మాత్రం ఒక్క అంగలో కాల్వలోకి దూకి రెండు బారల్లో ఆవలి ఒడ్డుకి వెళ్ళిపోయాడు. ఉసూరోమనిపోతూ సూపర్నెంటు ఆఫీసు కిటికీ దగ్గరకొచ్చి నిస్సత్తువుగా గోడకి జారగిలపడిపోయాడు శ్రీరామ్మూర్తి.


చేతిలో నల్ల తాడుని పైకెత్తి నిరాసక్తంగా చూశేడు దాని వైపు.  కొసన చంద్రుడిలా వేళ్ళాడుతూ తళుక్కున మెరిసింది వీర హనుమంతుడి వెండి బొమ్మ! దిగ్గున లేచి నిలబడ్డాడు శ్రీరామ్మూర్తి. ‘ఆడు బుజ్జిగాడే!’ నల్లతాడున్న ఆంజనేయుడి బొమ్మని పిడికిలిలో బిగించి పట్టుకున్నాడు.  
చీర చెంగుని నెత్తి మీద కప్పుకుని, వడి వడిగా గట్టు మీదకెళ్ళిపోబోతున్న ఆడామె భుజం మీద చెయ్యేసి సర్రున వెనక్కి లాగాడు. చీరచెంగు ఆమె నెత్తి మీద నుండి జారింది. కిటికిలోని లైటు వెలుగు ఆమె మొహం మీద పడింది. ఉలిక్కి పడ్డాడు శ్రీరామ్మూర్తి.

‘తూము కాడ బేబమ్మ!’ నోరెళ్లబెట్టాడు. తల దించుకుంది బేబమ్మ. 
‘ఏంటే బేబమ్మా! మా వోడు నీకోసం యిక్కడికొత్తున్నాడని ఒక్క మాటైనా సెప్పలేదే! ఆడి కోసం ఎంత మనేద పడతన్నామో నీకు తెల్వదా? నీకు మేమేం పాపం చేశామే బేబమ్మా!’ బోరుమంటూ మొహాన్ని రెండు చేతుల్లో దాచుకున్నాడు. 
చివ్వున తలెత్తింది బేబమ్మ ‘ఊరుకోవయ్యా పేద్ద ఏడ్చేవూ! వల్లో ఏసుకోడానికి పెద్దబుజ్జిగాడు మీ అందరిలాగా దగుల్బాజీ ఎదవనుకున్నావా! నిఖార్సైన మొగోడు. పెతీ ఆడబిడ్డలోనూ అమ్మని చూసేంత మంచోడు. ఆడ్ని ఏమైనా అంటే అన్నోళ్ల కళ్ళు పెటీల్మని పేలిపోతాయి. పురుగులు పడి సచ్చిపోతారు’
బేబమ్మ శాపనార్థాలు పెట్టింది. 

అది శ్రీరామ్మూర్తి క్కూడా తెలుసు. కాకపోతే ఆ రోజేదో సెప్పుడు మాటలు విని అలా ఊగిపోయాడు. కానీ మరిప్పుడు కళ్ళతో చూశాడు కదా! ‘అయితే ఆడిప్పుడు ఏ తప్పూ చేయలేదంటావా?’
‘ఆ.. ఇక్కడ జరిగింది తప్పే, కానీ ఆ తప్పు చేసింది పెద్దబుజ్జిగాడు కాదు. మల్లిబాబుగాడు’ బేబమ్మ ఆవేశంలో నిజం కక్కేసింది.
శ్రీరామ్మూర్తి స్థాణువై పోయాడు. ఆ వెంటనే తేరుకున్నాడు. ‘పారిపోయినోడు మల్లిబాబుగాడు అయితే ‘మరి ఇది?’ వెండి బొమ్మున్న అరచేతిని పైకెత్తి బేబమ్మ ముందుకి చాపాడు. 
బేబమ్మ నీళ్లు నమిలింది.. 
‘చెప్తావా.. పీక పిసికేసి కాల్వలో పడీ మంటావా!’ సింహంలా ముందుకురికాడు శ్రీరామ్మూర్తి. 
బేబమ్మ భయపడుతూనే చెప్పడం మొదలెట్టింది. 
∙∙ 
ఆయాల నీళ్ల బోదె దూకేసి చీకట్లో కలిసిపోయిన పెద్దబుజ్జి సరాసరి రాజుగారింటికి వెళ్లిపోయాడు. ఆయాలప్పుడు వొచ్చిన బుజ్జిగాడిని ఒకింత అనుమానంగా చూశేరు రాజుగారు. అసలు గొడవ చెప్పక నాన్న తాగి తందనాలు ఆడుతుంటే ఇంట్లో ఉండలేక వొచ్చేశానన్నాడు పెద్దబుజ్జిగాడు. రాజుగారికెందుకో నమ్మకం కలగలేదు. అప్పటికే పనోళ్లు ఒకరిద్దరు చెవులు కొరుక్కుంటున్నప్పుడు వినకూడని మాటలు ఒకట్రెండు ఆయన చెవిలో పడ్డాయి. అయినా కూడా చింకి చాప ఒకటి ఇప్పించి ఆడ్ని పంచలో పడుకోమన్నారు. బయటంతా చల్లగా ఉంది. ఆ చలిలోనే మోకాళ్ళు డొక్కలోకి ముడుచుకుని వొణుకుతా పడుకున్నాడు పెద్దబుజ్జి. అప్పటికే పుణ్యవతిగారు నిద్ర పోయేరు.

తెల్లారగట్ల ఇంకా మసక చీకటి ఉండగానే కాలు మడుచుకుందారని బయటకొచ్చింది ఆవిడ. పంచలో బుజ్జిగాడి మూలుగు  విన్పించిందావిడకి. జ్వరంతో ఆడి వొళ్ళు పెనంలా కాలిపోతుంటే దుప్పటి తెచ్చి కప్పేరు. తడిగుడ్డతో మొహం తుడిసి, నుదుటికి అమృతాంజనం రాస్తుంటే రాజుగారి కళ్ళల్లో పడిపోయారు. చప్పున తల దించేసుకున్నాడాయన. అంతకుమించి ఇంకేం అనలేదు చిత్రంగా. తెల్లగా తెల్లారక ఆరెంపీని పిలిపించి ఆడికి వైద్యం చేయించారు. ఆడికి ఇష్టమైన కూరలవి వొండి పెట్టమన్నారు రాజుగారు. కొంచెం తెరిపిన పడ్డాక రెండ్రోజులాగి కొండగట్టు పొలంలో దమ్ము చేయడానికని పంపించేరు. దమ్ము చేసినన్నాళ్లు అక్కడే మకాం. రోజూ రాజుగారి పాలేరు వీరంశెట్టి కేరేజీ పట్టుకెళ్ళి యిచ్చొచ్చేవోడు.
చెప్పడం ఆపేసింది బేబమ్మ.


‘ఆ తర్వాత ఏమైంది?’ హుంకరించాడు శ్రీరామ్మూర్తి.
‘ఆ తర్వాత ఆడి గురుంచి నాకేం తెలీదు’ తలొంచుకుని నిలబడింది బేబమ్మ. ఒక్క అంగలో ఉరికి బేబమ్మ జుట్టు పట్టుకుని గుంజి పళ్ళు పటపటా కొరికాడు శ్రీరామ్మూర్తి. బేబమ్మ నేలకి ఒంగిపోయింది. శ్రీరామ్మూర్తి కాళ్ళు పట్టుకోబోయింది.
‘నాకు అంత వరకే తెలుసు శీరామూర్తే.. అది కూడా ఆ వంట మనిషి నాగరత్నం చెబితే తెలిసింది. ముత్తేల్లమ్మ సాచ్చిగా ఇంకేం తెలీదు నాకు’ చేతులెత్తి దణ్ణమెట్టింది బేబమ్మ. 
‘మరి ఆ మల్లిబాబుగాడి మెళ్ళోకి ఈ బొమ్మేలా వొచ్చింది?’ కోపంతో శ్రీరామ్మూర్తి ముక్కు పుటాలు అదురుతున్నాయి. 
‘ఆ ఎండి బొమ్మ గురుంచి ఆ మల్లిబాబుగాడు ఎవరికీ చెప్పొద్దని ఒట్టేయించుకున్నాడు శ్రీరామ్మూర్తే! అయినా నీవు అడిగేవు గాబట్టి చెబుతున్నాను. అదైతే ఆడికి రాజుగారి కొండగట్టు పొలాల్లో దొరికిందంట’ అంటూ మళ్ళీ చెప్పడం మొదలెట్టింది బేబమ్మ. 

‘మొన్న పోయిన వేసవిలో చేపల చెరువు కోసమని కొండగట్టు పొలాల్లో ఓ పదెకరాల్లో మట్టి తవ్వించారంట రాజుగారు. పక్క టౌన్‌ నుండి తవ్వోడలు, పక్క ఊరు నుండి మట్టి పని చేసేవోల్లు వొచ్చేరు. మన ఊళ్ళో నుండి మల్లిబాబు, పాలేరు వీరంశెట్టి మాత్రమే ఆ జనాలతో కలిశారు. రెండో రోజు తవ్వకాల్లో తవ్వోడా పళ్ల చక్రాలకి ఓ ఎముకుల గూడు తగులుకుని పైకి లేచిందంట. పక్కూరు నుండొచ్చిన మట్టి పనోళ్ళు జడుసుకున్నారంట. ఆ పక్కనే మట్టిలో మల్లిబాబుకి  ఈ వెండి బొమ్మ దొరికిందంట. అది ఎవరికీ తెలీకుండా ఈడు బొమ్మని జోబీలో పెట్టేసుకున్నాడంట. ఎముకల గూడు గురించి బయటికి పొక్కితే ప్రాణాలు తీసేత్తానని బెదిరించారంట రాజుగారు. ఆ మర్నాడే  మల్లిబాబుకి జొరమొచ్చేసి ఓ రెండ్రోజుల వరకూ లేవలేదు. మళ్ళీ ఆడు ఆ పనికెళ్ళలేదు. ఓ రెండు మూడుసార్లు మల్లిబాబుగాడు రాజుగారి పాలేరుని దాని గురించి ఆరా తీసేడంటా. ఆడు ఇషయం చెప్పలేదంట. మల్లిబాబుగాడైతే ఆ ఎముకల గూడు ‘పెద్దబుజ్జి’ గాడిదేమో అంటున్నాడు. ఒకట్రెండు సార్లు ఈ బొమ్మ ఆడి మెళ్ళో ఈడు సూసేనంటున్నాడు. అది గనుక నీకంట్లో పడితే ఆరా తీత్తావని, ఇషయం బయటికి పొక్కితే రాజుగారు ఈడ్ని కూడా కొండగట్టు పొలానికి బలిత్తాడని బయపడి ఇన్నాళ్లు ఎవరి కంట్లో పడకుండా చొక్కాలో దాసేసుకున్నాడు ఆ బొమ్మని. నా మీద దయుంచి ఈ సంగతి ఇంకెక్కడా చెప్పకు శ్రీరామ్మూర్తే’ చేతులెత్తి దణ్ణమెట్టింది బేబమ్మ. 

శ్రీరామ్మూర్తి నిట్టనిలువునా నేల మీద కూలబడిపోయాడు. నెత్తిని నేలకేసి బాదుకున్నాడు. ‘పెద్దబుజ్జే..! ఎంత ఘోరం జరిగిపోయింద్రా.. పెద్దోళ్ళతో సేగితం చెయ్యొద్దని మీ అమ్మ చెప్పినా యిన్నావు కాదురా కొడుకో. పెద్దోళ్ళకి మన పేణాల కంటే ఆళ్ల పరువే పేణమని తెలుసుకోలేక పోయావేంట్రా.
ఒరేయ్‌ పెద్ద బుజ్జే.. ఆళ్ళు నీకెట్టిన కేరేజీల్లో ఏ విషమెట్టి సంపేశారో నా తండ్రో’ అంటా నెత్తీ నోరూ బాదుకుంటూ నేల మీద దొర్లిదొర్లి దిక్కులు పిక్కటిల్లేలా బోరుమన్నాడు. గుండెల్లో బరువు దిగే వరకూ చాలాసేపు అలా ఏడుస్తూనే ఉన్నాడు. 
∙∙ 
 తెల్లారిపోయింది.. ‘బుల్లిబుజ్జి’ గాడి పెళ్లైపోయింది.
‘మన పెద్దోడు రాలేదయ్యా!’ దిగులుగా శ్రీరామ్మూర్తి భుజం మీద తలవాల్చింది వరలక్ష్మి. 
‘ఏదో ఓ రోజు వొత్తాడు లేవే.. ఆడికి మనమంటే పేణం. పేణాల్ని వదిలేసి ఈ భూమ్మీద ఎవడు మాత్రం ఎంతకాలం ఉండగలడే’ శ్రీరామ్మూర్తి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.
పెద్దబుజ్జి భూమ్మీద లేడని తెలిస్తే వరలక్ష్మి బతికి బట్టకట్టలేదని శ్రీరామ్మూర్తికి తెలుసు. అందుకే విషయం ఎక్కడ బయటికి పొక్కనీయొద్దని ఆరాత్రే బేబమ్మ చేత ఒట్టేయించుకున్నాడు. పెద్దబుజ్జిగాడ్ని చంపేశారన్న విషయం ఇప్పుడు ఆ ఊళ్ళో ఆ ముగ్గురికి మాత్రమే తెలుసు. ‘పరువు’ కోసం పెద్దబుజ్జిగాడ్ని చంపించేసిన బుల్రాజుగారికి, ఆయన చెప్పినట్టే అన్నం కేరేజిలో విషం కలిపి చంపేసిన వీరంశెట్టికి ఆ విషయం ఆళ్ళకి తెలిసిపోయిందని ఏమాత్రం తెలీదు. ‘పెద్దబుజ్జిని’ తొమ్మిది నెలలు మోసి కనీ పెంచిన వరలక్ష్మి,
ఆడు రాజుగారి పొలంలో పని చేసినన్నాళ్లు కొడుకులా కనిపెట్టుకుని ఉన్న పుణ్యవతిగారు.. ఆడి కోసం ఆశగా ఎదురు చూస్తానే ఉన్నారు.

-శ్రీనివాస్‌ కుడిపూడి

మరిన్ని వార్తలు