Manicure: పెడిక్యూర్‌, మెనిక్యూర్‌ చేసుకోండిలా!

23 Apr, 2021 08:17 IST|Sakshi

అందంగా ఉండాలని ఎవరికుండదు? అందంగా కనిపించడానికి ప్రయత్నం చేయని వారుండరు. అయితే చాలా మంది ముఖవర్చసును మెరుగుపరుచుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తుంటారు గానీ, శరీరంలో మరే ఇతర అవయవాలపై అంత శ్రద్ధ చూపరు. కానీ ముఖంతోపాటు చేతులు, కాళ్లు కూడా శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటేనే అందానికి పరిపూర్ణత చేకూరడంతో పాటు ఆరోగ్య సంరక్షణ కూడా జరుగుతుంది.  

పాదాల సంరక్షణకు పెడిక్యూర్, గోళ్ల సంరక్షణకు మెనీక్యూర్‌ విధానాలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు అన్ని బ్యూటీపార్లర్‌లలో వివిధ ట్రీట్‌మెంట్లతోపాటు మెనీకూర్, పెడిక్యూర్‌లను అందిస్తున్నారు.  పాదాలను గోళ్లను అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడమే పెడిక్యూర్‌ అంటారు. పెడిక్యూర్‌ అనేది లాటిన్‌  పదం. లాటిన్‌  లో పెస్‌ లేదా పెడ్‌ అంటె పాదము, క్యూర్‌ అంటేరక్షణ అని అర్థం. చేతులు, చేతివేళ్లు, గోళ్లను అందంగా తీర్చిదిద్దే పద్ధతే మెనీక్యూర్‌. మెనీక్యూర్‌ కూడా లాటిన్‌ పదమే. మానస్‌ అంటే చేయి, క్యూర్‌ అంటే జాగ్రత్త అని అర్థం.

పెడిక్యూర్‌
మర్దన ద్వారా పాదాలను కాపాడుకోవడమే పెడిక్యూర్‌. రోజంతా పనిచేసి అలసిపోయిన మోకాళ్లు, పాదాలు, మడమలు,  కాలి వేళ్లు, గిలకలకు సున్నితమైన మజసాజ్‌ సాయంతో ఉపశమనం కలిగించడం పెడిక్యూర్‌లో ఒక భాగంగా ఉంటుంది. ఈ విధానంలో ప్యూమిస్‌ స్టోన్, మసాజ్‌ క్రీమ్, నెయిల్‌ బ్రష్, నెయిల్‌ కట్టర్, టబ్‌లను ఉపయోగిస్తారు. 

ఇలా చేస్తారు..
ముందుగా కాలి గోళ్ల పెయింట్‌ను తొలగిస్తారు. తరువాత గోళ్లను అనుకున్న రీతిలో కట్‌ చేస్తారు. తరువాత ఒక టబ్‌లో గోరువెచ్చని నీళ్లు తీసుకుని దానిలో చిటికెడు ఉప్పు, సుగంధ నూనే, నిమ్మరసం షాంపు వేసి 30 నిమిషాల పాటు పాదాలను నానబెడతారు. పాదాలు నానిన తరువాత ప్యూమిస్‌ స్టోన్‌  లేదా గరుకుగా ఉండే పిండితో మడమలు అరికాళ్లు శుభ్రంగా రుద్దుతారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత మర్దనా ఆయిల్‌ లేదా మాయిశ్చరైజర్‌తో పాదాలను మొదట సుతిమెత్తంగా, తరువాత కాస్త గట్టిగా మసాజ్‌ చేస్తారు.

తరువాత పాదాలను శుభ్రంగా తుడవడంతో పెడిక్యూర్‌ పూర్తవుతుంది. మసాజ్‌తో పాదాలకు ఉపశమనం కలిగి మనకు మానసికంగా ఒత్తిడి తగ్గినట్లు అనిపిస్తుంది. ఈ విధంగా నెలకు రెండు సార్లు పెడిక్యూర్‌ చేసుకుంటూ ఉంటే పాదాలు ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి. పెడిక్యూర్‌ కు కావాల్సి పరికరాలు అన్ని మన దగ్గర ఉంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. 

పెడిక్యూర్‌ రకాలు
పెడిక్యూర్‌ చేసే విధానంలో ఉపయోగించే సామాగ్రి, క్రీములు, అవి ఇచ్చే ఫలితాలను బట్టి వివిధ రకాల పెడిక్యూర్‌లు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. 
► క్లాసిక్‌ లేదా రెగ్యులర్‌ పెడిక్యూర్‌.
►ప్రెంచ్‌ పెడిక్యూర్‌
►జెల్‌ పెడిక్యూర్‌
►పారఫిన్‌  పెడిక్యూర్‌
►హాట్‌స్టోన్‌ పెడిక్యూర్‌
►ఫిష్‌ పెడిక్యూర్‌
►మిని పెడిక్యూర్‌
►స్పా పెడిక్యూర్‌
► ఐస్‌క్రీం పెడిక్యూర్‌
►పెడిక్యూర్‌
►వాటర్‌ లెస్‌ పెడిక్యూర్‌

►సాల్ట్‌ పెడిక్యూర్‌
►చాక్లెట్‌ పెడిక్యూర్‌
►అథ్లెటిక్‌ లేదా స్పోర్ట్స్‌ పెడిక్యూర్‌
►రోజ్‌ పెడిక్యూర్‌
►మిల్క్‌ అండ్‌ హనీ పెడిక్యూర్‌
►వైన్‌ పెడిక్యూర్‌
►షాంఘై పెడిక్యూర్‌
బేసిక్‌ క్యూర్‌ను ఇంట్లో ట్రై చేయవచ్చు, మిగిలినవి నిపుణులతోనే చేయించుకోవాలి. 

మెనీక్యూర్‌ ఎలాగంటే...
ముందుగా చేతి గోళ్లకు ఉన్న పాత నెయిల్‌ పెయింట్‌ను తుడిచివేస్తారు. తర్వాతా గోళ్లను నచ్చిన ఆకృతిలో అందంగా కత్తిరించి ట్రిమ్‌ చేస్తారు. ఇలా రెండు చేతుల గోళ్లను ట్రిమ్‌ చేశాక, ఒక గిన్నెలో సోప్‌ వాటర్‌ను తీసుకుని దానిలో హైడ్రోజన్‌  పెరాక్సైడ్, గ్లిజరిన్, నిమ్మరసం వేసి రెండు చేతుల వేళ్లు మునిగేలా అందులో ముంచి 10 నిమిషాలు ఉంచుతారు. ఇలా చేయడం వల్ల గోళ్లలో ఉండే మలినాలు, సూక్ష్మజీవులు నశించి గరుకుగా ఉంటే క్యూటికల్స్‌ మెత్తగా అవుతాయి. గోరు చుట్టూ ఉండే చర్మం కూడా మెత్తబడుతుంది. తరువాత అరిచేతుల నుంచి మోచేతుల వరకు శుభ్రంగా క్లీన్‌  చేస్తారు.

ఆపై రెండు చేతులను తడిలేకుండా టవల్‌తో తుడుస్తారు. క్యూటికల్‌ రిమూవర్‌తో గోరు చుట్టూ ఇంకా ఏమైనా క్యూటికల్‌ బిట్స్‌ ఉంటే తీస్తారు. దీనివల్ల గోరు పెద్దదిగాను అందంగాను కనిపిస్తుంది. తరువాత చేతులను శుభ్రంగా తుడిచి మాయిశ్చరైజర్‌తో చేతులకు వేళ్లకు మర్థన చేస్తారు. ఇలా 15 రోజులకొకసారి చేయడం వల్ల చేతులు అందంగా ఆరోగ్యంగా కనిపిస్తాయి. కాస్త ధరను భరించగలిగినవారైతే నిపుణులతో పెడిక్యూర్, మెనీక్యూర్‌ చేయించుకుంటే మరిన్ని మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది.

లాభాలేంటి?

  • పెడిక్యూర్‌లో పాదాల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే... మెనీక్యూర్‌లో చేతుల ఆరోగ్యంపై ఫోకస్‌ చేస్తారు.
     
  • రోజూవారి స్నానంలో పాదాలను చాలా మంది అశ్రద్ధ చేస్తుంటారు. ఫలితంగా వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. పెడిక్యూర్‌ చేయించుకోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.
     
  • తరచుగా ఎదురయ్యే పాదాల పగుళ్లను పెడిక్యూర్‌ నివారిస్తుంది.
     
  • గోళ్లకు రక్తప్రసరణ బాగా జరగడం వల్ల అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. గోళ్లకు కూడా పుష్కలంగా పోషకాలు అందడంవల్ల పెరుగుదల మంచిగా ఉండి మరింత కాంతివంతంగా మెరుస్తాయి.
     
  • పెడిక్యూర్‌ విధానం లో పాదాలకు మంచి మర్దన (మసాజ్‌) లభిస్తుంది. దీనివల్ల పాదాల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో ఎటువంటి నొప్పులు, ఆర్థరైటీస్, వెరికోస్‌ వెయిన్స్‌ వంటివి తలెత్తవు.
     
  • పాదాలకు చేసే మసాజ్‌తో శరీరం మొత్తం ఒకేరకమైన ఉష్ణోగ్రతలు కొనసాగడంతోపాటు, లింఫ్‌నోడ్స్‌లోని టాక్సిన్స్‌ బయటకు వెళ్లిపోతాయి.
     
  • సుతిమెత్తని పాదాలకు మసాజ్‌ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మసాజ్‌తో ఒత్తిడి తగ్గి మనస్సు ఉత్సాహంగా ఉంటుంది. దీంతో మనలో ఆత్మ విశ్వాసం పెరిగి నూతనోత్సాహంతో మరిన్ని విజయాలు సాధించవచ్చు.
     
  • ఇన్ని ప్రయోజనాలు ఉండబట్టే బ్యూటీపార్లర్లు, స్పాలు అందించే క్యూర్‌లపై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఆరోగ్యవంతమైన శరీరమంటే అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండడమే!
    చదవండి: దేశాయ్‌ డిజైన్స్‌ వెరీ ట్రెండీ!
మరిన్ని వార్తలు