గాంధీజీ చెక్కిన యోధ బీబీ అమ్తుస్సలామ్‌

28 Sep, 2020 01:38 IST|Sakshi

దేశ విభజన సమయంలో ఒక ముస్లిం మహిళ, తన కుటుంబమంతా పాకిస్తాన్‌కి తరలి వెళ్లిపోయినా తాను భారతదేశాన్నే ఎంచుకుని ఇక్కడే ఉండిపోయిందనీ, మతోన్మాద పిశాచాల కరాళ మృత్యు నర్తనలో మిలియన్ల మంది ప్రజల ప్రాణాలు ఆహుతౌతున్న కల్లోల సమయంలో శాంతి కోసం, సమైక్యత కోసం 26 రోజులు నిరాహార దీక్ష చేసిందనీ తెలుసుకుంటే నమ్మశక్యం కాదు. ఇటువంటి సంగతులు బీబీ అమ్తుస్సలామ్‌ జీవితంలో ఎన్నెన్నో ఉన్నాయి.

గాంధీజీ రాట్నం ముందు కూర్చుని నూలు వడుకుతున్న చిత్రాన్ని మనం చాలాసార్లు చూసి ఉంటాం. కానీ, గాంధీజీని చరిత్రని నేస్తున్న నేతగాడిగా, ఆయన విదేశీ అనుయాయి మేరీ బార్‌ అభివర్ణించింది. గాంధీజీ ముస్లిం అనుయాయి రైహానా త్యాబ్జీ, ఆయన్ని అత్యున్నత శ్రేణికి చెందిన మహాయోగిగా పరిగణించింది. రైహానా క్విట్‌ ఇండియా ఉద్యమంలో జైలుకి వెళ్లింది. గాంధీజీ తన యోగ శక్తితో వ్యక్తుల చేతననీ, జాతి చేతననీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడని, రైహానా అభిప్రాయపడింది. గాంధీజీ మట్టిబొమ్మలకి ఊపిరులూది మహా యోధుల్ని సృష్టించాడు. ఆ మహా తపస్వి, ఆ అగ్రశ్రేణి విప్లవకారుడు తయారు చేసిన అసంఖ్యాకమైన అతిలోక శూరుల్లో అగ్రశ్రేణికి చెందిన ఒక యోధ బీబీ అమ్తుస్సలామ్‌! 

పరదా సంప్రదాయాల్నీ, మతతత్వ ధోరణుల్నీ ధిక్కరించి, హిందూ–ముస్లిం ఐక్యతకోసం ప్రాణాలకు తెగించి పనిచేసిన పాటియాలా ధీర అమ్తుస్సలామ్‌ కృషికి తగినంత గుర్తింపు రాలేదు. ఇన్నేళ్లలో ఒక్క సమగ్రమైన పుస్తకమైనా రాకపోవడం విచారకరం. ఆమె జీవిత కథని రాయడానికి ఉన్న ప్రధానమైన సమస్య, సమాచార లోపమే. అమ్తుస్సలామ్‌ గురించి తెలుసుకోవడానికి మనకి ఉన్న ప్రధానమైన వనరు – గాంధీజీ రచన సంపుటుల్లో ఆమెని ఉద్దేశించి ఆయన రాసిన వందలాది లేఖలు, ఆయన ఇతరులకి రాసిన లేఖల్లో ఆమె గురించి చేసిన ప్రస్తావనలు మాత్రమే. ఇక్కడ సమస్య ఏమిటంటే, ఆ లేఖల్లో గాంధీజీ రాసిన విషయమే ఉంటుంది కానీ, అమ్తుస్సలామ్‌ రాసినదేమిటో, ఆమె రాసిన ఏ మాటకి స్పందనగా ఆ విషయాన్ని ఆయన రాస్తున్నాడో ఉండదు. సంభాషణలో ఒకపక్షాన్నే వింటూ మొత్తం సన్నివేశాన్ని ఊహించడం పెద్ద సవాలే. కానీ, మరో దారి లేని పరిస్థితి. ఆ విధంగా ఈ కథ గాంధీజీ వైపునుంచి రాసినదే అయింది. అమ్తుస్సలామ్‌ ఎన్నడూ పేరు ప్రఖ్యాతుల్ని కోరుకున్న వ్యక్తి కాదు. 1985లో చివరి శ్వాస తీసుకునే వరకూ ప్రజాక్షేత్రంలో ఉన్నా, తన గురించి చెప్పుకునే, రాసుకునే ప్రయత్నం పెద్దగా చేయలేదు. భరతమాత ముద్దుబిడ్డ, గాంధేయ ఆదర్శాల దీప్తికి నిలువెత్తు సాక్ష్యం అయిన ఆ విప్లవ మూర్తి స్ఫూర్తిని వర్తమాన భారతదేశానికి స్థూలంగానైనా పరిచయం చేసేందుకే ఈ చిన్న ప్రయత్నం.
-రమణమూర్తి
 

మరిన్ని వార్తలు