Crime Story: బ్లాంక్‌ చెక్‌లు అపహరించి ఫోర్జరీ సంతకాలతో కోట్లు కొల్లగొట్టిన హైటెక్‌ కిలాడి

11 Sep, 2022 16:26 IST|Sakshi

హైదరాబాద్, జూబ్లీ హిల్స్‌.. రోడ్‌ మీద నడుస్తున్నాడు విక్రమ్‌. అగర్వాల్‌ కంపెనీ బోర్డు చూసి ఆగాడు. లోపలికెళ్ళాడు. స్టాఫ్‌ ఇంకా వచ్చినట్టులేరు. గుమాస్తా ఒక్కడే ఉన్నాడు. అతని దగ్గరకెళ్ళి ‘మీ పేరు?’ అడిగాడు గుమాస్తాను. 
‘రామకృష్ణ’ అని చెప్పాడు అతను.  
‘మీ జీతమెంత?’ విక్రమ్‌.
 ‘ఎందుకు?’ ఎదురుప్రశ్న వేశాడు అతను. ‘చెప్పు బ్రదర్‌. సొల్యూషన్‌ చెప్తాను’ విక్రమ్‌.  ‘పదివేలు’ అతను.
 ‘ఈ మహానగరంలో పదివేలు ఏ మూల?’ విక్రమ్‌.
 ‘అయితే ఏం చేయమంటావ్‌?’ అతను. ‘నాకో సాయం చేస్తే లక్షరూపాయలిస్తాను. స్పాట్‌ పేమెంట్‌’ చెప్పాడు విక్రమ్‌.
‘ఇంతకీ మీరెవరు?’ అడిగాడు రామకృష్ణ. తనను పరిచయం చేసుకున్నాడు విక్రమ్‌. ఆలోచనలోపడ్డాడు రామకృష్ణ. లక్షరూపాయలు చేతికొస్తే దూరంగా వెళ్ళిపోయి ఏదో వ్యాపారం చేసుకోవచ్చని ఆశపడ్డాడు. ఆ çసంబరంతో ‘ఏం చేయాలి? రిస్క్‌ ఉండదు కదా?’ సంశయంగా రామకృష్ణ. 
 ‘రిస్క్‌ చేయకపోతే జీవితమే లేదు’  ధైర్యం చెప్పాడు విక్రమ్‌. 
ఏం చెబుతాడోననే కుతూహలంతో  అతనివైపు చూశాడు రామకృష్ణ.
‘అగర్వాల్‌ సంతకం ఓసారి నాకు చూపించాలి’ అడిగాడు విక్రమ్‌.
 ‘ఓస్‌ ఇంతేనా!’ అంటూ అగర్వాల్‌ సంతకమున్న బిల్‌ ఒకటి చూపించాడు రామకృష్ణ. జేబులోంచి సెల్‌ఫోన్‌ తీసి అగర్వాల్‌ సంతకాన్ని ఫొటో తీసుకున్నాడు విక్రమ్‌. 
‘ఫొటో ఎందుకు తీశావ్‌?‘ ఆశ్చర్యపోతూ అడిగాడు రామకృష్ణ.
‘లక్షరూపాయలు నీ చేతికి రావాలంటే ఇప్పుడు నువ్వు మరో పనిచేయాలి’ చెప్పాడు విక్రమ్‌. 
  ‘ఏంటది?’ ఈసారి గొంతు తగ్గించాడు రామకృష్ణ.  
‘అగర్వాల్‌ చెక్‌బుక్‌లోంచి ఖాళీ బ్యాంక్‌ చెక్‌ ఒకటిస్తే హార్డ్‌ క్యాష్‌ నీకిస్తాను’ విక్రమ్‌.
ఆ మాట విని ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు రామకృష్ణ.
‘రిస్క్‌ చేస్తేనే నీకైనా నాకైనా లైన్‌ క్లియరయ్యేది!’ అన్నాడు విక్రమ్‌. 
 కాసేపు మౌనంగా ఉండిపోయాడు రామకృష్ణ. 
 ‘టైమ్‌ లేదు. కాసేపట్లో మీ ఆఫీస్‌ స్టాఫ్‌ వచ్చేస్తారు’ తొందరపెట్టాడు విక్రమ్‌. 
చివరకు చెక్‌ ఇవ్వడానికే నిర్ణయించుకున్నాడు రామకృష్ణ. 
బీరువా తెరచి చెక్‌బుక్‌లోంచి ఓ లీఫ్‌ తీసి బయటకొచ్చాడు రామకృష్ణ. రోడ్డుమీద నిల్చొని ఉన్న విక్రమ్‌కి చెక్‌ ఇచ్చి అతనిచ్చిన లక్షరూపాయలు తీసుకుని లోపలకొచ్చాడు రామకృష్ణ. 
ఆటోలో బయటకు వెళ్ళిపోయాడు విక్రమ్‌.

అది జూబ్లీహిల్స్‌ మెయిన్‌ రోడ్‌.. జనంతో బిజీగా ఉంది. 
స్టేట్‌బ్యాంక్‌ ముందు ఆటో దిగాడు విక్రమ్‌. బ్యాంక్‌ వైపు చూశాడు. ఆటో ఫేర్‌ ఇచ్చి వాచ్‌ చూసుకున్నాడు. మధ్యాహ్నం పన్నెండు. తనకు కలిసొచ్చే టైమ్‌. 
పక్కనే ఉన్న రెస్టారెంట్‌కి వెళ్ళి ఎవరూ లేని చోట కూర్చున్నాడు విక్రమ్‌.
 బేరర్‌ రాగానే టీ ఆర్డరిచ్చాడు. ‘బేరర్‌ వచ్చేలోపు తన పని పూర్తిచేసేయాలి’ అనుకుని సెల్‌ఫోన్‌ ఓపెన్‌ చేసి రఫ్‌ పేపర్‌ మీద అగర్వాల్‌ సంతకం ప్రాక్టీస్‌ చేశాడు. 
తర్వాత  జేబులోంచి చెక్‌ తీసి సంతకం చేసి.. పదిలక్షల ఫిగర్‌ రాశాడు చెక్‌ మీద. విక్రమ్‌ మనసు కుదుటపడింది.
 బేరర్‌ తెచ్చిన టీ తాగి బిల్‌ పే చేసి  అక్కడ నుండి బయటకొచ్చాడు.
 బ్యాంక్‌లోకి వెళ్ళి క్యాష్‌ కౌంటర్‌ ముందు నిలబడ్డాడు.
 కౌంటర్‌ బిజీగా ఉంది. క్యాషియర్‌కి చెక్‌ ఇచ్చాడు.
‘ఇంతకు ముందు మిమ్మల్ని చూడలేదే. అగర్వాల్‌ ఆఫీసులో మీరు కొత్తగా చేరారా?’ అడిగాడు క్యాషియర్‌.
 ఔనంటూ తలూపాడు విక్రమ్‌. 
చెక్‌ అటూ ఇటూ చూశాడు క్యాషియర్‌.
 విక్రమ్‌ గుండెలో రైళ్ళు పరిగెత్తాయి. ‘వెనకాల సంతకం చేయండి’ అని క్యాషియర్‌ అనగానే గుండె మీద కుంపటి దించేసుకున్నాడు విక్రమ్‌. 
గబగబా సంతకం చేసి చెక్‌ క్యాషియర్‌ చేతికిచ్చాడు. 
చెక్‌ ఇచ్చిన నుండి తిరిగి క్యాష్‌ తీసుకునే వరకు విక్రమ్‌లో టెన్షన్‌. బీపీ పెరిగిపోయింది. కర్మకాలి అటువైపు పోలీస్‌ రాలేదు కదాని చుట్టూ చూశాడు.
 క్యాషియర్‌ ఇచ్చిన పదిలక్షలు తీసుకుని బ్యాగ్‌లో పెట్టుకుని అక్కడనుండి రోడ్డుమీదకి వచ్చాడు విక్రమ్‌.
 బాగా ఆకలిగా ఉంది. దగ్గర్లో ఉన్న హోటల్‌కి వెళ్ళి భోజనం చేశాడు. అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ బ్యాంక్‌కి వచ్చాడు.
అది లంచ్‌ అవర్‌. స్టాఫంతా లంచ్‌ కెళ్ళారు. అటూ ఇటూ చూసి క్యాష్‌ కౌంటర్‌ దగ్గరకెళ్ళాడు విక్రమ్‌. లోపలంతా చూశాడు. ఎవరూ లేరు.    క్యాషియర్‌ టేబుల్‌ మీదున్న క్లియరెన్స్‌ చెక్కులను పరిశీలించాడు. అందులోంచి తను ప్రెజెంట్‌ చేసిన చెక్‌ నెమ్మదిగా తీసి జేబులో పెట్టుకున్నాడు. తనని ఎవరైనా గమనిస్తున్నారేమోనని చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. 
బతుకు జీవుడా అనుకుంటూ అక్కడ నుండి మెయిన్‌ గేట్‌ దగ్గరకు వచ్చాడు.
‘ఇది లంచ్‌ అవర్‌ సార్‌. రెండు గంటలకు రండి’ వాచ్‌మన్‌ చెప్పాడు. 
‘మళ్ళీ వస్తాను’ అంటూ  బయటకొచ్చి ఆటోలో సికింద్రాబాద్‌ రెల్వేస్టేషన్‌ చేరుకున్నాడు విక్రమ్‌. 
ప్లాట్‌ఫామ్‌ రద్దీగా ఉంది. టికెట్‌ కౌంటర్‌కెళ్ళి విజయవాడకి టికెట్‌ తీసుకున్నాడు. ప్లాట్‌ఫామ్‌ మీద సిద్ధంగా ఉన్న రైలెక్కి కూర్చున్నాడు. టీసీ రాగానే బెర్త్‌ రిజర్వ్‌ చేసుకుని ‘హమ్మయ్య! ప్లాన్‌ సక్సస్‌’ అనుకున్నాడు. 

విజయవాడలో రైలు దిగి బయటకొచ్చాడు విక్రమ్‌. స్టేషన్‌కి వచ్చిన భార్య కారులో ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరాక ‘హమ్మయ్యా’ అంటూ ఊపిరిపీల్చుకుని ‘మీరు వచ్చేదాక నాకు ఒకటే టెన్షన్‌’ అంది అతని భార్య రమ్య. 
‘ఇలాంటి పనుల్లో రిస్క్‌ తప్పదు. అలాగని అన్ని రోజులూ మనవి కావు. ఎక్కడో ఒకచోట దీనికి గుడ్‌ బై చెప్పాలి’ అన్నాడు విక్రమ్‌.
 ‘ఈ డబ్బుతో ఎక్కడో ఒకచోట భూమి కొనేయండి. భవిష్యత్తులో అదే మనకు భరోసా’ చెప్పింది రమ్య. 
విజయవాడ ఇంజనీరింగ్‌ కాలేజీలో బిటెక్‌ చదివాడు విక్రమ్‌. సినీమాలు షికార్లతోనే కాలేజీ జీవితం గడిచిపోయింది. ఇంజనీరింగ్‌ మాత్రం పూర్తవలేదు. పెళ్ళయ్యింది. ఉద్యోగం లేదు. బతకాలి. ఏదో ఒక పనిచేయాలి. అప్పుడు ఈ రూట్‌ ఎంచుకున్నాడు. 

‘క్లియరెన్స్‌ చెక్కుల్లో పదిలక్షల చెక్కు కనిపించట్లేదు సార్‌’ క్యాషియర్‌తో అన్నాడు అటెండర్‌.
 ‘సరిగ్గా చూడు అక్కడే ఉంటుంది’ క్యాషియర్‌. 
 ‘చూశాను సార్‌. ఎక్కడా లేదు’ అటెండర్‌ మాటలకు ఖంగుతిన్నాడు క్యాషియర్‌. సొరుగులో ఉన్న పేపర్లన్నీ వెతికాడు. చెక్‌ కనిపించ లేదు. అప్పుడే విషయాన్ని మేనేజర్‌కు చేరవేశారెవరో. ‘సార్‌ మిమ్మల్ని మేనేజర్‌గారు రమ్మంటున్నారు’ అటెండర్‌ చెప్పగానే మేనేజర్‌ గదిలోకి వెళ్ళాడు క్యాషియర్‌.
 ‘ఆ క్లియరెన్స్‌ చెక్‌ దొరికిందా?’ మేనేజర్‌.  ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు క్యాషియర్‌.
‘క్యాష్‌తో ఆటలాడకు. నీ నిర్లక్ష్యం విలువ  పది లక్షలు. నా సర్వీస్‌లో ఇలా చెక్‌ మిస్సవడం ఇదే మొదటిసారి. ఏదైనా సమస్య ఉంటే సెలవు పెట్టి ఇంట్లో కూర్చోండి. బ్యాంకుకొచ్చి మాకు తలనొప్పి తేకండి. మరోసారి ఇలాంటి తప్పు జరిగితే శాశ్వతంగా ఇంటికెళ్తారు’ అంటూ వార్నింగిచ్చి ఎవరికో ఫోన్‌ చేశాడు మేనేజర్‌.
 తల దించుకుని మేనేజర్‌ గది నుండి బయటకొచ్చాడు క్యాషియర్‌.

‘ఇందులో బ్లాంక్‌ చెక్‌ ఒకటి మిస్సయింది’ అగర్వాల్‌ కంపెనీ మేనేజర్‌ ఎకౌంటెంట్‌ను అడిగాడు.
 ‘నాకేం తెలియదు సార్‌’ చెప్పాడు. ‘గుమాస్తా ఎక్కడ?’ అడిగాడు మేనేజర్‌. 
‘నిన్నటి నుండి ఆఫీస్‌కి రావట్లేదు సార్‌. సెలవు కూడా పెట్టలేదు’  చెప్పాడు ఎకౌంటెంట్‌. ‘ఇది వాడి పనే అయ్యుంటుంది’ అనుకుని రామకృష్ణకు ఫోన్‌ చేశాడు మేనేజర్‌. ‘ఈ నెంబర్‌  ప్రస్తుతం పని చేయట్లేదు’ అని వాయిస్‌ వచ్చింది.
చెక్‌ పేమెంట్‌ ఆపేయమని బ్యాంక్‌కి ఫోన్‌ చేశాడు మేనేజర్‌. చెక్‌ పేమెంట్‌ అప్పటికే జరిగిపోయిందని బ్యాంక్‌ స్టాఫ్‌ చెప్పగానే  నీరుగారిపోయాడు మేనేజర్‌.

‘ఏం సార్‌ మళ్ళీ రమ్మన్నారట?’ మేనేజర్‌తో అన్నాడు క్యాషియర్‌. ‘ఆ పది లక్షల చెక్‌ మీద సంతకం ఫోర్జరీ అట. సంతకం వెరిఫై చేశారా?’ అడిగాడు మేనేజర్‌.
 ‘వెరిఫై చేశాను సార్‌. సంతకం సరిపోయింది’ క్యాషియర్‌. 
‘కొంప మునిగింది. నువ్వు కొత్త తలనొప్పి తెచ్చావు’ అంటూ తలపట్టుకున్నాడు బ్యాంక్‌ మేనేజర్‌. 

పదిలక్షలు పెట్టి ఇచ్చాపురంలో రెండెకరాల ల్యాండ్‌ కొన్నాడు విక్రమ్‌ భార్య పేరు మీద. ఆస్తులయితే సంపాదించాడు గాని ఆత్మస్థయిర్యాన్ని కోల్పోతున్నాడు రోజురోజుకీ. ఆ భయంతోనే భార్యకు చెప్పాడు ‘ఇక ఇలాంటి పనులు చేయదల్చుకోలేదు. ఇప్పటికే చాలా చోట్ల వ్యక్తుల్ని, బ్యాంకుల్ని మోసంచేసి ఆ డబ్బుతో నీ పేర ఎకరాల కొద్దీ భూములు కొన్నా. అవి చాలు’ స్పష్టం చేశాడు విక్రమ్‌. 
‘వైజాగ్‌ చుట్టుపక్కల భూముల రేట్లు బాగా పెరుగుతున్నాయి. అక్కడ కూడా కొంత భూమి కొనేస్తే భవిష్యత్తులో అక్కడే స్థిరపడొచ్చు. ఈ ఒక్కసారి చూడండీ.. ఇదే మీ లాస్ట్‌ డీల్‌. ఇంక జీవితంలో ఇలాంటి పనులు చేయించను’ బతిమాలింది రమ్య.
 భార్య ముందు ఓడిపోయాడు విక్రమ్‌. చివరి ప్రయత్నంగా కాకినాడలోని వెంకట్‌ మోటార్స్‌ను ఎంచుకున్నాడు వెంటాడుతున్న భయంతోనే.

వెంకట్‌ మోటార్స్‌ ఆఫీస్‌లోకి అడుగుపెట్టాడు విక్రమ్‌. ఎవర్ని ఎలా డీల్‌ చేయాలో విక్రమ్‌కి కొట్టిన పిండి. అందులో పనిచేసే కార్మికులకు తక్కువ జీతాలు ఇస్తారనే అపవాదు ఆ సంస్థ యాజమాన్యానికి ఉంది. ఆ బలహీనతే విక్రమ్‌కి కలిసొచ్చింది.
 ఆఫీస్‌లో స్టాఫ్‌ లేని టైమ్‌లోనే విక్రమ్‌ ఇలాంటి దందాలు నడుపుతాడు. ఓ ఏభై ఏళ్ళ వ్యక్తి అక్కడ గుమాస్తాగా పనిచేస్తున్నాడు. అతని గురించి ముందుగానే అన్నీ తెలుసుకున్నాడు. అతని దగ్గరకు వెళ్ళి తనెవరో ఎందుకొచ్చాడో చెప్పాడు. 
విక్రమ్‌ చెప్పిన పని చేయడానికి ముందు అతను నిరాకరించాడు.
‘నీ జీతంతో ఈ జన్మలో నీకూతురి పెళ్ళి చేయలేవు. నేను చెప్పినట్టు చేస్తే రెండు లక్షలిస్తాను. దాంతో నీ కూతురి పెళ్ళి చెయ్యొచ్చు’ ఆశ చూపాడు విక్రమ్‌.
 ‘నాకు కూతురుందని నీకెలా తెలుసు?’ ఆశ్చర్యపోయాడు అతను.
 ‘నీ గురించే కాదు. మీ బాస్‌ గురించి కూడా తెలుసు. ఈ అవకాశం వదులుకోకు. మీ ఎండీ గారి బ్లాంక్‌ చెక్‌ ఒకటి ఇస్తే నీ దరిద్రం మొత్తం తీరిపోతుంది. చెక్‌ మిస్‌ అయిందని అనుకుంటారు. నీకేమీ కాదు’ ధైర్యం చెప్పాడు విక్రమ్‌. 
మనసు మార్చుకున్నాడు గుమాస్తా. చెక్‌బుక్‌లోని లీఫ్‌ ఒకటి తీసి విక్రమ్‌కిచ్చాడు.
 ‘మీ ఎమ్‌డీ సంతకం ఓసారి చూపించు’ అని అడగ్గానే సంతకాలు చేసున్న ఫైల్‌ విక్రమ్‌ చేతికిచ్చాడు. ఆ సంతకం ఉన్న పేపర్ని మొబైల్‌లో ఫొటో తీసుకున్నాడు విక్రమ్‌. 
‘డబ్బిస్తాను, ఓసారి బయటకు రండి’ చెప్పాడు విక్రమ్‌. 
గుమాస్తా బయటకు రాగానే ఎవరూ చూడకుండా రెండు లక్షల కవరు అతని చేతికిచ్చాడు. 
ఇంటికి వెళ్ళి డబ్బు ఇంట్లో పెట్టి మళ్ళీ ఆఫీస్‌కి వచ్చేశాడు గుమాస్తా.
మున్సిపల్‌ ఆఫీస్‌ పక్కనున్న పార్క్‌లోకి వెళ్ళాడు విక్రమ్‌. ఆ టైమ్‌లో పార్కులో జనం ఉండరు. వెళ్ళి ఖాళీ బెంచీ మీద కూర్చున్నాడు. ఫొటో తీసిన సంతకాన్ని ప్రాక్టీస్‌ చేసి ఖాళీ చెక్‌ మీద సంతకం పెట్టి అమౌంట్‌ వేశాడు. అప్పుడు సమయం పన్నెండు దాటింది.  
పక్క రోడ్‌లో ఉన్న ఆంధ్రాబ్యాంక్‌ ముందు ఆగాడు విక్రమ్‌. 
కస్టమర్స్‌తో బ్యాంక్‌ రద్దీగా ఉంది. లోపలకు వెళ్లాడు. క్యాష్‌ కౌంటర్‌ బిజీగా ఉంది. లైన్‌లో నుంచున్నాడు. తన వంతు రాగానే చెక్‌ క్యాషియర్‌ చేతిలో పెట్టాడు. 
కంప్యూటర్‌లో బ్యాలెన్స్‌ చెక్‌ చేసి సంతకం టాలీ చేశాడు. అన్నీ సరిపోయాయి. 
క్యాషియర్‌ అప్పటికే బాగా అలసిపోయాడు. చెక్‌ ఎవరు తెచ్చారన్న సంగతి మర్చిపోయి పది లక్షలు విక్రమ్‌ చేతిలో పెట్టాడు. 
ఆ డబ్బుతో వెనక్కి తిరిగి చూడకుండా బయటపడ్డాడు విక్రమ్‌. 
ఆటోలో సుబ్బయ్య హోటల్‌కి వెళ్ళి భోంచేశాడు. అదే ఆటోలో తిరిగి ఆంధ్రాబ్యాంక్‌కి వచ్చాడు. 
లంచ్‌ అవర్‌. బ్యాంక్‌లో జనం పలచబడ్డారు. క్యాష్‌ కౌంటర్‌ దగ్గరకెళ్ళాడు విక్రమ్‌. 
లోపలికి చూశాడు. ఎవరూ లేరు. మేనేజర్‌ గది వైపు చూశాడు. అక్కడా లేరు. గేటు వైపు చూశాడు. 
సెక్యూరిటీ గార్డు బయట ఎవరితోనో మాట్లాడుతున్నాడు.
ముందుకు వంగి టేబుల్‌ మీదున్న క్లియరెన్స్‌ చెక్కులు ఒకొక్కటీ చూస్తున్నాడు. తనిచ్చిన చెక్‌ అక్కడే ఉంది. 
ఎప్పుడూ లేనిది విక్రమ్‌ చేతులు అవాళ వణికాయి. చెక్కును బయటకు తీసేలోపు అక్కడున్న పేపర్‌ వెయిట్‌ కిందపడింది. చెక్‌ చేతిలోకి తీసుకుని బ్యాగులో పెట్టడం దూరంగా ఉన్న బ్యాంక్‌ స్టాఫ్‌ ఒకతను చూశాడు.
 ఎమర్జెన్సీ అలారం నొక్కాడు. ఆ శబ్దంతో బ్యాంక్‌  మారుమోగిపోయింది. గేటువైపు పరిగెత్తాడు విక్రమ్‌. 
సెక్యూరిటీ గార్డు ఎలర్టయ్యాడు. షట్టర్‌ కిందికి దించేలోపు ఒక్క ఊపుతో షట్టర్‌ కింద నుంచి దూకి రోడ్డు మీదకు పారిపోయాడు విక్రమ్‌. సెక్యూరిటీ గార్డు విక్రమ్‌ వెంటపడ్డాడు. 
పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కి ఫోన్‌ చేశాడు మేనేజర్‌. 
విక్రమ్‌ శక్తికొద్ది పరిగెత్తుతున్నాడు. వెనక పోలీసులు. విక్రమ్‌ సందులోకి దూరాడు. ఇక పరిగెత్తే ఓపిక లేదు. అలిసిపోయాడు. పోలీసులు దగ్గరగా వచ్చేశారు. విక్రమ్‌ పోలీసులకి దొరికిపోయాడు.
 హైటెక్‌ దోపిడీ అంటూ మరునాడు అన్ని పేపర్లలో, టీవీల్లో పతాకశీర్షికన విక్రమ్‌ ఫొటోతో పాటు వార్తలు వచ్చాయి. 
ఆ వార్తలు చూసి రమ్య విజయవాడ నుండి ఎవరికీ తెలియని మరోచోటుకి రహస్యంగా మకాం మార్చేసింది. 
విక్రమ్‌ను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకి తరలించారు పోలీసులు. 
              

మరిన్ని వార్తలు