అతని ధీరత్వం మరపురాదు

10 Nov, 2020 03:19 IST|Sakshi

ఉగ్రవాదుల గుళ్లకు ఎదురొడ్డి నిలిచిన తెలంగాణ వీర సైనికుడు ర్యాడ మహేష్‌ ప్రాణాలు కోల్పోయాడు. దేశంలోకి దొంగచాటుగా అడుగుపెడుతున్న ఉగ్రవాదులను నిలువరిస్తూ దేశ రక్షణలో అమరుడయ్యాడు. నిజామాబాద్‌కు చెందిన మహేశ్‌ కాశ్మీర్‌లోని మచిల్‌ సెక్టార్‌లో  ఆదివారం నేలకొరుగుతూ  చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచాడు.

‘‘పది రోజుల్లో మహేష్‌ పుట్టిన రోజు ఉంది.. పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేసుకుందామని అనుకున్నాము. ఆదివారం అతను ఉగ్రవాదులతో పోరాడాడు. ఆ ముందు రోజే నాతో ఫోన్‌లో మాట్లాడారు. తాను సేఫ్‌గా ఉన్నానని, ధైర్యంగా ఉండమని, జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఇంతలోనే ఈ వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు..’’ అంది ర్యాడ మహేష్‌ భార్య ర్యాడ సుహాసిని.


ఆదివారం కశ్మీర్‌లలో కుప్వారా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో నిజామాబాద్‌కు చెందిన ర్యాడ మహేష్‌ (26) అమరగతి పొందాడు. అతని సొంత ఊరు వేల్పూరు మండలం కోమన్‌పల్లి. వారిది వ్యవసాయ కుటుంబం. తండ్రి ర్యాడ గంగమల్లు, తల్లి చిన్నరాజు. మహేష్‌  సొదరుడు భూమేష్‌ మస్కట్‌లో ఉన్నారు. మహేష్‌ ప్రాథమిక విద్య కోమన్‌పల్లిలో జరగగా, పదో తరగతి వరకు కుకునూరులో చదువుకున్నారు. నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ వరకు చదువుకున్న మహేశ్‌ ఇంటర్‌ పూర్తి కాగానే కరీంనగర్‌లో మిలటరీ శిక్షణ తీసుకున్నారు.  మహేష్‌ చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే వారని కుకునూరు ఉపాధ్యాయుడు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. హైస్కూల్‌లో చదివేటప్పుడే తాను ఆర్మీలో చేరుతానని చెప్పేవారని లక్ష్మణ్‌ చెప్పారు.

మహేష్‌ మరణవార్త విని కన్నీరు మున్నీరు అవుతున్న భార్య సుహాసిని మహేశ్‌ గురించి ప్రతి క్షణం తలుచుకుంటోంది.‘‘అసలు ఆయన నవంబర్‌ 5న వస్తానన్నారు. కానీ సెలవు దొరకక రాలేక పోయారు. మూడునాలుగు రోజుల్లో సెలవు దొరుకుతుంది వస్తానని చెప్పారు. సంక్రాంతి వరకు ఉంటానని అన్నారు. మరో రెండు నెలల్లో పీస్‌ జోన్‌లోకి బదిలీ అవుతుంది అప్పుడు నిన్నూ తీసుకెళాతానని చెప్పారు..’’ అంటూ సుహాసిని దుఖఃసాగరంలో మునిగిపోయింది.

మహేష్, సుహాసినిలు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. రెండేళ్ల క్రితమే వివాహం చేసుకున్నారు. సుహాసిని పుట్టుకతోనే తల్లిని కోల్పోయింది. తండ్రి మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. సుహాసిని తన బాబాయ్‌ జీ.టి.నాయుడు వద్దే పెరిగింది.


ఆర్మీలో పనిచేస్తున్న జీటీ నాయుడు హైదరాబాద్‌ బొల్లారంలో నివాసముంటున్నాడు. విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా మహేష్, సుహాసినిల మధ్య పరిచయం ఏర్పడింది. రెండేళ్ల ప్రేమ తర్వాత కుటుంబసభ్యుల ఆమోదంతో రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ‘మహేశ్‌ ఉన్న ఈ రెండు నెలలు ఎలా సంతోషంగా గడపాలనే ప్లాన్‌ చేసుకున్నాం. ఈసారి తనతో పాటు నేనూ వెళతానని ఆనందంగా ఉన్నాను. ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేద’ని సుహాసిని దుఃఖంతో అన్నారు.

తండ్రి గంగమల్లు  కొడుకును తలుచుకుని భోరున ఏడ్చారు. ‘‘శనివారం ఫోన్‌ చేశాడు. మా బాగోగులు అడిగారు. అమ్మ ఎట్లుంది అని అడిగిండు. ఇక్కడ గుట్టల మీద ఫైరింగ్‌ జరుగుతోంది. కానీ డ్యూటీ అయిపోయింది.. ప్రాబ్లమేమీ లేదు. గుట్టలు దిగి వస్తున్నాం. ఇంకో మూడు రోజుల్లో ఇంటికి వచ్చేస్తా అన్నడు. ఇంతలోనే ఇలాంటి వార్త వచ్చింది’ అంటూ  భోరున ఏడ్చాడు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా