వాటికయితే వారంటీలు అడుగుతాం కదా!

22 Nov, 2020 06:25 IST|Sakshi

వివాహ సంస్కారం

ఆయనకు దేవాలయానికి వెళ్ళడమంటే ఇష్టం. రామాయణ, భారత భాగవతాలు చదువుకోవడమంటే ఇష్టం. ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం ఇష్టం. ఇప్పుడు ఆయనకు భార్యగా వచ్చే పిల్ల కంటికి అందంగా ఉన్నంత మాత్రాన సరిపోదు. జీవితంలో సంతోషంగా గడపడానికి అవకాశం ఇవ్వదు. అందం కొంత కాలం ఉంటుంది. తరువాత జర్జరీ భూతమయిపోతుంది. ఆయన స్వభావానికి తగిన పిల్ల పక్కన ఉన్నప్పుడు ఆయన జీవితం పండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ పిల్ల జీవితం కూడా. ఆ పిల్ల భక్తి కలిగిన పిల్ల. పూజలు చేసుకోవడం ఇష్టం. అతిథిని పిల్చి అన్నం పెట్టడం ఇష్టం. సాత్వికంగా మాట్లాడడం ఇష్టం. కానీ భర్త ధూర్తుడు. స్వార్థపరుడు. బాగా డబ్బున్నవాడనీ, బాగా చదువుకున్నవాడనీ ఇచ్చి పెళ్ళి చేసారనుకోండి. ఈ పిల్ల జీవితంలో సంతోషాన్ని ఎలా పొందుతుంది? అందుకే ఎవరికి ఎవరిని ఇచ్చి చేయాలో... స్వభావ పరిశీలన చేయగలవారు పరిణతి కలిగిన పెద్దలు. అదే శీల పరిశీలనం. అంటే పెద్దలు వారి నిర్ణయానికి శాస్త్రం చెప్పిన ప్రాతిపదికల్లో మొదటిది శీలం. మిగిలినవి వరుసగా వయస్సు, వృత్తం, అభివంజం, లక్షణం.

మగపిల్లలకు ఆడపిల్లలకంటే ఎక్కువ వయస్సుండాలి. గురువుగా, దైవంగా భావించి భర్తను అనుగమించాలంటే తన భర్త అనుభవం రీత్యా పరిణతి గలవాడై ఉండాలి. వయస్సు ఎక్కువ అంటే ఏ పదో, ఇరవయ్యో అని కాదు. దాంపత్యజీవనం గడపడానికి ఎంత వయోభేదం ఉంటే ఉపయుక్తం అవుతుందో అంతే వయోభేదాన్ని పాటించాల్సి ఉంటుంది. తరువాత వృత్తం. అంటే నడవడి. ఆయనకు పంచె కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఆమెకు పంచెలు, ఉత్తరీయాలు నచ్చవు. దేవాలయాలకు వెళ్లడం ఇష్టం ఉండదు. మరో పిల్లకు తన అమ్మానాన్నలు తనతో ఉండాలనీ, తనను ఎప్పుడూ ప్రేమగా చూడాలని ఉంటుంది. మరొక ఆమెకు అత్తామామలు కూడా తమతోనే ఉండాలనీ, వారిని బాగా చూసుకోవాలని ఉంటుంది. మంచి నడవడిక కలిగిన వారు జీవిత భాగస్వామిగా వస్తే పదిమందికి ఆ దాంపత్యం ఆదర్శం అవుతుంది. 

ఘర్షణలకు అవకాశం ఉండదు. ఘర్షణ మొదలయితే అది వాళ్ళిద్దరితో, వాళ్ళపిల్లలతో, వాళ్ల కుటుంబంతో సరిపోదు. ‘‘మా ఇంట్లో మా అమ్మగారు, నాన్నగారు ఎప్పుడూ కీచులాడుకుంటూంటారు. మీ అమ్మగారిని, నాన్న గారిని చూస్తే ఎంత సంతోషంగా ఉంటుందో..బాబోయ్‌ ..మా అమ్మానాన్నలను చూస్తే భయమేస్తుంది’’ అని పిల్లలు అనే పరిస్థితి రాకూడదు. దాని ప్రభావం సమాజం మీద పడుతుంది. చుట్టుపక్కల ఉండే పిల్లలకు, పెళ్లంటేనే భయపడి పారిపోయే మనస్తత్వం ఏర్పడుతుంది. తరువాత చూడాల్సిన అంశం–అభివంజనము.. అంటే వెనక ఉన్న వంశం. ఉభయపక్షాల వంశ చరిత్రలలోని సానుకూలతలను బట్టి వియ్యమందాలి. చివరి అంశం – లక్షణం. అంటే ఒకరికొకరు తగినవారయి ఉండాలి. పెళ్ళికి వచ్చిన అతిథులు వధూవరులలో ఒకరిని చూసి మరొకరిపై జాలిపడేంత దయనీయంగా ఉండకూడదు. చూడచక్కని జంటగా కనిపించాలి. అంటే అంగసౌష్ఠవం, శరీరాకృతులు చక్కగా ఉండాలి. ఏదో ఒక ఫ్యాను, ఒక చేతి గడియారం కొనుక్కుంటేనే ఎన్నాళ్ళు పనిచేస్తుందని గ్యారంటీలు, వారంటీలు అడుగుతాం. అటువంటిది వంశంలో చిరస్థాయిగా కీర్తి పొందవలసిన ఇద్దరిని జత కూర్చాలంటే ఎన్నిజాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే వివాహాలు కుదిర్చేటప్పడు శాస్త్రం చెప్పిన ఈ ఐదు లక్షణాలను  ప్రాతిపదికగా తీసుకుని పెద్దలు మాత్రమే జీవిత భాగస్వాములను నిర్ణయించాల్సి ఉంటుంది.    - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

మరిన్ని వార్తలు