-

ఎన్నికల సీన్‌ ఎక్కడైనా సేమ్‌ టు సేమ్‌! ఆకాశాన్ని తాకే  వాగ్దానాలు.. తారలతో తోరణాలు..

26 Nov, 2023 10:39 IST|Sakshi

ఎన్నికలకు మించిన హడావుడి.. సందడి ఇంకొకటి ఉండదేమో! ఆకాశాన్ని అందించే  వాగ్దానాలు.. తారలతో తోరణాలు కట్టే హామీలు.. సముద్రాన్ని లాక్కొచ్చే సాహసాలు.. నదులను పారించే నమ్మబలకడాలు.. లేమి లేని రాజ్యాల భరోసాలు.. అమృతాన్ని పంచిచ్చే ఆపేక్షలు.. ఓహ్‌.. ఆ ప్రచారాలు అరచేతిలో స్వర్గాలు! డిజిటల్‌ డాల్బీ శ్రవణానందాలు! సాధ్యాసాధ్యాల సంగతి తరువాత.. సంబరం మాత్రం అంబరమంత! చిన్నాపెద్దా.. ఆడామగా.. దొంగాదొరా .. కార్మికులు– వైట్‌కాలర్స్‌.. పౌరులు–వలసలు ఆసక్తిలేని వాళ్లెవరు! కుతూహలం కలగనిదెవరికి! ప్రపంచంలో ఎక్కడైనా ఇదే సీన్‌! తరాలు మారినా సేమ్‌ టు సేమ్‌! వింతలు విడ్డూరాలు.. చిత్రవిచిత్రాలు అన్నిచోట్లా కామనే! కామన్‌మన్‌కి కావలసినంత కాలక్షేపమే! అలాంటివి చరిత్రలో చాలా రికార్డ్‌ అయ్యాయి. వాటిలో కొన్ని ఇక్కడ.. ఫర్‌ ప్యూర్‌లీ ఎంటర్‌టైన్‌మెంట్‌!!

రైనోసార్స్‌ పార్టీ
కెనడాలో 1960ల్లో ఈ పార్టీ.. పొలిటికల్‌ పేరడీగా పేరొందింది. తాము అధికారంలోకి వస్తే అట్లాంటిక్‌ మహాసముద్రం మీద బ్రిడ్జ్‌ కట్టిస్తామంటూ.. గురుత్వాకర్షణ చట్టాన్ని రద్దు చేస్తామంటూ .. నాటి ప్రధాన రాజకీయ పక్షాల అసంభవ హామీలు, వాగ్దానాలపై పేరడీలు, ఛలోక్తులతో ప్రజల్లోకి వెళ్లేది. ఒకసారైతే తమను గెలిపిస్తే మాంట్రియల్‌ ఐలండ్‌ని జరిపి ఒంటారియో పక్కన పెడతామని.. గేదెల పాల ఉత్పత్తిని పెంచడానికి వాటికి హైహీల్స్‌ని అందజేస్తామని, నదులకు దారులు వేసి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తామని ప్రామిస్‌ చేసింది. అందుకే ఎన్నికల వ్యంగ్య ప్రచారాలకు ప్రసిద్ధిగాంచిందా పార్టీ. అలా ఆడుతూ.. పాడుతూ దేశ రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పాలసీలు, నిర్ణయాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే రైనోసార్స్‌ పార్టీ ప్రధాన లక్ష్యం.

లార్డ్‌ బకెట్‌హెడ్‌
నిజానికిది.. అమెరికన్‌ ఫిల్మ్‌ మేకర్‌ టాడ్‌ దుర్హమ్‌ తన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘హైపర్‌స్పేస్‌’ కోసం క్రియేట్‌ చేసిన క్యారెక్టర్‌. దీన్ని బ్రిటిష్‌ వీడియో డిస్ట్రిబ్యూటర్‌ మైక్‌ లీ అడాప్ట్‌ చేసుకున్నాడు.. 1987లో బ్రిటన్‌ జనరల్‌ ఎన్నికల్లో నిలబడ్డం కోసం. నల్లటి పొడుగాటి కోటు (బ్లాక్‌ కేప్‌) వేసుకుని తల మీద పెద్ద బకెట్‌ పెట్టుకుని ఎన్నికల ప్రచారంలోకి దిగాడు.  హైపర్‌స్పేస్‌ ‘లార్డ్‌ బకెట్‌హెడ్‌’ ఎలాగైతే స్టార్‌ వార్‌ క్యారెక్టర్‌ డార్త్‌ వేడర్‌కి పేరడీయో.. అలాగే ఈ పొలిటికల్‌ లార్డ్‌ బకెట్‌హెడ్‌ కూడా బ్రిటిష్‌ రాజకీయ నేతలకు పేరడీ. అయితే ఈ పాత్రను రాజకీయాలకు ఒక్క మైక్‌ లీనే కాదు చాలా మంది అభ్యర్థులు అడాప్ట్‌ చేసుకున్నారు.

మైక్‌ లీ మాత్రం రెండుసార్లు.. 1987 తర్వాత 1992లో కూడా లార్డ్‌ బకెట్‌హెడ్‌గా ఎన్నికల్లోకి దిగాడు. పెద్దల సభను రద్దు చేస్తా, దేశంలో అందరికీ ఉచితంగా సైకిళ్లను పంచిపెడతా, అత్యున్నతమైనవన్నీ జాతీయం చేస్తానంటూ చిత్రవిచిత్ర హామీలతో ఎన్నికల ప్రచారం చేసి ప్రజల దృష్టిలో పడడానికి ప్రయత్నించాడు. సీరియస్‌ రాజకీయాంశాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. హాస్యోక్తులు విసురుతూ ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ తరహాలోనే 2017లో లార్డ్‌ బకెట్‌హెడ్‌గా ఎన్నికలబరిలోకి దిగిన కమేడియన్‌ జొనాథన్‌ హార్వే.. రోబో రైట్స్, స్పేస్‌ ట్రావెల్‌ మొదలైనవాటిని సమర్థిస్తూ ప్రచారం చేశాడు. ఆ సమయంలోనే అప్పటి  ప్రధాని థెరీసా మే పక్కన నిలబడిన ఆయన వీడియో వైరల్‌ అయి టాక్‌ ఆఫ్‌ ద వరల్డ్‌గా మారింది.

పోలిష్‌ బీర్‌ – లవర్స్‌ పార్టీ
ఇదే షార్ట్‌గా పీబీఎల్‌పీగా ఫేమస్‌ అయింది. బీర్‌ని ఎంజాయ్‌ చేసే హక్కును ఆస్వాదించడంలో.. సంతోషాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడంలో చాంపియన్‌గా పేరు తెచ్చుకుందీ పార్టీ. అలాగని దేశ సమస్యలను పట్టించుకోలేదని కాదు. బ్రహ్మాండంగా పట్టించుకుంది. వ్యంగ్యం, వెక్కిరింతలతో! అది కాస్తా హద్దు మీరి ప్రజల నిరసనకు గురైంది. సీరియస్‌ రాజకీయాలకు పనికిరాదనే విమర్శనూ ఎదుర్కొంది. నిజానికి సంప్రదాయ రాజకీయాలకు తల్లో నాలుకగా ఉండేందుకు ఏర్పాటైన పార్టీ ఇది.. 1990ల్లో. 

ద మాన్‌స్టర్‌ రేవింగ్‌ లూనీ పార్టీ
వెర్రి జోకులు, అసంబద్ధ పాలసీలతో పాలిటిక్స్‌కున్న స్టీరియోటైప్‌ ఇమేజ్‌ను బ్రేక్‌ చేసిందీ పార్టీ. దీని స్వస్థలం యునైటెడ్‌ కింగ్‌డమ్‌. 1983లో ఏర్పడింది. ఈ పార్టీ ముఖ్యమైన ఎజెండా ఒకటే.. వీలయినంతగా జనాలను నవ్వించడమే! జోకర్స్‌లా డ్రెసప్‌ అయ్యి పార్టీ ఆఫీస్‌లో ప్రత్యక్షమయ్యేవాళ్లు. తాము గెలిస్తే దేశంలో అందరికీ ఫ్రీగా ఆముదపుగింజలు పంచుతామని, ముళ్లపంది స్వీట్‌ను ఇంట్రడ్యూస్‌ చేస్తామని, స్పేస్‌ నుంచి ఇల్లీగల్‌గా వచ్చిన ఏలియన్స్‌ కోసం పాస్‌పోర్ట్‌ ఆమ్నెస్టీ నిర్వహిస్తామనే హామీలతో ఎలక్షన్‌ క్యాంపెయిన్‌ చేసింది.

చిత్రంగా తోస్తోంది కదా! కానీ ఇలాంటి విచిత్ర వాగ్దానాలతోనే బ్రిటిష్‌ సీరియస్‌ రాజకీయాలను ఒక కుదుపు కుదిపిందీ పార్టీ. నిజానికి దాని లక్ష్యం కూడా అదే. నాటి ప్రధాన పక్షాలకు ప్రత్యామ్నాయంగా మారాలని! కొంత కృతకృత్యమైందనీ చెప్పొచ్చు స్థానిక ఎన్నికల్లో కొన్ని స్థానాలు సాధించి! ఇంతకీ ఆ ఎన్నికల్లో దీని స్లోగన్‌ ఏంటో తెలుసా? ‘వెర్రితనానికి ఓటేయండి’ అని!

ద ప్రొహిబిషన్‌ పార్టీ
1869లో అమెరికాలో వెలసిన పార్టీ ఇది. సమాజంలోని ప్రధాన సమస్యలన్నిటికీ మద్యమే కారణమని నమ్మి.. దాన్ని నిషేధించాలనే ధ్యేయంతో ఏర్పడింది. ఆకట్టుకునే నినాదాలు, సంప్రదాయేతర వ్యూహాలతోనే ప్రజలకు దగ్గరవ్వొచ్చు అనుకుంది. మద్యం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి దేశ సరిహద్దులను ఏనుగులతో కాపలా కాయించాలని సూచించింది. అంతేకాదు ప్రపంచ శాంతి కోసం దేశం పేరును యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా కాకుండా యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అర్త్‌గా మార్చాలనీ ప్రపోజ్‌ చేసింది. ఇలాంటి తిక్క సలహాలు, ఆలోచనలతో ప్రజలను తమవైపు తిప్పుకొని వాళ్ల మద్యపాన అలవాటును మాన్పించాలనేదే ద ప్రొహిబిషన్‌ పార్టీ ప్రయత్నం. 

ద నో (know) నథింగ్‌ పార్టీ
దీన్నే నేటివ్‌ అమెరికన్‌ పార్టీ, అమెరికన్‌ పార్టీ అని కూడా పిలుస్తారు. 1850ల నాటిది. దీని పని పాలిటిక్స్‌ అయినా తీరుతెన్నులు మాత్రం గూఢచర్య సంస్థలా ఉండేవి. ఈ పార్టీ సభ్యులు కోడ్‌ లాంగ్వేజ్‌నే వాడేవారు. సీక్రెట్‌ పాస్‌వర్డ్స్‌ ఉండేవి. రహస్యంగా షేక్‌హ్యాండ్స్‌ ఇచ్చుకునేవారు. వాళ్లను చూస్తే ఏదో స్పై మూవీ ఆడిషన్స్‌కి వచ్చినట్టు అనిపించేదట. దేనికైనా ఆ సభ్యులంతా ఒకటే జవాబు చెప్పేవారట ‘ఐ నో (know) నథింగ్‌’ అంటూ! ఆ పార్టీ ముఖ్య ఉద్దేశం.. వలస ప్రజలకు అమెరికా పౌరసత్వం రాకుండా చూడ్డమే! స్థానికతను విపరీతంగా ప్రమోట్‌ చేసింది. వీళ్లు ఎన్నికల్లో గెలిచారు. కానీ వాళ్ల ఆలోచనలే కార్యరూపం దాల్చలేకపోయాయి.

ఆబ్జెక్టివిస్ట్‌ పార్టీ
ఆయన్‌ రాండ్‌ ‘వ్యక్తివాద’ సిద్ధాంత పునాదుల మీద ఏర్పడిన అమెరికన్‌ పార్టీ ఇది. వ్యక్తివాదాన్ని పీక్‌కి తీసుకెళ్లింది. పౌర జీవితాల్లో ప్రభుత్వాల జోక్యం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని నమ్ముతుంది. అంటే వ్యక్తులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలనేది దీని వాదన. ఒక్కమాటలో చెప్పాలంటే  ‘నేను.. నాది.. నాదే’ అనేది దీని ఎజెండా! ఈ పార్టీకి వెర్రి అభిమానగణం ఉంది. అయితే విమర్శకులు మాత్రం దీన్ని భ్రమల్లో బతికే పార్టీగానే చూశారు.  

 
ఫ్రీ సాయిల్‌ పార్టీ

1848లో.. అమెరికాలో వేళ్లూనుకుంది.. బానిసత్వ విముక్తి కోసం. ‘ఫ్రీ సాయిల్, ఫ్రీ స్పీచ్, ఫ్రీ లేబర్, ఫ్రీ మెన్‌’ దీని స్లోగన్స్‌. మార్టిన్‌ వ్యాన్‌ బ్యూరన్, సాల్మన్‌ పి. చేజ్‌ నేతృత్వంలో ఈ పార్టీ బాగానే హల్‌చల్‌ చేసింది. తూర్పు అమెరికా నుంచి పశ్చిమ అమెరికాకు మెల్లగా వ్యాపిస్తున్న బానిసత్వాన్ని గట్టిగానే అడ్డుకుంది. దేశాధ్యక్ష స్థానాన్ని గెలుచుకోలేకపోయినా ఆ పార్టీ చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఇంకా చెప్పాలంటే రిపబ్లికన్‌ పార్టీకి విత్తులు నాటిందే ఫ్రీ సాయిల్‌ పార్టీ అంటారు.

వెజిటేరియన్‌ పార్టీ ఆఫ్‌ ద యునైటెడ్‌ కింగ్‌డమ్‌
పాలిటిక్స్‌ వేదికగా శాకాహారాన్ని, జంతు హక్కులను ప్రమోట్‌ చేయడమే ఈ పార్టీ ఎజెండా. సుస్థిర జీవనమే దాని లక్ష్యం. జంతు పోషణ, వాతావరణ మార్పులు వంటి అంశాలకు సంబంధించి పాలసీలనూ రూపొందించింది. సంప్రదాయేతర రాజకీయ వ్యూహాల వల్ల ప్రధాన స్రవంతి రాజకీయాలకు దూరమైపోయి ప్రజలకు దగ్గర కాలేకపోయింది.

ద కెనడియన్‌ ఎక్స్‌ట్రీమ్‌ రెజ్లింగ్‌ పార్టీ
కెనడాలోని మాజీ ప్రొఫెషనల్‌ రెజ్లర్స్, ఎంటర్‌టైనర్స్‌ కలసి ఏర్పాటు చేసిన పార్టీ ఇది. దేశంలో క్రీడారంగానికి నిధులు పెంచాలనే డిమాండ్, ఆరోగ్యకరమైన జీవనశైలి పట్ల అవగాహన కల్పించడం, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టడం ఈ పార్టీ ప్రధాన ఉద్దేశాలు. సీరియస్‌ పొలిటికల్‌ లవర్స్, రాజకీయ విమర్శకులు ఈ పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. 

యూత్‌ ఇంటర్నేషనల్‌ పార్టీ
1960ల్లో.. అమెరికాలో పురుడుపోసుకుంది. ఇందులోని సభ్యులను యిపీస్‌ అంటారు. దీన్నో రాడికల్‌ రెబల్‌ పార్టీగా అభివర్ణించొచ్చు. ఆబీ హాఫ్‌మన్, జెరీ రూబిన్‌ నేతృత్వంలో కొనసాగిన యిప్‌ (యూత్‌ ఇంటర్నేషనల్‌ పార్టీ) సెటైర్స్, నాటకాలతో ప్రభుత్వ విధానాలను ఎండగట్టేది. దేన్నయినా సీరియస్‌గా తీసుకోకూడదు అనే విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకునేవారు యిపీస్‌. పౌర హక్కులు, యాంటీ వార్‌ సెంటిమెంట్, పర్యావరణ పరిరక్షణ వీరి ఎజెండా. అమెరికాలో నేడు యిపీస్‌ ఫ్రంట్‌ పేజ్‌ స్టోరీ కాకపోయినా.. వారి వారసత్వం ఇంకా ఊపిరి తీసుకుంటోంది.  

ద పైరేట్‌ పార్టీ
సముద్రపు దొంగల రాజకీయ ఆకాంక్ష అనుకునేరు ఈ పార్టీని! కాదు. ప్రైవసీ ప్రొటెక్షన్, డిజిటల్‌ రైట్స్, ఇంటర్నెట్‌ ఫ్రీడమ్‌ కోసం  2000లో స్వీడన్‌లో టెక్‌ సేవీ రెబల్స్‌ చేతుల్లో రూపుదిద్దుకుందీ పార్టీ. సంప్రదాయ రాజకీయలను పునరుద్ధరించాలను కుంది. కాపీరైట్‌ రీబూట్‌ చేయాలనే ప్రభుత్వ నిఘాను డిలీట్‌ చేయాలని డిమాండ్‌లను లేవదీశారు. మెయిన్‌స్ట్రీమ్‌ రాజకీయాలను సీరియస్‌గా తీసుకునే వాళ్లు ద పైరేట్‌ పార్టీని ట్రబుల్‌ మేకర్‌గా పరిగణించారు. కానీ సామాన్యుల అటెన్షన్‌ని బాగానే గ్రాబ్‌ చేసింది. అధికారం కోసం పోరాడేంత శక్తిమంతం కాలేదు కానీ స్థానిక సంస్థల్లో, పార్లమెంట్‌లో తన ప్రెజెన్స్‌ను మాత్రం చూపించుకుంది.

గోళీలతో ఓటింగ్‌..
దక్షిణ ఆఫ్రికా దేశం గాంబియాలో అభ్యర్థుల ఎంపిక భలే ఆసక్తిగా ఉంటుంది. ఓటర్స్‌కి గోళీలను ఇస్తారు. ఎంతమంది అభ్యర్థులుంటే పోలింగ్‌ స్టేషన్‌లో అన్ని రంగుల డబ్బాలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో డబ్బా మీద ఒక్కో అభ్యర్థి ఫొటోను అతికిస్తారు. ఆ డబ్బాకు గంటలను కడ్తారు. ఓటర్లు ఆ గోళీలను ఆ డబ్బాలోకి జారవిడవాలి. ఒక గోళీ వేయగానే డబ్బాకున్న గంట మోగుతుంది. ఒకవేళ ఓటరు ఒకటికి బదులు రెండు గోళీలు వేస్తే ఆ డబ్బా రెండుసార్లు మోగుతుంది. దీంతో దొంగ ఓటును పసిగడతారు. అయితే ఆ దేశం ఈ పాత సంప్రదాయం నుంచి పేపర్‌ బ్యాలెట్‌కి మారాలనుకుంటోందని ఇంటర్నెట్‌ సమాచారం. 

సోమ, మంగళ, గురువారాలు మాత్రమే
అమెరికా, కెనడా, యూకే వంటి దేశాల్లో వారం, వర్జ్యం, తిథి, నక్షత్రం గట్రా అన్నీ కాకపోయినా వారం మాత్రం చూసుకుని పోలింగ్‌ రోజును నిర్ణయిస్తారట. ఎప్పుడైనా అమెరికాలో మంగళవారమే పోలింగ్‌ పెడ్తారు. పౌరుల దైనందిన కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా! కెనడాలో పోలింగ్‌ ఎప్పుడూ సోమవారం ఉంటుంది. యూకేలో గురువారం ఉంటుందట. ఆరోజు అక్కడ మార్కెట్‌ డే. ప్రత్యేకంగా పోలింగ్‌ కోసమే బయటకు వెళ్లాలా అని జనాలు బద్ధకించకుండా మార్కెట్‌ కోసం ఎలాగూ ఇల్లు కదులుతారు కాబట్టి.. పనిలో పనిగా ఓటేసి వెళతారని పోలింగ్‌ అధికారుల భావన. 

ఓటు వేయకపోతే ఫైన్‌ 
ప్రపంచంలో దాదాపు 22 దేశాలు.. ఓటు వేయని ఓటర్లకు ఫైన్‌ విధిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో అయితే 20 ఆస్ట్రేలియన్‌ డాలర్ల ఫైన్‌ ఉంటుంది. ఒకవేళ ఆ ఫైన్‌ను నిర్ణీత సమయంలో చెల్లించకపోతే పెరుగుతూపోతుందట. 

సామ్‌పియా..నో (Noh) 
థియేటర్‌ సామ్‌పియా అంటే మన నమస్కారం లాంటిదే. కంబోడియాలో ఇదొక పొలిటికల్‌ కల్చర్‌. వందనం. అక్కడ రాజకీయ నేతలను, ఉన్నత స్థాయి పౌరులను ‘సామ్‌పియా’తో గౌరవిస్తారు. క్షమాపణలు, మన్నింపులూ సామ్‌పియాతోనే! కంబోడియాలో సామ్‌పియాను..రాజకీయాలు, సంస్కృతీసంప్రదాయలు, గౌరవమర్యాదలకు మధ్య వారధిగా పరిగణిస్తారు. ఇలాంటిదే జపాన్‌లోనూ ఉంది. కాకపోతే కళారూపంలో. దాన్నే నో(Noh) థియేటర్‌ అంటారు.  రాజకీయ సందేశాలు, నేతలకు గౌరవ వందనాలు తెలిపే ఒక నృత్య నాటకం. ఇది 12, 13 శతాబ్దాల్లో మొదలైందని చరిత్ర చెబుతోంది. 

పదహారేళ్లకే
బ్రెజిల్, ఆస్ట్రియా, నికరాగువా, అర్జెంటీనాల్లో .. పదహారేళ్లు నిండిన వాళ్లంతా ఓటర్లే. ఇండోనేసియా, సుడాన్‌లలో పదిహేడేళ్లు నిండితే ఓటు హక్కు వస్తుంది. 

రీబూట్‌ చేస్తేకానీ.. 
1988, మెక్సికో సాధారణ ఎన్నికల కౌంటింగ్‌లో.. కంప్యూటర్‌ క్రాష్‌ అయ్యి.. ఓట్లన్నీ ప్రతిపక్షం ఖాతాలో జమయ్యాయి. పరేషాన్‌ అయిన కౌంటింగ్‌ అభ్యర్థులు .. అది టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ అని గ్రహించి.. కంప్యూటర్లను రీబూట్‌ చేశారు. అప్పుడు సెట్‌ అయ్యి కౌంటింగ్‌ సజావుగా సాగిందట. గెలుపు అధికారపక్షం వశమైందట. 

మూన్‌ కాలనీ
2012, అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన ప్రతినిధుల సభ స్పీకర్‌ న్యూట్‌ గింగ్రిచ్‌.. తనను గెలిపిస్తే 2020 కల్లా చంద్రుడి మీద అమెరికన్‌ కాలనీ నిర్మిస్తానని మాటిచ్చాడు. అదే ఎన్నికల్లో పోటీ చేసిన కళాకారుడు వర్మిన్‌ సుప్రీం.. తనను గెలిపిస్తే ప్రతి అమెరికన్‌కి ఒక గుర్రంపిల్లను బహూకరిస్తానని ప్రామిస్‌ చేశాడు. అంతేకాదు అమెరికాను పోనీ (గుర్రంపిల్ల) బేస్డ్‌ ఎకానమీగా మారుస్తాననీ చెప్పాడు.  

జంతువులు కూడా..
న్యూజిలాండ్‌లోని వాంగమోమోనా అనే టౌన్‌లో .. 1999లో బిలీ గమ్‌బూట్‌ అనే మేక ప్రెసిడెంట్‌గా ఎన్నికైంది. 1981లో.. అమెరికా లోనూ ఇలాంటిదే జరిగింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని సునో పట్టణంలో బాస్కో అనే లాబ్రడార్‌ జాతి కుక్క మేయరైంది. ఇంకా వెనక్కి వెళితే 1959లో బ్రెజిలియన్స్‌.. కకారెకో అనే రైనోసార్స్‌ని గెలిపించి సావ్‌పాలో కౌన్సిల్లో కూర్చోబెట్టారు 

దేనికైనా అదే అట్టహాసం.. 
ఇంగ్లండ్‌లోని రాజప్రాసాదాల్లో ఏ మార్పయినా అట్టహాసంగా జరగాల్సిందే. బకింగ్‌హమ్‌ ప్యాలెస్, సెయింట్‌ జేమ్స్‌ ప్యాలెస్‌లలో పాత గార్డ్‌ పోయి కొత్త గార్డ్‌ చార్జ్‌ తీసుకోవడానికీ తెగ హడావుడీ ఉంటుంది. బ్యాండ్‌ బాజా బారాత్‌తో కొత్త గార్డ్‌ రాగా.. ప్యాలెస్‌ ముందు ఠీవిగా నిలుచున్న పాత గార్డ్‌ ప్యాలెస్‌ కాపలా బాధ్యతలను కొత్త గార్డ్‌కి అప్పగిస్తాడట. 

టీ పార్టీ 
చైనాలో దౌత్య సంబంధాలను, సంధి ప్రయత్నాలను టీ పార్టీతో సెలబ్రేట్‌ చేసుకుంటారు. దీన్నే ‘చా దేవ్‌’ అంటారు. 2013లో చైనా ప్రెసిడెంట్‌ జిన్‌పింగ్‌.. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాను కాలిఫోర్నియాలో కలసినప్పుడు బరాక్‌ ఒబామాకు టీ పార్టీ ఇచ్చాడు. జిన్‌పింగే స్వయంగా అతనికి టీ కప్పును అందించాడు. అంటే రాజకీయ స్నేహాన్ని తాము గౌరవిస్తున్నామని, దానిపట్ల తమకు సానుకూల దృక్పథం ఉందని ఆ ‘చా దేవ్‌’ ద్వారా జిన్‌పింగ్‌ తెలియజేశాడన్నమాట. 

 లా లే సెకా
దీన్నే డ్రై లా అని కూడా అంటారు. ఏం లేదు.. మెక్సికోలో పోలింగ్‌ ముందు రోజు అర్ధరాత్రి నుంచి పోలింగ్‌ అయిపోయే వరకు మద్యపాన నిషేధం అమల్లో ఉంటుంది. తాగి.. గొడవలు పడి అది హింసకు దారితీయకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ బ్యాన్‌ను పెడతారు. ఇవండీ.. కొన్ని ప్రాపంచిక రాజకీయ విషయాలూ.. విశేషాలూ కొన్ని! అలరించి ఉంటాయి. 

(చదవండి: విదేశాల్లో కూడా వనభోజన సంప్రదాయం..! ఐతే ఎలా ఉంటాయంటే..)

మరిన్ని వార్తలు