పదేళ్లుగా ఉదయాన్నే లేవడం, ఊరంతా బలాదూర్‌ తిరగడం.. ఈ కుక్క ప్రత్యేకత

24 Oct, 2021 08:06 IST|Sakshi

కొందరికి రైలెక్కడం సరదా, ఇంకొందరికి విమానం ఎక్కడం సరదా. టర్కీకి చెందిన బోజీ అనే ఈ శునకరాజానికి నగర సంచారం కోసం పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలెక్కడం సరదా. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాల్లో సంచరించే ప్రయాణికులందరికీ చిరపరిచిత నేస్తం బోజీ. గత పదేళ్లుగా ఉదయాన్నే లేవడం, కనిపించిన బస్సు లేదా లోకల్‌ ట్రెయిన్‌ ఎక్కి ఊరంతా బలాదూర్‌ తిరగడం ఈ శునకరాజం హాబీ.

దీనిని గమనించిన అధికారులు ఇంతకూ ఇదెక్కడకు వెళుతుందో తెలుసుకోవడానికి దీని చెవికి ఒక ట్రాక్‌ చిప్‌ అమర్చారు.ఇస్తాంబుల్‌ నగరంలోని చారిత్రిక కట్టడాలను చూడటానికి ఈ శునకరాజం రోజూ బస్సు, మెట్రో, బోటు సహా ప్రతి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు వాహానాన్నీ పావనం చేస్తోంది.

దొరక్కుంటే ఏ బస్సులోనో అడ్జస్టయిపోతుందనుకోండి! మెట్రోస్టేషన్‌లలోని లిఫ్టులు, ఎస్కలేటర్లను కూడా ఈ జాగిలం మిగిలిన ప్రయాణికులతో కలసి దర్జాగా ఉపయోగించుకోవడం చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టక తప్పదు. ఇస్తాంబుల్‌ జనాలకు పదేళ్లుగా ఈ జాగిలం బాగా అలవాటైపోవడంతో, ఇది ఏ వాహనంలోకి చొరబడినా ఎవరూ దీనిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించడం లేదు.

పైగా, ఇది సుఖంగా కూర్చోవడానికి వీలుగా తప్పుకుని మరీ దారి కూడా ఇస్తున్నారు.సమయానికి సమయం, శ్రమకు శ్రమ ఆదా చేసే మెట్రో ట్రెయినంటేనే దీనికి కాస్త మక్కువ ఎక్కువ. ఎక్కువగా మెట్రోలో ప్రయాణించడానికే ఇష్టపడుతుంది.

చదవండి: అదొక అందమైన తోట.. ముచ్చటపడి ఏది ముట్టుకున్నా ప్రాణాలకు ముప్పే..

మరిన్ని వార్తలు