తొలి మహిళా సత్యాగ్రాహి.. సుభద్రా కీ కహానీ

17 Aug, 2021 00:01 IST|Sakshi
సుభద్ర కుమారి చౌహాన్‌ ‘గూగుల్‌ డూడుల్‌’

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశం కోసం సేవ చేసిన త్యాగధనులు మరోసారి స్మరణకు వస్తున్నారు. తొలి మహిళా సత్యాగ్రాహి, జైలుకు వెళ్లిన తొలి మహిళా కాంగ్రెస్‌ కార్యకర్త, గొప్ప కవయిత్రి సుభద్ర కుమారి చౌహాన్‌ను ఆమె 117వ జయంతి సందర్భంగా ‘డూడుల్‌’తో గూగుల్‌ గౌరవించింది. స్ఫూర్తివంతమైన ఆమె జీవితాన్ని గుర్తుకు తెచ్చింది.

ఆడపిల్లల్ని ఇప్పుడు కూడా ‘అటు వెళ్లొద్దు... అది చేయొద్దు’ అనే పెద్దలున్న రోజుల్లో దాదాపు 110 ఏళ్ల క్రితం 9 ఏళ్ల వయసులో కవిత్వం రాసింది సుభద్ర కుమారి చౌహాన్‌. రాయడమే కాదు... దానిని పత్రికలకు పంపింది. పంపితే అది అచ్చయ్యింది. సుభద్ర కుమారి చౌహాన్‌ కొన్ని పనులు చేయడానికి ఈ భూమ్మీదకు వచ్చింది. కొన్ని పనులు చేసి తరలి వెళ్లిపోయింది. భారత స్వాతంత్రోద్యమం ఆమెను తప్పక తలచుకుంటూ ఉంటుంది. హిందీ సాహిత్య సమాజం ఆమెను తలుచుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు రంగాలలో ఆమె గొప్ప ముద్రను వదిలి వెళ్లింది.

తొమ్మిది మంది సంతానంలో
సుభద్ర కుమారి అలహాబాద్‌లో 1904లో జన్మించింది. నలుగురు అన్నదమ్ములు, ఐదుమంది అక్కచెల్లెళ్లలో ఆమె ఒకతి. తండ్రి, ఇతర అన్నయ్యలు ఆడపిల్లలను ఆడపిల్లల్లానే ఉంచాలని అనుకున్నా చివరి అన్నయ్య రాజ్‌ బహదూర్‌ సింగ్‌ మాత్రం తన తోబుట్టువులను ముఖ్యంగా సుభద్రను ప్రోత్సహించేవాడు. ‘చేయాల్సిన అల్లరి చేయండి’ అని వాళ్లకు రక్షణ గా నిలిచేవాడు. ఆ అన్న అండతో సుభద్ర కవిత్వం రాసింది. 1913లో ఆమె రాసిన తొలి కవిత ‘నీమ్‌’ (వేపచెట్టు) ‘మర్యాద’ అనే పత్రిక లో అచ్చయ్యింది. ఆడపిల్లలకు చదువేంటి అనే ఆ రోజుల్లో ఆమె అలహాబాద్‌లోని ‘లేడీ సుందర్‌లాల్‌ హాస్టల్‌’లో ఉండి చదువుకుంది. ఆ సమయంలో ఎన్నో కవితలు రాసింది. అక్కడే చదువుకుంటున్న తర్వాతి రోజుల్లో ప్రఖ్యాతి చెందిన కవయిత్రి మహాదేవి వర్మతో కలిసి ఆమె కవిత్వం ఉద్యమంలా కొనసాగించింది. 1919లో కవి, పత్రికా రచయిత అయిన లక్ష్మణ్‌ సింగ్‌తో వివాహం జరిగినప్పుడు కట్నం ప్రస్తావన గాని, తల మీద కొంగు కప్పుకుని వధువు ముఖం దాచుకునే సంప్రదాయం కాని పాటించకుండా చాలా సరళంగా వివాహం జరుపుకుంది. ఆ రోజుల్లో ఇది పెద్ద వార్త.

ఝాన్సీ కీ రాణి
సుభద్ర కుమారి చౌహాన్‌ కవితలు దేశభక్తిని కలిగించేలా ఉండేవి. బ్రిటిష్‌ వారిని పారదోలేందుకు ఝాన్సీ లక్ష్మిని స్ఫూర్తిగా తీసుకోమని సుభద్ర రాసిన ‘ఝాన్సీ కీ రాణి’ ఉత్తర భారతదేశంలో ప్రతి విద్యార్థి నేటికీ ఏదో ఒక తరగతిలో చదువుతూనే ఉంటాడు. ‘ఝాన్సీ కీ రాణి’ కవిత వేదిక మీద వేలసార్లు చదవబడింది. 1919లో రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా జలియన్‌వాలాబాగ్‌లో మీటింగ్‌ జరుగుతుంటే డయ్యర్‌ చేసిన ఘాతుకానికి సుభద్ర కదిలిపోయింది. ‘జలియన్‌వాలాబాగ్‌లో వసంతం’ పేర ఒక కవిత రాసింది. అంతే కాదు ఆ మరుసటి సంవత్సరమే భర్తతో కలిసి పూర్తిస్థాయి కాంగ్రెస్‌ కార్యకర్తగా మారిపోయింది.


తొలి మహిళా సత్యాగ్రాహి
సుభద్ర ఇప్పుడు భర్తతో కలిసి జబల్‌పూర్‌ (మధ్యప్రదేశ్‌)ను తన కార్యక్షేత్రం చేసుకుంది. భర్త పత్రిక నడుపుతుంటే సుభద్ర సైకిల్‌ మీద రోజూ 14 కిలోమీటర్లు తిరుగుతూ ప్రజలకు స్వాతంత్రోద్యమ అవసరం తెలియచేసేది. అంటరానితనంకు వ్యతిరేకంగా ప్రచారం చేసేది. 1922లో ‘జెండా సత్యాగ్రహం’ జబల్‌పూర్‌లో ఉధృతంగా జరిగింది. ప్రయివేటు, పబ్లిక్‌ స్థలాల్లో దేశ జెండాను ఎగురవేయడం ఆ కార్యక్రమం. ఆ సమయంలో ఆ కార్యక్రమంలో పాల్గొన్న తొలి ధీర మహిళగా సుభద్ర కుమారి చౌహాన్‌ చరిత్రకెక్కింది. ఆ తర్వాత ఆమె ఉపన్యాసాలకు జనం విరగపడసాగారు. ఆమె తన ఉపన్యాసాల మధ్య ‘ఝాన్సీ కీ రాణి’ కవితను ఉత్తేజపూర్వకంగా చదువుతూ ఉందని బ్రిటిష్‌ ప్రభుత్వం ఆ కవితను నిషేధించింది. అంతే కాదు.. 1923లో నాగపూర్‌లో జెండా సత్యాగ్రహంలో పాల్గొనడానికి వెళ్లిన సుభద్రను అరెస్టు చేసి జైల్లో పెట్టింది. దేశంలో అలా అరెస్ట్‌ అయిన తొలి మహిళా సత్యాగ్రాహి ఆమె. జైల్లో ఉండి ఆమె కవిత్వం రాసింది. ‘లాంతరులో చమురు లేదు. అది ప్రాణం విడిచేలోపు నాలుగు పంక్తులు రాసుకుంటాను’ అని రాసిందామె.

చిన్న వయసులో మరణం
సుభద్ర కుమారికి ఒక కూతురు పుట్టింది. ఆ కూతురిలో తన బాల్యం చూసుకుంటూ ఆమె అద్భుతమైన కవిత్వం రాసింది. స్వాతంత్య్రం సిద్ధించాక ఆమె ఇంకా ఉత్సాహంగా పని చేస్తూ నాగ్‌పూర్‌లో ఒక ఉపన్యాసం ఇచ్చి జబల్‌పూర్‌కు తిరిగి వస్తుండగా 1948లో కారు యాక్సిడెంట్‌ లో మరణించింది. అప్పటికి ఆమె వయసు 43 సంవత్సరాలు.
సుభద్ర కుమారి చౌహాన్‌ పేరిట ఎన్నో సాహిత్య పురస్కారాలు ఉన్నాయి. ఒక కోస్ట్‌గార్డ్‌ నౌకకు ఆమె పేరు పెట్టారు. జబల్‌పూర్‌లో ప్రభుత్వం ఆమె విగ్రహం పెట్టింది. 
ప్రస్తుతం అమృతోత్సవాల సందర్భంగా ఆమె 117వ జయంతి రావడంతో గూగుల్‌ ఆమె స్మరణగా డూడుల్‌ చేసి గౌరవాన్ని ప్రకటించింది. ‘ఆమె స్ఫూర్తి గొప్పది’ అని గూగుల్‌ వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు