రా RAW రాజు

3 Mar, 2023 00:46 IST|Sakshi

‘కాలం కలిసి రావాలి’ అంటూ కాలాన్ని మాత్రమే నమ్ముకునే వారు ఒక రకం.‘కాలం కలిసి రావాలి అంటే కష్ట పడాలి’ అనుకునే వారు రెండో రకం. ‘రైతుబిడ్డ’ విక్రమ్‌సింగ్‌ రెండో రకానికి చెందిన కుర్రాడు.తన నాయకత్వ లక్షణాలతో ‘ఆఫ్‌బిజినెస్‌’కు కొత్త వెలుగు తీసుకువచ్చాడు...

హరియాణా మహేంద్రగఢ్‌ జిల్లాలోని మల్రా గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన విక్రమ్‌సింగ్‌ ఖరీదైన స్కూళ్లలో ఎప్పుడూ చదువుకోలేదు. ఆరవతరగతిలో మాత్రమే ఇంగ్లీష్‌ చదువుకునే అవకాశం వచ్చింది. స్కూల్‌ పూర్తయిన తరువాత పొలానికి వెళ్లి తండ్రికి సహాయం చేసేవాడు.‘ఏ పనైనా ఇష్టంగా చేయాలి. నాకు వ్యవసాయం అంటే ఇష్టం. నువ్వు కూడా చదువును ఇష్టంగా చదువుకోవాలి. చదువుకోవడం నా వల్ల కాదు అనిపిస్తే నాతో పా టు పనిచెయ్యి’ అనే వాడు నాన్న.

మరోవైపు స్నేహితులు...‘నువ్వు రెజ్లర్‌ కాకపో తే జీవితంలో ఏది సాధించలేవు’ అనేవారు. ఆప్రాం తంలో రెజ్లింగ్‌ బాగా పాపులర్‌. ప్రైజ్‌మనీ కూడా భారీగా ఉండేది. స్నేహితుల మాటలతో రెజ్లర్‌ కావాలనే ఆశ విక్రమ్‌లో మొలకెత్తింది. ఎక్కడ రెజ్లింగ్‌ పొటీలు జరిగినా వెళ్లేవాడు. ఇది గమనించిన టీచర్‌ ‘నువ్వు చదువులో ముందున్నావు. నీకు మంచి భవిష్యత్‌ ఉంది. ఇలా రెజ్లింగ్‌ అంటూ ఊళ్లు తిరిగితే చదువు దెబ్బతింటుంది’ అని హెచ్చరించాడు.

ఇక అప్పటి నుంచి తన మనసులో నుంచి ‘రెజ్లింగ్‌’ను డిలిట్‌ చేశాడు విక్రమ్‌.ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తరువాత దిల్లీలో ఎంబీఏ చేశాడు. ఆ తరువాత కామర్స్‌ అండ్‌ ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ ‘ఆఫ్‌బిజినెస్‌’లో చేరాడు. మూడు సంవత్సరాల తరువాత విక్రమ్‌ దశ తిరిగింది. ‘ఆఫ్‌బిజినెస్‌’కు ఉన్న మూడు యూనిట్‌లలో ఒకటైన ‘రా మెటీరియల్‌ బిజినెస్‌ యూనిట్‌’కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి సరిౖయెన వ్యక్తుల కోసం కంపెనీ పెద్దలు చూస్తున్న సమయంలో వారికి విక్రమ్‌ పేరు తట్టింది. అలా విక్రమ్‌ ‘రా మెటీరియల్‌ బిజినెస్‌ యూనిట్‌’కు హెడ్‌ అయ్యాడు.

‘రా మెటీరియల్స్‌ ఎట్‌ లోయెస్ట్‌ ప్రైసెస్‌–గ్యారెంటీడ్‌’ అనే మాటలో మాంత్రికశక్తి లేకపో వచ్చు. అయితే దీన్ని కస్టమర్‌లలోకి బలంగా తీసుకెళ్లడంలో విక్రమ్‌ విజయం సాధించాడు. ఫ్రెషర్స్‌తో తనదైన ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకోని, అడుగులో అడుగు వేస్తూ మెల్లగా నడుస్తున్న యూనిట్‌ను పరుగెత్తేలా చేశాడు. కోట్ల టర్నోవర్‌కు చేర్చాడు.
‘విక్రమ్‌లో నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మా నమ్మకాన్ని నిలబెట్టాడు’ అంటున్నాడు ‘ఆఫ్‌బిజినెస్‌’ సీయీవో ఆశీష్‌ మహాపా త్రో. ‘అదృష్టం కష్టం వైపు మొగ్గు చూపుతుంది అంటారు. నేను కష్టాన్నే నమ్ముకున్నాను. రైట్‌ ప్లేస్‌లో రైట్‌పర్సన్‌గా గుర్తింపు తెచ్చుకున్నప్పుడే విజయం సాధించగలం’ అంటున్న 29 సంవత్సరాల విక్రమ్‌సింగ్‌ ‘ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30’ జాబితాలో చోటు సంపాదించాడు.  

మరిన్ని వార్తలు