లోకం మెచ్చిన దర్శకుడు

10 Mar, 2023 01:17 IST|Sakshi

ఫిల్మ్‌ మేకర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు కోల్‌కతాకు చెందిన శౌనక్‌ సేన్‌.అతడి ఫీచర్‌–లెంగ్త్‌ డాక్యుమెంటరీ ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’ మన ఫ్యూచర్‌ గురించి మౌనంగానే ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది.జీవజాలంపై కాస్త కరుణ చూపమని చెప్పకనే చెబుతోంది...

దిల్లీలోని ఏజెకె మాస్‌ కమ్యూనికేషన్‌ రిసెర్చ్‌ సెంటర్‌ నుంచి మాస్‌ కమ్యూనికేషన్‌లో పట్టా పుచ్చుకున్న శౌనక్‌సేన్‌ జెఎన్‌యూలోని స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ ఈస్థెటిక్స్‌లో పీహెచ్‌డీ చేశాడు. ఫిల్మ్స్‌ డివిజన్‌ ఆఫ్‌ ఇండియా డాక్యుమెంటరీ ఫెలోషిప్, డిజిటల్‌ అండ్‌ సోషల్‌ మీడియా ఫెలోషిప్‌కు ఎంపిక కావడం, కేంబ్రిడ్జి యూనివర్శిటీ అర్బన్‌ ఎకోలజీస్‌ ప్రాజెక్ట్‌లో విజిటింగ్‌ స్కాలర్‌గా భాగం కావడం తన ప్రపంచాన్ని విస్తృతం చేసింది.

సేన్‌లోని కళకు సామాజిక స్పృహ తోడైంది.తొలి డాక్యుమెంటరీ ‘సిటీస్‌ ఆఫ్‌ స్లీప్‌’కు పెద్ద పేరే వచ్చింది. ఈ డాక్యుమెంటరీకి ఫిల్మ్స్‌ డివిజన్‌ ఆఫ్‌ ఇండియా ఫండింగ్‌ చేసింది. ఇది న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ఫెస్టివల్, తైవాన్‌ ఇంటర్నేషనల్‌ డాక్యుమెంటరీ ఫెస్టివల్, ముంబై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇరవై చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రత్యేక ప్రశంసలు పొందింది. ఆరు అవార్డ్‌లు అందుకుంది.

సేన్‌ రెండో ఫీచర్‌ లెంగ్త్‌ డాక్యుమెంటరీ ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతూనే ఉంది.వరల్డ్‌ సినిమా గ్రాండ్‌ జ్యూరీ ప్రైజ్‌(సన్‌డ్యాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్, యూఎస్‌) గెలుచుకుంది. ‘హాస్యం, వ్యంగ్యం మేళవించి పర్యావరణ విధ్వంసాన్ని కళ్లకు కట్టిన చిత్రం’ అని జ్యూరీ సభ్యులు ప్రశంసించారు. ఈ డాక్యుమెంటరీ మరో ప్రసిద్ధ అవార్డ్‌ గోల్డెన్‌ ఐ (కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌) గెలుచుకుంది. 

‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’కు సంబంధించిన ప్రపంచవ్యాప్త హక్కులను అమెరికన్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ హెచ్‌బీవో తీసుకుంది.ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన మరో ఘనత ఆస్కార్‌ ‘బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌’కు నామినేట్‌ కావడం.మనుషుల కార్యకలాపాల వల్ల జీవజాలం స్థితిగతుల్లో వస్తున్న మార్పుకు ఈ చిత్రం అద్దం పడుతుంది.

‘ఎక్కడ పడితే అక్కడ పక్షులు చచ్చిపోయి కనిపిస్తుంటాయి. అయ్యో! అని మనకు అనిపించదు. మన దారిన మనం వెళుతూనే ఉంటాం. రోజువారి పనుల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతూనే ఉంటాం. క్షణం కూడా వాటి గురించి ఆలోచించం. ఇది ఎంత ఆశ్చర్యం, ఎంత విషాదం!’ అంటుంది ఈ చిత్రంలో ఒక పాత్ర. జీవజాలానికి సంబంధించి మనుషులలోని స్పందనారాహిత్యాన్ని, మొద్దుబారినతనాన్ని దుమ్ము దులుపుతుంది ఆల్‌ దట్‌ బ్రీత్స్‌. మనుషులలోని స్పందనారాహిత్యం గురించి ‘చీమ కుట్టినట్లైనా లేదు’ అంటారు.

‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’ చీమ నుంచి పిచ్చుక వరకు సమస్త జీవజాలం గురించి ఆలోచించమని చెబుతుంది.‘నేను మాత్రమే..అనే స్వార్థం ఉంటే నువ్వు కూడా మిగలవు’ అనే మార్మిక సందేశాన్ని ఇస్తుంది. ‘యాంత్రికంగా నేచర్‌–వైల్డ్‌లైఫ్‌ డాక్యుమెంటరీ తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రజలు ఎన్ని మంచి పనులు చేస్తున్నారో తెలుసా!లాంటి స్వీట్‌ ఫిల్మ్‌ తీయాలనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. మనం వేగంగా పరుగులు తీస్తున్నాం. ఆ పరుగు కొన్ని నిమిషాల పాటు అయినా ఆపి చుట్టు ఏం జరుగుతుందో అలోచించాలి. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వ విధానాలకు సంబంధించిన విషయం కాదు. ప్రతి ఒక్కరి బాధ్యత’ అంటున్నాడు సేన్‌.

సేన్‌ ఇష్టాల గురించి చెప్పాలంటే...సామాజిక పరిస్థితుల గురించి లోతుగా తెలుసుకోవడం అంటే ఇష్టం. సృజనాత్మకత నిండిన సినిమాలు చూడడం అంటే ఇష్టం. సామాజిక అంశాలకు, సృజనాత్మకత జోడించి తనదైన శైలిలో సరికొత్త చిత్రాన్ని ఆవిష్కరించడం అంటే మహా ఇష్టం.
                     

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు