ఆ దీపాలన్నీ స్త్రీలవే.. ఆ దీపాలూ స్త్రీలే

2 Mar, 2021 06:26 IST|Sakshi

తమిళనాడులో కరువు ఊరు అది. సరిగా భుక్తి లేదు. చేయడానికి స్త్రీలు చేయదగ్గ పని లేదు. భర్త ఎలక్ట్రీషియన్‌. నీ పనే నేను చేస్తాను అంది ధనలక్ష్మి. ‘కరెంటు పని నువ్వు చేయలేవు’ అన్నాడు భర్త. ఆమె వినలేదు. వెదురుపుల్లలతో కట్టిన బొమ్మలకు సీరియల్‌ సెట్లు అమర్చడం నేర్చుకుంది. జాతరలు, తిరునాళ్ళు, పండగలకు సీరియల్‌ సెట్ల వెదురుబొమ్మలు కావాలి. ఆ పనిలో విపరీతమైన నైపుణ్యం సంపాదించింది. మిగిలిన ఆడవాళ్లకు కూడా ఆ పని నేర్పించింది. నేడు ‘అరసర్కుళం’ అనే ఊరు సీరియల్‌సెట్ల బొమ్మలకు ప్రసిద్ధి. ఆ దీపాలన్నీ స్త్రీలవే. ఆ దీపాలూ స్త్రీలే.

తమిళనాడు తిరునల్వేలి ప్రాంతంలోని ఎండను, కరువును భరించడం కష్టం. ఉన్నట్టుండి జలుబు చేసినట్టు కొన్ని మేఘాలు చీదుతాయి. వాటికి ఏమైనా పండితే పండినట్టు. అయినా ముక్కు కారితే పంటలు పండుతాయా?
‘మా ఊరి పేరు అరసర్కుళం. అది మారుమూల. పంటలు లేక చాలామంది వలస పోతుంటారు. ఉన్నవారికి పని ఉండదు. రోజూ పట్నానికి పోయి పని చేసుకురావడానికి బస్సులు కూడా తిరగవు’ అంటుంది ధనలక్ష్మి.
ఆమె ఇప్పుడు ఆ ఊరిలోని ‘ధనలక్ష్మి వైరింగ్‌ వర్క్స్‌’కు అధిపతి. ఆమె దగ్గర 50 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఆమె వల్ల ఉపాధి మార్గం తెలుసుకొని మరో 500 మంది జీవిక పొందుతున్నారు. ఇది ఇప్పటి పరిస్థితి. పదేళ్ల క్రితం కాదు.

పదేళ్ల క్రితం...
ధనలక్ష్మిది అరసర్కుళం ఊరే. అక్కడే పుట్టి పెరిగింది. ‘మాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. కాని వానలు లేకపోతే ఏమిటి చేయడం. అదంతా ఉత్త మట్టిగడ్డే కదా’ అంటుంది. తండ్రి ఆమెకు ప్రాయం రాగానే అదే ఊళ్లో ఉన్న అశోక్‌ అనే ఎలక్ట్రీషియన్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. ముగ్గురు కూతుళ్లు పుట్టారు. ‘మా ఆయన ఎలక్ట్రీషియన్‌. ఏదైనా డెకరేషన్‌ వస్తే లైట్లు వేస్తాడు. కాని రెండు మూడు వేల కంటే ఎక్కువ సంపాదించేవాడు కాదు’ అంటుంది ధనలక్ష్మి.

తెలుగులో ప్రసిద్ధ రచయిత శ్రీరమణ ‘ధనలక్ష్మి’ అనే కథ రాశారు. అందులో ధనలక్ష్మి అనే ఇల్లాలు భర్తకు ఉన్న నిర్వహణాలోపాలను గ్రహించి తోడు నిలిచి అతడు వ్యాపారంలో వృద్ధిలోకి రావడానికి సహకరిస్తుంది. సరిగ్గా ఈ ధనలక్ష్మి కూడా భర్త అశోక్‌కు అలాగే అండగా నిలిచింది. ‘ఊళ్లో ఏ పనీ లేదు. నీ పనే నేను చేస్తా’ అందామె. అశోక్‌ ఉలిక్కి పడ్డాడు. ఎందుకంటే ఎలక్ట్రికల్‌ పనంటే కరెంటుతో వ్యవహారం. అది ఏమరుపాటుగా ఉంటే ప్రమాదం. అందుకే వద్దు అన్నాడు. ‘కాని నేను పట్టుపట్టాను. సాధించాను’ అంటుంది ధనలక్ష్మి.

ఊళ్లో జాతర వస్తే...
సరిగ్గా ఆ సమయంలోనే ఊళ్లో జాతర వచ్చింది. జాతరకు ఆ ప్రాంతంలో భారీ ఎత్తున సీరియల్‌ సెట్లతో వెలిగించిన అలంకరణలు చేస్తారు. వెదురుపుల్లతో దేవతల బొమ్మలు, పూలు, జంతువులు, పార్టీ గుర్తులు, రాజకీయ నాయకుల ముఖాలు కట్టి వాటికి సీరియల్‌లైట్లు అమర్చి వెలిగిస్తారు. వెదురుపుల్ల కట్టడంలో అశోక్‌ పని మంతుడు. కాని వాటికి సీరియల్‌లైట్లు బిగించడం శ్రమతో, నైపుణ్యంతో, ఓపికతో కూడిన పని. సీరియల్‌ సెట్లలో మధ్యలో ఒక లైట్‌ కాలిపోయినా మిగిలిన సెట్‌ వెలగదు. ఆ లైట్‌ను కొత్తది వేయాలి. లేదా వైర్‌ను జాయింట్‌ చేయాలి. ‘ఆ పనంతా నేను నేర్చుకుని మొదలెట్టాను’ అంటుంది ధనలక్ష్మి. భర్త వెదురు ఫ్రేమ్స్‌ కడితే ధనలక్ష్మి చకచకా సీరియల్‌ సెట్లు అమర్చేది. వెలిగిస్తే వెదురు కటౌట్‌ మిలమిలమని బ్రహ్మాండంగా వెలిగేది. అశోక్‌ ఆ జాతరలో లైట్లు వెలిగించి పేరు సంపాదించాడు. ధనలక్ష్మి హస్తవాసి మంచిదని నిరూపితం అయ్యింది.

అందరు మహిళల కోసం
తిరునల్వేలి జిల్లాలో ఆ మాటకొస్తే తమిళనాడులో ప్రతి ఊళ్లో ఏదో ఒక ఉత్సవం వేడుక జరుగుతూనే ఉంటాయి. వాటికి వెదురుపుల్లల సీరియల్‌సెట్ల కటౌట్స్‌ అవసరం. అవి తయారు చేసే కార్ఖానా పెడదామని ధనలక్ష్మి భర్తకు సూచించింది. ఊళ్లో ఉన్న ఒక ట్రస్టు సాయంతో లోన్‌ పొంది పని మొదలెట్టింది. భర్త మరికొందు మగపని వారు ఫ్రేమ్స్‌ తయారు చేస్తుంటే తను మరికొంతమంది మహిళలతో ఆ ఫ్రేమ్స్‌కు లైట్లు బిగించడం మొదలుపెట్టింది. ధనలక్ష్మి దగ్గరకు వస్తే రెడిమేడ్‌గా కావలిసిన కరెంటు బొమ్మలు దొరుకుతాయనే పేరు వచ్చింది. ఆ తర్వాత ధనలక్ష్మి చెన్నై నుంచి లైట్లు టోకున కొనుక్కొచ్చి సీరియల్‌ సెట్లను తయారు చేయడం కూడా ఆడవాళ్లకు నేర్చింది. సీరియల్‌ లైట్లు తామే తయారు చేసుకుని తామే కటౌట్స్‌కు అమర్చి మొత్తం కటౌట్‌ను అమ్మడం వల్ల వారికి లాభం బాగా రావడం మొదలెట్టింది. ‘ఇవాళ మా ఊరు పెద్ద సీరియల్‌ సెట్ల కేంద్రమే అయ్యింది’ అంటుంది ధనలక్ష్మి.

తన వద్ద పనిచేస్తున్న మహిళలతో ధనలక్ష్మి

ధనలక్ష్మి ముగ్గురు కుమార్తెల్లో పెద్ద కుమార్తెకు పెళ్లయ్యింది. ఆమె కంప్యూటర్‌ ద్వారా కావలసిన బొమ్మలు తీసి తల్లికి ఇస్తోంది. అల్లుడు ఊళ్లు తిరిగి ఆర్డర్లు తెస్తున్నాడు. ధనలక్ష్మి ధైర్యం లక్ష్మిని తెచ్చింది. మూడు వెలుగులు ఆరు కాంతులుగా ఆమె జీవితం వెలుగుతోంది. ఆరు వందల మంది స్త్రీలూ వెలుగుతున్నారు. చుట్టూ చీకటి కమ్ముకున్నప్పుడు కూడా వెలగొచ్చని వీరు చెబుతున్నారు

– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు