ఇల్లు – ఆఫీస్‌ వేగం తగ్గినా రన్నింగే

9 Apr, 2021 00:26 IST|Sakshi
అశ్విని నందిని

చంద్రవంక వంటి వంతెన మీద నడక ఒకే వేగంతో ఉండదు. వంతెనకు ఈ చివర ఇల్లు. ఆ చివర ఆఫీస్‌. ఇంటి నుంచి ఆఫీస్‌కి, ఆఫీస్‌ నుంచి ఇంటికీ వంతెన ప్రయాణం. ఇంటిని, ఆఫీస్‌ని బ్యాలెన్స్‌ చేసుకుంటూ మహిళ అడుగులు వేస్తున్నప్పుడు.. ఎంత అలవాటైన ప్రయాణం అయినా ఏదో ఒక పరిస్థితిలో ఆఫీస్‌ ఉన్న వైపు నడక వేగం తగ్గుతుంది. అడుగులు ఇంటివైపు లాగుతుంటాయి! కెరీర్‌ ‘స్లో డవున్‌’ అయ్యే దశ అది!

‘నువ్వీ రోజు ఆఫీస్‌కి వెళ్లొదు, ‘నువ్వా క్యాంప్‌ను క్యాన్సిల్‌ చేసుకో’, ‘కొన్నాళ్లు సెలవు పెట్టొచ్చు కదా’.. అని ఇల్లు డిమాండ్‌ చేస్తుంది. వినకుంటే ఆదేశిస్తుంది. అప్పటికీ కాదంటే.. ఆర్యోగంపై, మనసుపై ఒత్తిడి తెస్తుంది. అప్పుడేం చేయాలి?! ‘‘ఏమాత్రం ఒత్తిడి తీసుకోకుండా.. స్లో డవున్‌ అవడమే మంచిది. ఆ స్లో డవునే ఆ తర్వాత మీ కెరీర్‌ని ‘స్పీడ్‌ అప్‌’ చేస్తుంది’’ అని నమ్మకంగా చెబుతున్నారు అశ్విని నందిని.

అశ్విని ఎంత పెద్ద ఉద్యోగినో, అంతకన్నా పెద్ద బాధ్యతలు గల గృహిణి. అశ్విని గురించి చెప్పుకుంటున్నాం కనుక అశ్విని అంటున్నాం కానీ.. ఎంత సాధారణ ఉద్యోగం చేసే మహిళ నుంచైనా ఇల్లు అసాధారణ స్థాయిలోనే తన నిర్వహణ కోసం పట్టుబడుతుంది! ‘నువ్వు దగ్గర లేకుండా నేనెలా నడుస్తాను’ అని ఇల్లు ఏ మాత్రం దయ, జాలి, సానుభూతి, మొహమాటం లేకుండా అనేస్తుంది. అశ్విని నోయిడాలోని ‘గ్లోబల్‌లాజిక్‌ ఇండియా’ లోని డెలివరీ అస్యూరెన్స్‌ విభాగానికి అధిపతి.

ఆ సంస్థ హెడ్‌ ఆఫీస్‌ కాలిఫోర్నియాలో ఉంది. ఉద్యోగం చేసే ఏ మహిళకైనా ఆమె చెప్పేదొక్కటే.. ‘మీరు సూపర్‌ ఉమన్‌లా ఇంట్లో, ఆఫీస్‌లో పడీ పడీ చేయడానికి ప్రయత్నించకండి. భుజంపై కావడి లా రెండిటినీ మోసుకుని వంతెన పై ఒక రోబోలా ప్రయాణించకండి..’’ అని. మల్టీ టాస్కింగ్‌ పట్ల ఆమెకు గొప్ప అభిప్రాయమేమీ లేదు. ఇంట్లో ముఖ్యమైన పని ఉంటే దానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఆప్పుడు ఆఫీస్‌కు రెండో స్థానం. ఇక ఆఫీస్‌లో చేసి తీరవలసిన పని ఉంటే ఆఫీస్‌ పనికే ప్రాధాన్యం ఇవ్వండి. అప్పుడు ఇంటికి రెండో స్థానం’’ అని చెబుతారు అశ్విని. అలా కుదురుతుందా? ‘ఎందుకు కుదరదు?’ అని ఆమె ప్రశ్న.

ఈ ప్రశ్న వేయగలిగినంత సమన్వయ బలాన్ని ఆమె ఇల్లు, ఆఫీసే ఆమెకు ఇచ్చాయి. 1980 లలో ఢిల్లీ యూనివర్సిటీలో మేథ్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి బయటికి వచ్చారు అశ్విని. తర్వాత ఏమిటి? అప్పట్లో డిగ్రీ చేసిన వారెవరికైనా మాస్టర్స్‌ డిగ్రీ చేయాలనుకుంటే హాటెస్ట్‌ కోర్సు.. ‘ఎంసీఎ’. మాస్టర్స్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌. ఆ కోర్సులో చేరాకే మొదటిసారి కంప్యూటర్‌ని చూశారు అశ్విని. కంప్యూటర్‌ని వేళ్లతో తాకడం కూడా అప్పుడే. ఆ క్షణంలోనే కంప్యూటర్‌తో ఆమెకు అనుబంధం ఏర్పడి పోయింది. మేథ్స్‌ ఉపయోగించి సమస్యల్ని పరిష్కరించడం ఆమెకో ఆటలా ఉండేది. ఆ ఆటకు కంప్యూటర్‌ సాధనం అయింది. కోడ్స్‌ రాయడం, అల్గోరిథమ్స్‌ వృద్ధి చేయడం ఆమెకు ఇష్టమైన కఠిన వ్యాయామాలు. గ్లోబల్‌లాజిక్‌ ఇండియా డెలివరీ అస్యూరెన్స్‌ హెడ్‌గా ఇప్పుడు ఆమె చేస్తున్న పని అదే.

అదొక టెక్నాలజీ కన్సల్టెన్సీ సంస్థ. కంపెనీలకు అవసరమైన ప్రోగ్రామింగ్‌లను రాసి, తన టీమ్‌ చేత రాయించి డెలివరీ చేయిస్తుంటారు. ‘ఇంటెరల్‌ ఐటీ’, ‘టాటా యునిసిస్‌’ వంటి పెద్ద సంస్థల్లో పని చేసి వచ్చాక 2007లో ఆమె గ్లోబల్‌లాజిక్‌లో చేరారు. ఇక ఇప్పుడు ఆమె ఆఫీస్‌ బయట చేస్తూ వస్తున్న ఉద్యోగం కూడా ఒకటి ఉంది. లైఫ్‌ కోచ్‌. ఉద్యోగం అంటే ఎవరి దగ్గరో లైఫ్‌ కోచ్‌గా చేయడం కాదు. తనే సొంతంగా ‘వంతెన మీద నడిచే’ గృహిణి కమ్‌ ఉద్యోగినులకు బ్యాలెన్సింగ్‌లో తర్ఫీదు ఇస్తుంటారు. ‘‘ఇల్లు ముఖ్యమా, ఆఫీసు ముఖ్యమా అని రెండిటి మధ్య పరుగు పందెం పెట్టకండి. ఇల్లు పరుగెత్తదు. ఆఫీసూ పరుగెత్తదు. మీరే పరుగెత్తాలి. కనుక.. అప్పటికి ఏది ప్రాధాన్యమో దానివైపు మొగ్గ చూపండి. నష్టమేం లేదు’’ అన్నది ఆమె తరచు చెబుతుండే పాఠం. లైఫ్‌ కోచ్‌గా ఆమె దగ్గరకు వస్తుండే వాళ్లంతా మల్టీ నేషనల్‌ కంపెనీలలో నాయకత్వ బాధ్యతల్లో ఉన్న మహిళలే. వాళ్లంతా ఇంటికి, ఆఫీస్‌కి మధ్య చిక్కుకున్నవారు.

అశ్విని లైఫ్‌ కోచ్‌ అవడానికి స్వీయానుభవాలే ప్రేరేపించాయి. ‘‘సమాజాన్ని మెరుగు పరిచినా, సామాజిక జీవన స్థితిగతుల్ని క్షీణింపజేసినా ఇల్లూ, ఆఫీసేనని ఆమె అభిప్రాయం. అంత ప్రాముఖ్యం గల రెండు వ్యవస్థల్ని సవ్యసాచిలా నడుపుతున్న మహిళలు.. సమానత్వాన్ని, సాధికారతను సాధిస్తూనే ఉన్నా వంపు వంతెనపై నడవడం వారికి పెద్ద సవాలుగా ఉంటుంది. నన్నే చూడండి. నా కూతురు పన్నెండో తరగతి చదువుతున్నప్పుడు తనని దగ్గరుండి చదివించడానికి, తనకి కావలసినవి వేళకు అమర్చడానికి నేను ఉద్దేశపూర్వకంగా ఇంటì  వేగాన్ని పెంచి, ఆఫీస్‌ వేగాన్ని తగ్గించుకున్నాను. అందువల్ల నా కెరీర్‌ కూడా కొంత దెబ్బతినింది. పట్టించుకోలేదు. ఆ తర్వాత నా ఆఫీస్‌ వేగాన్ని పెంచుకున్నాను’’ అని చెప్తారు ఇద్దరు పిల్లల తల్లి అయిన అశ్విని. ఆమెకు మరొక అనుభవం కూడా ఉంది. కెరీర్‌ ఆరంభంలో ఆఫీస్‌ తరఫున అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. కొన్ని నెలల పాటు అక్కడే ఉండిపోవాలి. అప్పటికి ఆమె మొదటి బిడ్డ తల్లి. క్షణం కూడా ఆలోచించకుండా అమెరికా ఆఫర్‌ని కాదనేశారు. ‘‘వెళ్లొచ్చా అని అడగడం కాదు. వెళ్లాలో వద్దో మనకే తెలిసిపోవాలి’’ అంటారు అశ్విని.
 
ఇల్లు ముఖ్యమా, ఆఫీసు ముఖ్యమా అని రెండిటి మధ్య పరుగు పందెం పెట్టకండి. ఇల్లు పరుగెత్తదు. ఆఫీసూ పరుగెత్తదు. మీరే పరుగెత్తాలి. కనుక.. అప్పటికి ఏది ప్రాధాన్యమో దాని వైపు మొగ్గు చూపండి. నష్టమేం లేదు.

మరిన్ని వార్తలు