Sucheta Bhandare: 5 వేలతో రాగిలడ్ల తయారీ మొదలు పెట్టి.. ఇప్పుడు నెలకు లక్ష

23 Sep, 2021 00:21 IST|Sakshi
ఎర్త్‌పూర్ణ ఉత్పత్తులు; సుచేత భండారే

సుచేత భండారే 5 వేల రూపాయలతో రెండేళ్ల క్రితం రాగిలడ్లు చేయడం మొదలెట్టింది. ఇవాళ నెలకు లక్ష రూపాయల లడ్లు ఆన్‌లైన్‌లో అమ్ముతోంది. సేంద్రియ రాగులు.. అవిసె గింజల పొడి.. బాదాం, ఎండు ఖర్జూరం... వీటితో తయారు చేసే రాగిలడ్ల  బలం ముందు జంక్‌ ఫుడ్‌ దిగదుడుపు. ‘భూమి నుంచి వచ్చేది తినండి పెనం నుంచి వచ్చేది కాదు’ అంటుంది సుచేత. ఈ లడ్డు లాంటి ఆలోచనను ఎవరైనా ఆచరణలో పెట్టొచ్చు.

మీరు ఇంట్లో రాగి లడ్డు చేయాలంటే ఏమేమి ఉపయోగిస్తారు? సుచేత భండారే మాత్రం ఇవి ఉపయోగిస్తుంది. రాగి పిండి, బెల్లం, ఆవు నెయ్యి, అవిసె గింజల పొడి, బాదం పొడి, ఎండు ఖర్జూరం పొడి, ఏలకులు. వీటితో రాగిలడ్డూలు తయారు చేసి 16 లడ్డూలు ఒక మంచి అట్టపెట్టెలో పెడుతుంది. వాటిని ఎక్కడెక్కడి నుంచో రూ.439 రూపాయలు చెల్లించి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆమె ఈ పని కోసం ఏడు మంది గ్రామీణ మహిళలను పనిలోకి తీసుకుంది. అందరూ కలిసి ఇప్పుడు నెలకు దాదాపు 2,500 రాగి లడ్డూలు తయారు చేస్తారు. ఇంకా అటుకుల చిరుతిండి, బొరుగుల చిరుతిండి తయారు చేస్తారు. మొత్తం లక్ష రూపాయల బిజినెస్‌ జరుగుతుంది. పెద్ద కార్ఖానా లేదు. షాప్‌ లేదు. రెంట్‌ లేదు. ఏమీ లేదు. ఆన్‌లైన్‌ మీదే అన్నీ పార్శిల్‌ అయిపోతాయి. ఒకసారి సుచేత లడ్లు తెప్పించుకున్నవారు మళ్లీ మళ్లీ ఆర్డరు పెడుతుంటారు.

ఆమె ఆలోచన
సుచేత భండారేది పూణె సమీపంలో ఉన్న వడ్నేర్‌ భైరవ్‌ అనే గ్రామం. ‘నా బాల్యం అంతా బలవర్థకమైన చిరుతిండ్లతోనే గడిచింది. మా పొలంలో వరి, బంగాళ దుంపలు తప్ప దాదాపు అన్నీ పండించేవాళ్లం. ఇంట్లో నాకు పచ్చి కొబ్బరి, అటుకులు, రాగి లడ్లు, బొరుగులు, సున్ని ఉండలు, మేము పండించిన పండ్లు ఇవి పెట్టేవాళ్లు. బజారులో దొరికేది ఏదీ నేనే తినలేదు. అలాగే స్కూల్‌ అయిపోయిన వెంటనే మా పొలానికి వెళ్లేదాన్ని. ముఖ్యంగా కోత సమయాల్లో నేను చాలా ఉత్సాహంగా ఉండేదాన్ని. మట్టితో నాకు అప్పుడే అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు అది నా పనిలో కనిపిస్తోంది’ అంటుంది 35 ఏళ్ల సుచేత. వ్యవసాయం మీద ఆసక్తితో అగ్రికల్చర్‌ బిఎస్సీ చేయాలనుకుంది కాని కుదరక డిగ్రీలో కామర్స్‌ చదివింది. ఆ తర్వాత కొన్నాళ్లు పూణెలో కాల్‌ సెంటర్‌ నడిపింది. ‘నా కాల్‌సెంటర్‌ బాగా నడుస్తున్నా నేను చేయాల్సిన పని ఇది కాదే అనిపించేది’ అంది సుచేత.

ఆలోచన మెరిసింది
పూణెలో కాల్‌ సెంటర్‌ పని చేస్తున్నప్పుడు సుచేత తరచూ రకరకాల బృందాలతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లేది. ‘ఆ సమయంలో ఇష్షో బుష్షో అనకుండా చలాకీగా నేనొక్కదాన్నే ఉండేదాన్ని. మిగిలినవాళ్లు తొందరగా అలసిపోయేవాళ్లు. చమటలు కక్కేవాళ్లు. నేను హాయిగా ఎంత దూరమైనా నడిచేదాన్ని. ఎందుకిలా అని ఆలోచిస్తే చిన్నప్పటి నుంచి నేను తిన్న హెల్దీ తిండి అనిపించింది. నీ జీవితంలో జరిగేది నువ్వు ఎలాగూ మార్చలేవు... కానీ నీ కడుపులో పడేదాన్ని మార్చగలవు అనుకున్నాను. వెంటనే ఊరికి వచ్చి రాగి లడ్డూల తయారీ మొదలెట్టాను. ఆరోగ్యకరమైన చిరుతిండ్లు తయారు చేసి అమ్ముదామని నిశ్చయించుకున్నాను. పిల్లలు, స్త్రీలు ముఖ్యంగా వీటిని తినాలి’ అంది సుచేత.

2019లో మొదలు
ఇంతా చేసి ఈ ఆలోచన వచ్చి ఎంతో కాలం కాలేదు. రెండేళ్ల క్రితమే. అయితే రసాయనాలు లేని పదార్థాలు వాడాలని సుచేత నిశ్చయించుకుంది. బజారులో రాగులు దొరుకుతాయి. అవి మందులు కొట్టి పండించినవి. కాని తనకు సేంద్రియంగా పండిన రాగులు కావాలి. అందుకు సుచేత కొంతమంది రైతులను సంప్రదించి వారిని సేంద్రియ పద్ధతిలో రాగులు పండించేలా ఒప్పించింది. పండాక మార్కెట్‌ రేటుకు కొంటామని హామీ ఇచ్చింది. ‘మొదలు రైతులకు నమ్మకం కుదరలేదు. నాక్కూడా శ్రమ అయ్యింది. కాని ఇప్పుడు ఐదారు మంది రైతులు నా కోసం పండిస్తున్నారు’ అంది సుచేత. రాగిలడ్లు మరింత బలవర్థకం కావాలంటే ఏం చేయాలని న్యూట్రిషనిస్ట్‌లను అడిగింది. వారు అవిసె గింజలను సూచించారు. సరే... బాదం, ఎండు ఖర్జూరం ఎలాగూ బలమే. వాటన్నింటిని కలిపి కొలతలు ఖరారు చేసి తన మార్కుతో 5 వేల రూపాయల పెట్టుబడితో లడ్లు తయారు చేసింది. మొదట బంధువులు, స్నేహితులు.. తర్వాత నోటి మాటగా, సోషల్‌ మీడియా ద్వారా ఆమె రాగి లడ్లు ఫేమస్‌ అయ్యాయి.

ఎర్త్‌పూర్ణ సంస్థ సిబ్బ్బంది

ఎర్త్‌పూర్ణ
సుచేత భండారే ఈ బలవర్థకమైన తిండ్లను తయారు చేసేందుకు ‘ఎర్త్‌పూర్ణ’ అనే సంస్థను ప్రారంభించింది. అంటే ‘సంపూర్ణభూమి’ అని అర్థం. ‘భూమి నుంచి తీసుకున్నది తిరిగి భూమికి చేరితేనే భూమి సంపూర్ణంగా ఉంటుంది. సహజమైన పద్ధతిలో పండింది సహజమైన విధంగా ఆరగించి ఆ మిగిలిన వృధాను భూమిలో కలవనిస్తే ఆ భూచక్రం సజావుగా ఉంటుంది. కెమికల్స్‌ ప్రమేయం ఉన్న ప్రతి పని భూమిని అసంపూర్ణం చేస్తుంది’ అంటుంది సుచేత. పర్యావరణ హితమైన, ఆరోగ్యహితమైన ఆహార ప్రచారానికి పని చేస్తున్న సుచేత స్వలాభం భూమిలాభం కలిగేలా చూస్తున్నారు. ఇది చాలామంది గమనించదగ్గ ఫార్ములానే.   

చదవండి: Health Tips: వేరు శెనగలు, ఖర్జూరాలు, కిస్‌మిస్‌లు తరచుగా తింటే...

మరిన్ని వార్తలు