సైకిల్‌ దీదీ... :సుధా వర్గీస్‌ సేవకు షష్టిపూర్తి

10 Sep, 2022 01:04 IST|Sakshi

చదువు బతకడానికి అవకాశం ఇస్తుంది. అదే చదువు ఎంతోమందిని బతికించడానికి ఓ కొత్త మార్గాన్ని చూపుతుంది. బీహార్‌లో సామాజికంగా అత్యంత వెనకబడిన ముసహర్‌ కమ్యూనిటీకి చెందిన బాలికల సాధికారతకు ఆరు దశాబ్దాలుగా కృషి చేస్తున్న సుధా వర్గీస్‌ చదువుతో పాటు ప్రేమ, ధైర్యం, కరుణ అనే పదాలకు సరైన అర్థంలా కనిపిస్తారు.   సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి సామాజిక నాయికగా ఎలా ఎదిగిందో తెలుసుకుందాం...

ముసహర్‌ సమాజంలో సైకిల్‌ దీదీగా పేరొందిన సుధా వర్గీస్‌ పుట్టి పెరిగింది కేరళలోని కొట్టాయంలో. స్కూల్‌లో చదువుకుంటున్నప్పుడు ఒక పేపర్‌లోని వార్త ఆమెను ఆకర్షించింది. అందులో.. బీహార్‌లోని ముసహర్‌ల సమాజం ఎదుర్కొంటున్న భయానకమైన జీవనపరిస్థితులను వివరిస్తూ ఫొటోలతో సహా ప్రచురించారు. ‘ముసహర్‌’ అంటే ‘ఎలుకలు తినేవాళ్లు’ అనేది తెలుసుకుంది. తాను పుట్టి పెరిగిన కేరళలో ఇలాంటివి ఎన్నడూ చూడని ఆ సామాజిక వెనుకబాటుతనం సుధను ఆశ్చర్యపరిచింది. ‘వీరి పరిస్థితిని మెరుగుపరచడానికి ఏమీ చేయలేమా..?!’ అని ఆలోచించింది. తనవంతుగా కృషి చేయాలని అప్పుడే నిర్ణయించుకుంది.

కాలేజీ రోజుల్లోనే...
ముసహర్‌ ప్రజలకోసం పనిచేయాలని నిర్ణయించుకొని బీహార్‌లోని పాట్నా నోట్రే డామ్‌ అకాడమీలో చేరింది. అక్కడ శిక్షణ పొందుతున్న సమయంలోనే ఇంగ్లిష్, హిందీ నేర్చుకుంది. 1986లో తన సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి ముసహర్‌లతో కలిసి జీవించాలని, వారికి విద్యను అందించాలని, వారి జీవితాలను మెరుగుపరచడానికి తన సమయాన్ని, వనరులను వెచ్చించాలని నిర్ణయించుకుంది.

గుడిసెలో జీవనం...
ముసహర్‌లు గ్రామాల సరిహద్దుల్లో ఉండేవారు. ఆ సరిహద్దు గ్రామాల్లోని వారిని కలుసుకోవడానికి సైకిల్‌ మీద బయల్దేరింది. అక్కడే ఓ పూరి గుడిసెలో తన జీవనం మొదలుపెట్టింది. ‘ఇది నా మొదటి సవాల్‌. ఆ రోజు రాత్రే భారీ వర్షం. గుడిసెల్లోకి వరదలా వర్షం నీళ్లు. వంటపాత్రలతో ఆ నీళ్లు తోడి బయట పోయడం రాత్రంతా చేయాల్సి వచ్చింది. కానీ, విసుగనిపించలేదు. ఎందుకంటే నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుని వచ్చాను. ఎలాంటి ఘటనలు ఎదురైనా వెనక్కి వెళ్లేదే లేదు’ అనుకున్నాను అంటూ తన ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటారు సుధ. పేదరికంతోనేకాదు శతాబ్దాలనాటి కులతత్వంపై కూడా పోరాటానికి సిద్ధమవడానికి ప్రకృతే ఓ పాఠమైందని ఆమెకు అర్ధమైంది.

ముసహర్లు తమజీవితంలోని ప్రతి దశలోనూ, ప్రాంతీయ వివక్షను ఎదుర్కొంటున్నారు. వారికి చదువుకోవడానికి అవకాశాల్లేవు. స్కూల్లోకి ప్రవేశం లేదు. సేద్యం చేసుకోవడానికి భూమి లేనివారు. పొట్టకూటికోసం స్థానికంగా ఉన్న పొలాల్లో కూలీ పనులు చేస్తుంటారు. ఈ సమాజంలోని బాలికలు, మహిళలు తరచు అత్యాచారం, లైంగిక వేధింపులకు గురవుతున్నారు.

మొదటి పాఠశాల...
ముసహర్‌ గ్రామంలో వారిని ప్రాధేయపడితే చదువు చెప్పడానికి అంగీకరించారు. బాలికలకు చదువు, కుట్లు, అల్లికలు నేర్పించడానికి ఆమె ప్రతిరోజూ పోరాటమే చేయాల్సి వచ్చేది. దశాబ్దాల పోరాటంలో 2005లో సామాజికంగా వెనుకబడిన సమూహాలకు చెందిన బాలికల కోసం ఓ రెసిడెన్షియల్‌ పాఠశాలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నుంచి వెనకబడిన సమాజానికి చెందిన బాలికల కోసం అనేక రెసిడెన్షియల్‌ స్కూళ్లను నడుపుతోంది. ఆమె కృషిని అభినందిస్తూ 2006లో భారతప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
    
కుటుంబం నుంచి
ఆరుగురు తోబుట్టువులలో పెద్ద కూతురుగా పుట్టిన సుధ కళల పట్ల ప్రేమతో స్కూల్లో నాటకాలు, నృత్యం, పాటల పోటీలలో పాల్గొనేది. పెద్ద కూతురిగా తల్లీ, తండ్రి, తాత, బామ్మలు ఆమెను గారాబంగా పెంచారు. ‘స్కూల్లో నేను చూసిన పేపర్లోని ఫొటోల దృశ్యాలు ఎన్ని రోజులైనా నా తలలో నుంచి బయటకు వెళ్లిపోలేదు. అందుకే నేను బీహార్‌ ముసహర్‌ సమాజం వైపుగా కదిలాను’ అని చెబుతారు ఈ 77 ఏళ్ల సామాజిక కార్యకర్త. ‘మొదటగా నేను తీసుకున్న నిర్ణయానికి మా అమ్మ నాన్నలు అస్సలు ఒప్పుకోలేదు. నేనేం చెప్పినా వినిపించుకోలేదు. కానీ, నా గట్టి నిర్ణయం వారి ఆలోచనలనూ మార్చేసింది’ అని తొలినాళ్లను గుర్తుచేసుకుంటారు ఆమె.

బెదిరింపుల నుంచి...
అమ్మాయిలకు చదువు చెప్పడానికి ముసహర్‌ గ్రామస్తులను ఒక స్థలం చూపించమని అడిగితే తాము తెచ్చుకున్న ధాన్యం ఉంచుకునే ఒక స్థలాన్ని చూపించారు. అక్కడే ఆమె బాలికల కోసం తరగతులను ప్రారంభించింది. ‘ఈ సమాజానికి ప్రధాన ఆదాయవనరు మద్యం తయారు చేయడం. మద్యం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వస్తుండటంతో యువతుల చదువుకు ఆటంకం ఏర్పడేది. దీంతో నేనుండే గుడిసెలోకి తీసుకెళ్లి, అక్కడే వారికి అక్షరాలు నేర్పించేదాన్ని. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ క్లాసులు కూడా తీసుకునేదాన్ని.

రోజు రోజుకూ అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. వారిలో స్వయం ఉపాధి కాంక్ష పెరుగుతోంది. కానీ, అంతటితో సరిపోదు. వారి హక్కుల కోసం గొంతు పెంచడం అవసరం. తిరుగుబాటు చేస్తారనే ఆలోచనను గమనించిన కొందరు వ్యక్తులు బెదిరింపులకు దిగారు. చంపేస్తారేమో అనుకున్నాను. దీంతో అక్కణ్ణుంచి మరో చోటికి అద్దె ఇంటికి మారాను. కానీ, ఇలా భయపడితే నేననుకున్న సహాయం చేయలేనని గ్రహించాను. ఇక్కడి సమాజానికి అండగా ఉండాలని వచ్చాను, ఏదైతే అది అయ్యిందని తిరిగి మొదట నా జీవనం ఎక్కడ ప్రారంభించానో అక్కడికే వెళ్లాను’ అని చెబుతూ నవ్వేస్తారు ఆమె.

ముసహర్ల కోసం సేవా బాట పట్టి ఆరు దశాబ్దాలు గడిచిన సుధి ఇప్పుడు వెనకబడిన సమాజపు బాలికల కోసం అనేక రెసిడెన్షియల్‌ స్కూళ్లను నడుపుతోంది. యువతులకు, మహిళలకు జీవనోపాధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ దళిత సంఘాలను అగ్ర కులాల సంకెళ్ల నుండి శక్తిమంతం చేస్తోంది. ఈమె శతమానం పూర్తి చేసుకోవాలని కోరుకుందాం.    

నైపుణ్యాల దిశగా..
సుధ వర్గీస్‌ ఏర్పాటు చేసిన ముసహర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలోని బాలికలు చదువులోనే కాదు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ మార్షల్‌ ఆర్ట్స్‌ పోటీలలో పతకాలను సాధించుకు వస్తున్నారు. ఇక్కడ నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, నాయకులు కావడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ సమాజంలోని మహిళలు బృందాలుగా కూరగాయలు పండిస్తూ జీవనోపాధిని మెరుగుపరుచుకుంటున్నారు. వీరు చేస్తున్న హస్తకళలను ప్రభుత్వ, ఉన్నతస్థాయి ఈవెంట్లలో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నుంచి చవకగా లభించే శానిటరీ న్యాప్‌కిన్‌లను తయారుచేస్తున్నారు.

మరిన్ని వార్తలు