Sudipta Mondal: ‘జుంబా’ అన్నందుకు గొడవ.. విడాకులు.. ఆ తర్వాత

30 Jul, 2021 15:42 IST|Sakshi

ఫిట్‌నెస్‌కు సు‘దీప్తి’

వ్యక్తిగత ఒత్తిళ్లను అధిగమించి సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రెనర్‌గా

చదువులు పూర్తై ఉద్యోగం వచ్చి, పెళ్లయ్యేంత వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడే సాంప్రదాయం ఉన్న మనదేశంలో... జార్ఖండ్‌లోని సింద్రీకి చెందిన సుదీప్త మండల్‌ పదహారేళ్ల వయసులో సొంతూరు వదిలి ఎవరికీ భారం కాకుండా తన కాళ్ల మీద తను నిలబడేందుకు ఢిల్లీ చేరింది. అక్కడ ఓ ప్లాట్‌ను అద్దెకు తీసుకుని ఉంటూ...  ఓ న్యూస్‌పేపర్‌లో జర్నలిస్టుగా చేరింది. ఏడాది తరువాత జర్నలిస్టు ఉద్యోగాన్ని మానేసి, లైవ్‌ థియేటరికల్‌ షో ‘జంగూరా’లో ఆర్టిస్ట్‌గా 1400 షోలకు పనిచేసింది. మరోపక్క ఫిట్‌నెస్‌ క్లాసులు చెబుతుండేది. 2014లో వివాహం అవ్వడంతో ఢిల్లీ నుంచి మకాం ముంబైకి మారింది సుదీప్త.

పెళ్లయ్యాక జుంబా ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసేందుకు అత్తింటివారు ఒప్పుకునేవారు కాదు. భర్త కూడా సుదీప్తను తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఆమె మాట వినక పోవడంతో భార్యాభర్తల ఘర్షణ హింసాత్మకంగా మారుతుండేది. ఇద్దరి మధ్యా గొడవలు తారాస్థాయికి చేరడంతో... భర్త నుంచి విడిపోవాలనుకుని విడాకులకు అప్లై చేసింది. కానీ అత్తింటి వారికి విడాకులు ఇవ్వడం ఇష్టం లేక దాదాపు రెండేళ్లపాటు సాగదీసి తరువాత విడాకులు ఇచ్చారు.

సెలబ్రెటీ ట్రైనర్‌గా..
మానసికంగానే గాక ఆర్థికంగానూ దెబ్బతిన్న సుదీప్త కొద్ది బ్రేక్‌ తర్వాత ఎలాగైనా మంచి ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా ఎదగాలని నిర్ణయించుకుంది... తాను దాచుకున్న డబ్బుతో ఫిట్‌నెస్‌ నైపుణ్యాలైన జుంబా, పైలట్స్, ఫంక్షనల్‌ ట్రైనింగ్‌లో శిక్షణ తీసుకుంది. శిక్షణ పూర్తయిన దగ్గర నుంచి డైలీ వివిధ రకాల మెంటార్స్‌కు ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇచ్చేది. సరికొత్త ఫిట్‌నెస్‌ ఐడియాలతో సుదీప్త బాగా పాపులర్‌ అయ్యింది. ఆమె దగ్గర శిక్షణ తీసుకునేవారిలో సెలబ్రిటీలు కూడా ఉండడం విశేషం. ముంబైలో సెలబ్రెటీ ఫిట్‌ నెస్‌ కోచ్‌గా, అష్టాంగ యోగా టీచర్‌గా సుదీప్త రాణిస్తోంది.

ఎకోఫ్రెండ్లీ...
పర్యావరణానికి హానీ జరగకుండా జీవించాలని నిర్ణయించుకుని 2018 నుంచి ఎకో ఫ్రెండ్లీ జీవన శైలిని అనుసరించడం మొదలు పెట్టింది సుదీప్త. నూనె వాడని వీగన్‌ ఆహారం తీసుకోవడంతో పాటు, తన దగ్గర ఉన్న బట్టలు, పుస్తకాలు, ఫర్నీచర్‌లో సగభాగాన్ని దానం చేసింది. పోషకాహారం, లైఫ్‌స్టైల్‌ కోచింగ్‌ గురించి మరింత లోతుగా తెలుçసుకుని ఫిటెనెస్, హోలిస్టిక్‌ వెల్‌నెస్‌ వీడియోలను అప్‌ లోడ్‌ చేస్తోంది. తను చేయగలిగిన సాయం చేయడంతోపాటు, ఫిట్‌గా ఉండాలని గోల్స్‌ పెట్టుకునేవారికి ఆన్‌లైన్‌ ఫిట్‌నెస్‌ క్లాసులు నిర్వహించడం, వ్యక్తిగత సెషన్లు నిర్వహిస్తూ జుంబా, పార్కుర్, ఫంక్షనల్‌ ఫిట్‌నెస్‌లపై శిక్షణ ఇస్తోంది. ‘‘ప్రతిమహిళలో సహజసిద్ధమైన బలం, శక్తి లోతుగా దాగి ఉంటాయి. వాటిని మనం మేల్కొల్పినప్పుడే ఏదైనా సాధించగలుగుతాం’’ అని సుదీప్త మహిళలకు పిలుపునిస్తోంది.  

మరిన్ని వార్తలు