చెమట కాయలా? చందనం పొడి, వట్టివేళ్ల పొడిని రోజ్‌వాటర్‌లో కలిపి..

9 Apr, 2022 11:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెమట కాయలా? ఉపశమనం ఇలా...

ఎండలు మండుతున్నాయి. దీంతో విపరీతమైన చెమట, దురదలతో చాలా ఇబ్బంది పడిపోతుంటారు. చర్మం తన మృదుత్వాన్ని కూడా కోల్పోతుంది. చెమటకాయలు దురదకు కారణమై, చికాకు, ఆయా భాగాలలో మంట, నొప్పికి దారితీస్తాయి. అతిగా చెమట పట్టే వారిలో వీటి సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.

సాధారణంగా నుదుటిపై, ముఖం, మెడ, వీపు, ఛాతీ, తొడల మీద చెమట కాయలు వస్తుంటాయి. వీటి తీవ్రత ఎక్కువైతే చర్మం ఎర్రపొక్కులుగా మారటం, గోకటం వల్ల చర్మం చిట్లి రక్తం కారడం జరుగుతుంది. కొన్ని చిట్కాలతో కొంత ఉపశమనం పొందవచ్చు. అవేంటో చూద్దాం. 

రెండు పూటలా స్నానం చేస్తూ శరీరాన్ని శుభ్రంగా వుంచుకోవాలి. చెమట ఎక్కువగా పట్టినప్పుడు స్నానం చేయడం, లేదా తడి వస్త్రంతో శరీరాన్ని తుడవడం తప్పనిసరి. వదులుగా ఉండే పల్చని కాటన్‌ వస్త్రాలు వేసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి. దాంతో శరీరం చల్లగా ఉంటుంది. వీలైనంత వరకు ఎండలోకి వెళ్లకుండా చూసుకోవాలి.

స్నానం చేసే నీటిలో గుప్పెడు మల్లెపూలు, జాజిపూలు లేదా వట్టివేళ్ల చూర్ణం వేసి గంటసేపు నాననిచ్చి, ఆ నీటితో స్నానం చేయడం మంచిది. ఇటువంటి స్నానం శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

వంటినిండా చెమటకాయలు వచ్చినప్పుడు గంధం ముద్దని పేలిన చోట పల్చని పూతలా వేసుకుంటే, మంట, దురద తగ్గుతాయి. ఇందులో కర్పూరాన్ని కలిపి పేలిన చోట లేపనంలా రాసినా కూడా సమస్య అదుపులోకి వస్తుంది. మార్కెట్లో లభ్యమయ్యే గంధం పొడిలో సహజత్వం ఉండదు. అందుకే గంధపు చెక్కని సానపై అరగదీసి, దాన్ని వాడటం శ్రేయస్కరం.

చందనం పొడి, వట్టివేళ్ల పొడిని రోజ్‌వాటర్‌లో కలిపి పల్చని లేపనంలా చెమట కాయలపై రాసినా మంచిదే. కలబంద గుజ్జుని రాసుకున్నా కూడా చెమటకాయల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

తాటి ముంజెలలోని నీటిని చెమట కాయలపై రాసి, ఆరిన తర్వాత శుభ్రమైన వస్త్రంతో మృదువుగా తుడిచేయాలి. పుచ్చకాయ, కర్బూజా, కీరదోస, ముంజెలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పల్చని మజ్జిగ... వంటి చలువచేసే పదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. కారం, గరం మసాలా, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి.

చదవండి: మొలకలు తింటున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు!
  

మరిన్ని వార్తలు