Ragi Java Health Benefits: రాగిజావను పాలు, బెల్లం, యాలకుల పొడితో కలిపి కాచుకుని తాగే అలవాటు ఉందా.. అయితే

19 Mar, 2022 12:21 IST|Sakshi

వేసవి కాలం రాగానే చాలామంది రాగిజావ తాగుతుంటారు. రాగిజావ నిజంగా ఆరోగ్య ప్రదాయినే. వేసవిలో రోజుకోసారి రాగిజావ తీసుకోవడం వల్ల కడుపులో చల్లగా ఉండటంతోపాటు మరెన్నో లాభాలు  ఉన్నాయి. ఆ లాభాలేమిటో చూద్దాం...

రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
వీటిలో ఐరన్‌ కూడా ఎక్కువే. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు తమ ఆహారంలో దీన్ని తరచూ తీసుకోవడం మంచిది.
రాగి పిండిలో విటమిన్‌–సి కూడా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
రాగులు లేదా రాగిజావ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు అదుపులో ఉంటాయి.

బరువు తగ్గాలనుకునేవారికి రాగి జావ లేదా రాగిసంగటిగానూ తీసుకోవడం వల్ల పొట్ట నిండినట్లుగా అనిపించి ఎక్కువ ఆహారం తీసుకోరు. అందువల్ల త్వరగా బరువు తగ్గుతారు.
రాగిపిండిలో పలు రకాల అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని ఒత్తిడీ, ఆందోళనలను తగ్గిస్తాయి.
అంతేకాదు కండరాల ఆరోగ్యానికీ, రక్తం తయారవడానికీ, జీవక్రియలు సాఫీగా జరగడానికి తోడ్పడతాయి.
దీనిలో మాంసకృత్తులు కూడా మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ చిరుధాన్యాన్ని తీసుకోవడం వల్ల పోషకాహార లోపం తలెత్తదు.

రక్తంలో కొలెస్ట్రాల్స్‌ను తగ్గిస్తుంది. అలా గుండెజబ్బులు రాకుండా కూడా చూసుకోవచ్చు.
అల్పాహారం తీసుకోవడం కుదరనివారు రాగులతో సమానంగా దంపుడు బియ్యం కలిపి మర పట్టించి, జావ కాచుకుని తాగితే ఎక్కువసేపు ఆకలి కాదు. నీరసం రాకుండా ఉంటుంది.
బీపీ ఉండి, మధుమేహం లేనివారు రాగిజావను పాలు, బెల్లం, యాలకుల పొడితో కలిపి కాచుకుని తాగవచ్చు. ఇది పిల్లలకు కూడా మంచిది.
షుగర్‌ ఉన్న వారు తీపికి బదులుగా మజ్జిగ, ఉప్పుతో తీసుకోవాలి.

చదవండి: Health Tips- Curry Leaves: షుగర్‌ పేషెంట్లకు శుభవార్త.. ఈ పొడి ఉదయం, రాత్రి ఒక్కో టీ స్పూన్‌ తీసుకున్నారంటే

మరిన్ని వార్తలు