Summer Care Tips: ఓవర్‌ కూల్డ్‌ వాటర్‌ తాగుతున్నారా? అయితే..

14 Mar, 2022 13:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సమ్మర్‌ వచ్చేసింది. ఏటా వచ్చేది, వెళ్లేదే కదా! అనుకోవడానికి వీల్లేదు. ఈ సారి వేసవి పరీక్ష పెట్టే అవకాశం ఉంటుంది. వేసవి తీవ్రత గురించి కాదు, వేసవిని దేహం తట్టుకోగలగడం గురించి ఇప్పుడు ప్రశ్న. గడచిన రెండు వేసవి కాలాలు ఇంట్లోనే గడిచిపోయాయి. కోవిడ్‌ కారణంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లు, ఆన్‌లైన్‌ క్లాసులు, తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్లకపోవడం వంటి జాగ్రత్తలతో వేసవి కారణంగా ఎదురయ్యే సన్‌స్ట్రోక్‌ వంటి అనారోగ్యాలను తప్పించుకోగలిగాం

మనుషులు నీడపట్టున ఉన్నప్పటికీ ఈ రెండేళ్లపాటు దేహం మాత్రం విశ్రాంతి తీసుకోలేదు. కోవిడ్‌ వైరస్‌తో పోరాటం చేస్తూనే ఉంది. కోవిడ్‌ బారిన పడిన వాళ్లలో నీరసం, ఇతర పోస్ట్‌ కోవిడ్‌ లక్షణాలను మాత్రమే గుర్తిస్తాం. కానీ కోవిడ్‌ బారిన పడకుండా తప్పించుకున్న వాళ్లు కూడా వైరస్‌తో సాగిన నిరంతర పోరాటంలో అలసిపోయి ఉన్నారు.

కోవిడ్‌ బారిన పడని దేహాలు కూడా నీరసించి ఉన్నమాట వాస్తవం. అందుకే ఈ వేసవిని ఎదుర్కోవడం కోవిడ్‌ బారిన పడిన వాళ్లకు, పడని వాళ్లకు కూడా పెద్ద పరీక్ష అనే చెప్పాలి. ఒక మోస్తరు ఎండను కూడా తాళలేని స్థితిలోకి వెళ్లిపోతోంది దేహం. ఈ గడ్డు కాలాన్ని జాగ్రత్తగా దాటడానికి జాగ్రత్తలు తీసుకుందాం.

ఏం చేయాలి?
రోజుకు మూడు లీటర్ల మంచి నీటిని తాగాలి. ఫ్రిజ్‌లో ఉంచిన విపరీతమైన చల్లదనం నిండిన (ఓవర్‌ కూల్డ్‌) నీటిని తాగడం కంటే గది ఉష్ణోగ్రతలో ఉన్న నీరు లేదా ఒకమోస్తరు చల్లదనంతో ఉన్న నీటిని మాత్రమే తాగాలి.
కొబ్బరి నీరు లేదా మజ్జిగ అరలీటరు తాగాలి.
స్నానానికి చల్లటి నీరు లేదా గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి. మరీ వేడి నీటితో స్నానం చేయరాదు.
గోరువెచ్చటి నీటితో స్నానం చేసిన తర్వాత నాలుగైదు మగ్గుల చల్లటి నీటితో తల, మెడను చల్లబరుచుకోవాలి.

గది ఉష్ణోగ్రతలు దేహం భరించలేని స్థాయికి పెరిగినట్లు అనిపిస్తే తడి టవల్‌తో ముఖం, మెడ, చేతులను తుడుచుకోవాలి. కోల్డ్‌ ప్యాక్‌ వేసినట్లన్నమాట.
ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్యలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదు.
బయటకు వెళ్లాల్సి వస్తే తలకు క్యాప్‌ లేదా స్కార్ఫ్‌ కట్టుకోవాలి.
ఆల్కహాలు అలవాటున్న వాళ్లు ఈ కాలంలో మానేయాలి లేదా వీలయినంత తక్కువగా తీసుకోవాలి.
వ్యాయామం దేహానికి మంచిదే, కానీ ఈ కాలంలో మితంగా మాత్రమే చేయాలి. దేహం నీరసించి పోయేటట్లు వ్యాయామం చేయరాదు.

చదవండి: Sabja Seeds Health Tips: సబ్జా గింజలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

మరిన్ని వార్తలు