పాలు కాచి చల్లార్చి.. పుల్లని మజ్జిగ కలిపి, ఈ పొడి వేసుకుని తాగితే పేగులకు బలం.. ఇంకా!

4 Mar, 2023 13:43 IST|Sakshi

మజ్జిగను బటర్‌ మిల్క్‌ అంటాం కదా.. వేసవి వచ్చేసరికి ఇది కాస్తా బెటర్‌ మిల్క్‌గా మారుతుంది. అదెలాగంటే... మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకుండా ఉంటాయనీ, చర్మరోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు, కొవ్వు, అమిత వేడి తగ్గిపోతాయనీ, శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందనీ ఆయుర్వేద నిపుణులు, పెద్దలు చెబుతారు. 

ఆరోగ్య ప్రయోజనాలివే!
►మజ్జిగ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. అధిక దాహం తీరుతుంది. అంతేకాదు, వడ దెబ్బ తగలకుండా ఉంటుంది. 
►జీలకర్ర, ధనియాలు, అవిసెగింజలు, సైంధవ లవణం మెత్తగా పొడి చేసుకుని మజ్జిగలో కలుపుకుని తాగితే మంచిది. 
►ఇలా తయారు చేసుకున్న మజ్జిగని లంచ్‌తో లేదా మధ్యాహ్నం 3–4 గంటల సమయంలో తాగడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు.

పాలు కాచి చల్లార్చి.. పుల్లని మజ్జిగ కలిపి, ఈ పొడి వేసి..
►ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ 100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి, మూడింటినీ కలిపి తగినంత ఉప్పు కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి.
►ఎండలో తప్పనిసరి అయి బయటకు వెళ్లేటప్పుడు... ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అందులో రెండుగ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి.
►ఇందులో పంచదార, ఉప్పు బదులుగా పైన చెప్పుకున్న మిశ్రమాన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగండి, వడదెబ్బ కొట్టదు, పేగులకు బలాన్నిస్తుంది, జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తుంది, వేసవిలో కలిగే జలుబుని నివారిస్తుంది, 

►సాధ్యమైనంత వరకు మజ్జిగని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల ఇందులో ఉండే మేలు చేసే బాక్టీరియా నిరర్థకం అవుతుంది, అదేవిధంగా ప్యాక్‌ చేసిన మజ్జిగ బదులు అప్పటికప్పుడు తయారు చేసుకున్న తాజా మజ్జిగ తాగడం ప్రయోజనకరం. బయటకు వెళ్లినప్పుడు శీతల పానీయాల బదులు కనీసం ప్యాక్‌ చేసిన మజ్జిగ తాగినా ఫరవాలేదు.  
నోట్‌: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కొరకు మాత్రమే!

చదవండి: Beauty Tips: కుంకుమ పువ్వు, రోజ్‌ వాటర్‌తో ఐస్‌క్యూబ్స్‌.. పిగ్మెంటేషన్‌కు చెక్‌! ముఖం మెరిసేలా..

మరిన్ని వార్తలు