Summer Health Tips: మితిమీరి ఐస్‌క్రీములు తింటే.. ఇక అంతే! ఈ సమస్యలు తప్పవు

1 Apr, 2022 15:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వేసవిలో ఐస్‌క్రీములు, కూల్‌డ్రింకుల కోసం చాలామంది ఆరాటపడుతుంటారు. ఇవన్నీ ఎండ ధాటి నుంచి తక్షణ ఉపశమనం కలిగించవచ్చునేమో గాని, దీర్ఘకాలంలో వీటివల్ల రకరకాల అనర్థాలు, ఆరోగ్య సమస్యలు తప్పవు. మితిమీరి ఐస్‌క్రీములు తింటే దీర్ఘకాలంలో స్థూలకాయం, మధుమేహం వంటివి తప్పవు. వీటికి తోడు రసాయనాలు కలిసిన కూల్‌డ్రింకులు తాగితే, ఈ సమస్యలకు తోడు పేగుల్లో సమతుల్యత దెబ్బతిని, జీర్ణకోశ సమస్యలూ తలెత్తే ప్రమాదం లేకపోలేదు.

అందువల్ల వేసవిని చల్లగా గట్టెక్కేయాలంటే చక్కగా మన పెద్దలు చెప్పిన మార్గాన్నే అనుసరించడం ఎంతైనా క్షేమం. ‘పెద్దలమాట చద్దిమూట’ అని ఊరకే అనలేదుగా మరి! అసలు వేసవిలో చద్దన్నానిదే అగ్రస్థానం. వేసవిలో ఉదయంపూట వేడివేడిగా తినే నానా రకాల అల్పాహారాల కంటే చల్లగా చద్దన్నం తినడమే శ్రేష్ఠం. భారత ఉపఖండంలోను, దక్షిణాసియా దేశాల్లోను చద్దన్నం తినడం తరతరాల అలవాటు. వేర్వేరు ప్రాంతాల్లో చద్దన్నాన్ని వేర్వేరు పేర్లతో పిలుచుకుంటారు.

ఇందులోనే చిన్న చిన్న మార్పులతో రకరకాల రుచులను తయారు చేసుకుంటారు. తమ తమ స్థానిక వంటకాలను ఇందులో నంజుకుంటారు. ఇక వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కొబ్బరినీరు, నిమ్మరసం, మజ్జిగ వంటి పానీయాలను సేవించడం దేశవ్యాప్తంగా చిరకాలంగా ఉన్న అలవాటే. కాబట్టి ఐస్‌క్రీములు, కూల్‌డ్రింక్స్‌ జోలికి పోకుండా ఎంచక్కా వీటితో ఆరోగ్యకర రీతిలోనే భానుడి ప్రతాపం నుంచి విముక్తి పొందండి.

చదవండి: Lemon Juice: నిమ్మరసంలో పంచదార కలుపుకొని తాగుతున్నారా? అయితే

మరిన్ని వార్తలు