Summer Tips-Bellam Panakam: పానకంలో ఏలకులు, మిరియాలు, అల్లం వంటివి చేర్చితే!

28 Mar, 2022 10:16 IST|Sakshi

Bellam Panakam: సంప్రదాయ వేసవి పానీయాల్లో పానకానిది ప్రత్యేక స్థానం. ఇది అచ్చమైన తెలుగు పానీయం. బెల్లంతో తయారు చేసే పానకాన్ని పూజల్లో నైవేద్యంగా కూడా పెడతారు. ముఖ్యంగా వేసవి ప్రారంభంలో వచ్చే శ్రీరామనవమి రోజున రాములవారికి వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ.

ఇక బెల్లం పానకంలో ఏలకులు, మిరియాలు, అల్లం వంటివి చేర్చడం వల్ల పానకానికి అదనపు రుచి వస్తుంది. వేసవితాపం నుంచి ఉపశమనం కలిగించే పానకం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. తెలుగువారి పానకం మాదిరిగానే ఒడియా ప్రజలు ‘పొణా’ అనే పానీయాన్ని తయారు చేస్తారు.

ఒడియా ప్రజల నూతన సంవత్సరం మేష సంక్రాంతి రోజున వస్తుంది. ఆ రోజున వీధి వీధినా చలివేంద్రాలను ఏర్పాటు చేసి, జనాలకు ఉచితంగా ‘పొణా’ను పంచిపెడతారు. అందువల్ల ఈ పండుగను ‘పొణా సంక్రాంతి’ అని కూడా అంటారు. ‘పొణా’ తయారీలో ప్రధానంగా నవాతుబెల్లాన్ని ఉపయోగిస్తారు.‘పొణా’లో పచ్చిమామిడి ముక్కలు, కొబ్బరికోరు, అరటిపండు ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్‌ వంటివి కూడా చేరుస్తారు. ‘పొణా’ సేవనంతోనే ఒడియా ప్రజలు వేసవికి స్వాగతం పలుకుతారు. 

చదవండి: Bad Habits: వాష్‌రూమ్‌ వాడి సరిగ్గా నీళ్లు కొట్టరు.. ఎలా చెప్తే మారతారు మగాళ్లు?

మరిన్ని వార్తలు