Summer Tips: వేసవిని ఇలా గడిపేయండి.. అల్పాహారంగా ఆవిరి కుడుములు, ఇడ్లీ తీసుకుంటే!

7 May, 2022 13:33 IST|Sakshi

చిన్న జాగ్రత్తలతో మేలోనూ ఎండలు మేలే!

Summer Care- Tips In Telugu: చిన్నారులకు సెలవుల పండుగ వచ్చేసింది... టీచర్లకు కూడా కాస్త విరామం దొరికింది. కాకపోతే ఇంట్లో పెద్దవాళ్లే ఈ సిసింద్రీలతో వేగేదెలాగా... అని తలలు పట్టుకుని కూచుంటున్నారు. ఇంతకీ వేసవి అంటే మండే ఎండలూ, వడగాడ్పులేనా? 

చల్లటి తాటి ముంజలు, ఘుమ ఘుమలాడే మల్లెపూల పరిమళాలు, తియ్యటి మామిడి పళ్లు కాదా? ఇంకా సీమచింత కాయలు... కుండనీళ్ల చల్లదనం, సుగంధ పానీయాలు, చెరుకు రసాలు... ఊర్లు, టూర్లు... ఇవన్నీ కూడా వేసవి ఆనందాలే కదా! అందువల్ల ఎండలను తిట్టుకోవడం మాని ఎంజాయ్‌ చెయ్యండి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మే లోనూ వేసవి మేలుగానే అనిపిస్తుంది. సమ్మర్‌ను ఎలా గడిపితే బాగుంటుందో అవగాహన కోసం...

నిప్పులు కక్కుతున్న సూరీడు పగలంతా ఎంత మండిపోతే మాత్రం.. భయపడేదెవరు? బండెడు హోమ్‌ వర్కు లేదు, ఇక కొన్ని రోజులపాటు సెలవులేనన్న భావనే.. చిన్నారుల్లో నూతనోత్తేజం కల్పించి ఉత్సాహంతో ఉరకలేయిస్తుంది. వాళ్ల పరుగులు, ఆటలు చూస్తుంటే పెద్దవాళ్లకు ఒక పక్క మురిపెంగానూ, మరోపక్క కాస్తంత గాభరాగానూ ఉంటుంది ఎండల నుంచి వీరిని కాపాడేదెలా అని... అయితే చిన్న జాగ్రత్తలతో సరైన ప్లానింగ్‌ ఉంటే అంత కంగారేమీ అక్కరలేదు. 

అప్పట్లో అయితే...
వేసవి సెలవులు వస్తున్నాయంటే నెలరోజుల ముందునుంచే పల్లెపట్టుల్లోని పెద్దలు, ఇంటికి వచ్చే బంధువుల కోసం సరంజామా సిద్ధం చేసుకునేవారు. సెలవుల్లో అంతా కలుసుకోవడం, విభిన్న మనస్తత్వాలున్న వారంతా ఒక్కచోటకు చేరడం, ఇష్టాయిష్టాలు పక్కనపెట్టి కష్టసుఖాలు కలబోసుకోవడం,  పెద్దలపై గౌరవంతో రాజీపడి సెలవులు గడిపేయడం లో మజాను మాటల్లో చెప్పలేం. 

పిల్లల ఆటల అల్లరి, వారిని కాపుకాయలేక పెద్దలు పడే అవస్థలు, తాతల ఆంక్షలు, చిన్నారులకు వత్తాసు పలికే అమ్మమ్మ, నానమ్మల మురిపాలు వేసవి ముచ్చట్లే. మండుటెండలు భయపెడుతూంటే మధ్యాహ్నపు వేళ పిల్లల్ని ఇంటిపట్టునే ఉండేట్లు చేయడంలో పెద్దలు తీసుకునే జాగ్రత్తలు వారిపై ఉండే మమతానురాగాలను వెల్లడిస్తాయి.

కుండలో నీళ్లు, తరవాణి జలాలు దాహం తీర్చి, వడదెబ్బను ఢీకొట్టడంలో తిరుగులేనివే. ఎండలు తెచ్చే కష్టాలను వల్లెవేసి, వాటి పరిష్కారానికి చిట్కాలు చెప్పే పెద్దలు ఇప్పుడు తగ్గిపోయారు. వినే ఓపికా ఇప్పటి తరానికి లేదు. అలాగని ఈ మార్పును తప్పు బట్టలేం. ఆధునిక వైద్యం, మేలైన విధానాలు అందుబాటులోకి వచ్చాక చిట్కాలకు విలువ తగ్గింది. 

కానీ, చిట్కా వైద్యంలో అనురాగ బంధం కలగలసి పోవడంవల్ల ఆ రోజుల్లో చికిత్స బ్రహ్మాండమైన ఫలితాన్నిచ్చేది. సెలవుల్లో ఎక్కువమంది ఒకచోట చేరడం వల్ల విభిన్న మనస్తత్వాల గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది. సమస్యలు, చికాకులు, సర్దుబాట్లు, మానవ సంబంధాల పట్ల అవగాహన కలిగేవి. అందరూ కలసి ఉండటానికి కొన్ని కుటుంబాలు సిద్ధమైతే ఎండలు ఎంత వేధించినా అంతా కలసి తీర్థయాత్రలు, విహార యాత్రలకు వెళ్లడం మరికొందరికి అలవాటు. ఆర్థికంగా ఉన్నా లేకపోయినా... అభిమానం ఉన్న కుటుంబాలన్నీ ఇలా వేసవిని వినోదంగా మార్చుకోవడం తెలుగుగడ్డపై కన్పించే వేడుక. 

కంప్యూటర్లలో గేమ్‌లు, వీడియో ఆటలు, ఫోన్‌ చాటింగ్‌లు, సోషల్‌ మీడియాలో ఊసులు కాలక్షేపం కలిగిస్తాయేగానీ అసలు ప్రపంచం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలుసుకునే వెసులుబాటునివ్వవు. నలుగురితో కలవడం, నలుగురిలో నెగ్గుకురావడం ఈ ప్రపంచం నేర్పదు. అందుకే చిన్నారుల్లో మానసిక పరిపక్వత, మనోనిబ్బరం పెంచేందుకు ఒకప్పుడు సెలవులు ఉపయోగపడేవి. 

ఇప్పుడంత తీరిక వారికి చిక్కడం లేదు. లోకాన్ని అర్థం చేసుకునే నేర్పు పిల్లలకు కలగాలంటే వారు నలుగురిలోకి వెళ్లాలి. కుటుంబ బాంధవ్యాలు బలపడాలి. చదువుతోపాటు లోకజ్ఞానం ఉంటే ఆ చిన్నారి భవిష్యత్‌కు ఢోకా ఉండదు.

ఇవి అవసరం...
సెలవుల్లో యాత్రలు చేస్తే మంచిది. ఓ పార్కుకు వెళితే మొక్కల గురించి పిల్లలకు చెప్పాలి. ఓ జంతు ప్రదర్శనశాలకు వెళితే జంతువులు, పక్షులు, ఇతర జీవజాతులను ప్రత్యక్షంగా చూసిన అనుభవం వస్తుంది. పిల్లల్ని జూకు తీసుకువెళ్లాలి. 

మొక్కలకు నీళ్లుపోయడం, అవి పెరుగుతున్న విషయాన్ని వారికి వారుగా గుర్తించి చెప్పడంలో వాళ్లకి దొరికిన ఆనందం ఏ శిక్షణ శిబిరంలోనూ లభించదు. కొత్తకొత్త ప్రాంతాలకు తీసుకువెళితే ఆయా ప్రాంతాలపై అవగాహన కలుగుతుంది. అదే ఓ ప్లానెటోరియం కు తీసుకువెళితే కళ్లముందు ఖగోళం సాక్షాత్కరిస్తుంది. అక్కడ ఓ గంటసేపు ప్రదర్శన చూస్తే అంతరిక్షం, నక్షత్రాలు, గ్రహాలపై కనీస అవగాహన కలుగుతుంది. 

మానసిక, వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పేది ఇదే. కొత్తవిద్యలు నేర్పించడం మంచిదే..కానీ ముందు మనసుకు చురుకుదనాన్ని ఇచ్చేదేమిటో కనిపెట్టి, అది పిల్లలకు అందించాలని చెబుతున్నారు.

సృజనకు పదును
►చిన్నారులకు ఏం ఇష్టమో కనిపెట్టి వారికి అందులో అవకాశం కల్పించాలి. వారి అభినివేశాన్ని గమనించి సృజనకు పదునుపెట్టాలి. బొమ్మలు వేయడం, పాటలు పాడటం, ఆటలు ఆడటం, కథలు చెప్పడం, కథలు వినడం.., చిన్నచిన్న పక్షులు, జంతువులను పెంచడం వంటివి అలవాటు చేయాలి. పంటపొలాలు, నదులు, సాగరతీరాలకు తీసుకువెళితే పిల్లలకు కలిగే ఆనందం అదుర్సే కదా! 
►పిల్లల ఇష్టాలను బట్టి వారికి ఆయా అంశాల్లో ప్రవేశం కల్పించాలి. వారిని స్వేచ్ఛగా వదిలేయాలి. అవసరమైనప్పుడు మాత్రమే జోక్యం చేసుకుని దారికి తెచ్చుకోవాలి. పిల్లలకు ఆటవిడుపునివ్వాలి.
►పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే దిశగా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. మహనీయుల జీవిత కథలు చెప్పి వారిలో స్ఫూర్తినింపాలి. నీతికథలు, శతకాలు బోధించాలి. సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం, పరిరక్షణకు తమ వంతు సహకారం అందించడం వంటి అంశాలను వివరించాలి. ఇతరులకు సాయం చేయడంలో ఉన్న ఆనందం గురించి అర్ధమయ్యేలా చెప్పాలి. తమ పనులు తామే చేసుకోవడం, పనుల్లో సాయపడటం, మొక్కల పెంపకం, క్విజ్‌ వంటి వాటిపై వారి దృష్టి మళ్లించాలి.
ఇలా చేస్తే మండే మే ఎండలు కూడా ఎంతో మేలు చేస్తాయి. 

ఆహారం విషయంలో జాగ్రత్తలు
►వేసవిలో ఆయిల్‌ ఫుడ్స్‌ కి దూరంగా ఉండాలి. 
►ఇంటి వంటలలో కూడా నూనె వాడకం తగ్గించాలి.
►ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా కూరలు తగ్గించాలి.
►అల్పాహారంగా ఆవిరి కుడుములు, ఇడ్లీ వంటివి తీసుకుంటే మేలు.
►కర్భుజా, పుచ్చకాయలు, ఈత కాయలు, తాటి ముంజలు వంటి సీజనల్‌ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది.
►కాఫీ, టీ లకు బదులు రాగి జావ, కూల్‌ డ్రింకులు బదులుగా కొబ్బరి నీరు తాగాలి. 
►పలచని మజ్జిగలో నిమ్మ రసం, ఉప్పు కలిపి పిల్లలు, పెద్దలు అందరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
►వట్టి వేర్ల తెరలను తడిపి కిటికీలకు, గుమ్మాలకు కట్టుకుంటే వేడిని ఇంట్లోకి రానీయకుండా చల్లగా ఉంచుతుంది.
►పిల్లల చేత కంప్యూటర్‌ గేమ్స్‌ కాకుండా చదరంగం, క్యారమ్‌ బోర్డ్, పరమపద సోపాన పటం, ట్రేడ్, లూడో వంటివి ఆడించాలి.

చదవండి👉🏾Barley Water Health Benefits: బార్లీ నీళ్లు.. అద్భుత ప్రయోజనాలు.. రోజూ గ్లాసుడు తాగారంటే!
చదవండి👉🏾Oral Health Tips: నోటి దుర్వాసనకు చెక్‌! లవంగాలను తరచూ చప్పరిస్తున్నారా.. అయితే

మరిన్ని వార్తలు