Sumukhi Suresh: 30 వేల జీతం.. జీవితం బాగానే సాగేది.. కానీ నవ్వించడంలో..

22 Sep, 2021 10:20 IST|Sakshi

హాస్య వల్లి ఈ సుముఖి! 

చూడగానే ఆకర్షించే రూపం లేదు గానీ తను ఏడ్చినా, కోప్పడి కన్నెర్ర చేసినా చూసినవారు శెభాష్‌ అనకుండా ఉండలేరు. ఆకృతి కాస్త భారీగా ఉన్నప్పటికీ అనర్గళంగా మాట్లాడుతూ .. వీక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తు్తంది. హాస్యనటులు అనగానే దాదాపు పురుషుల పేర్లు వినపడే ఈ రోజుల్లో స్టాండప్‌ కామెడీతో ఆడియన్స్‌ను ఆకట్టుకుని వెబ్‌ సిరీస్, యూట్యూబ్‌ సిరీస్‌తో కడుపుబ్బా నవ్విస్తోంది పుష్పవల్లి అలియాస్‌ సుముఖి సురేష్‌.

సుముఖి సురేష్‌ కంటే పుష్పవల్లిగా బాగా పాపులర్‌ అయిన సుముఖి ప్రముఖ డిజిటల్‌ కమేడియన్‌. నాగపూర్‌లో పుట్టి పెరిగిన సుముఖి చెన్నైలోని ఎమ్‌ఓపీ వైష్ణవ్‌ కాలేజీ ఫర్‌ ఉమెన్స్‌లో మైక్రోబయాలజీ, ఫుడ్‌ సేఫ్టీలో డిగ్రీ చదివింది. డిగ్రీ అయ్యాక 2009లో బెంగుళూరు వెళ్లి అక్కడ పిల్లల లైబ్రరీలో కొన్నాళ్లు పనిచేసింది. తరువాత ఐటీసీ రాయల్‌ గార్డెనియాలో చెఫ్‌గా పనిచేసింది. ఫుడ్‌ లేబొరేటరీలో పనిచేస్తున్న సమయంలో జోక్స్‌ వేస్తూ అందరినీ అలరిస్తుండేది.

నెలకు 30 వేలరూపాయల జీతం, ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు పనివేళలతో జీవితం హాయిగానే సాగుతోంది. ఈ క్రమంలో సుముఖి అప్పుడప్పుడు సరదాగా యూ ట్యూబ్‌లో కామెడీ స్కెచెస్‌ చేసేది. వీటికి మంచి స్పందన లభించడంతో మరిన్ని వీడియోలు చేస్తుండేది. అయితే ఒకపక్క ఉద్యోగం... మరోపక్క కామెడీ వీడియోలతో కష్టంగా ఉండేది. దీంతో ఉద్యోగం వదిలి కామెడీనే ఫుల్‌ టైమ్‌ కెరియర్‌గా మార్చుకుంది.  

స్టాండప్‌ కమేడియన్‌ 
సుముఖి తన మొత్తం సమయాన్ని హాస్యానికే కేటాయించి 2013 నుంచి పలు షోలలో కామెడీ చేయడం ప్రారంభించింది. తన టీమ్‌తో కలిసి బెంగళూరు, దుబాయ్, ముంబై, హైదరాబాద్, స్వీడన్‌లలో వంద షోలను చేసింది. ఇండియాలోనే తొలిసారి మాక్యుమెంటరీ యూట్యూబ్‌ సిరీస్‌ను ప్రారంభించిన ఎన్జీవో ‘‘బెటర్‌ లైఫ్‌ ఫౌండేషన్‌’’ నిర్వహించే.. షోలలో పాల్గొని అనేక ఎపిసోడ్‌లలో కామెడీని పండించి సుముఖి మంచి పాపులారిటీని పొందింది. దీని తరువాత ‘బేథీనాక్‌’ సిరీస్‌ బాగా పాపులర్‌ అయ్యింది. కామెడీని కెరియర్‌గా మార్చుకున్న సుముఖి అను ఆంటీ, సుముఖీ చావ్లా క్యారెక్టర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

పుష్పవల్లి 
బేథీనాక్, బెటర్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ కామెడీ తరువాత తనే స్వయంగా ‘‘డిస్‌గస్ట్‌ మి’’ పేరిట స్టాండప్‌ కామెడీ షోను చేయడం ప్రారంభించింది. అమేజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ‘పుష్పవల్లి’ సీజన్‌ 1, 2లను సుముఖియే స్వయంగా రాసి, పుష్పవల్లి క్యారెక్టర్‌లో జీవించేయడంతో బాగా పాపులర్‌ అయ్యింది. సీజన్‌ వన్‌లో పుష్పవల్లి ప్రేమలో పడడం అది ఎలా బ్రేకప్‌ అయిందో ఉంటుంది. రెండో సీజన్‌లో పుష్పవల్లి తన లవర్‌పై పగతీర్చుకునే తీరును వర్ణించిన తీరు అద్భుతం. రెండు సీజన్‌లలో పుష్పవల్లి పాత్ర కనిపిస్తే చాలు నవ్వు ఆపుకోలేకపోయినంతగా ఆకట్టుకుంది.

ఇదేగాకుండా కన్నడ సినిమా ‘హంబుల్‌ పొలిటీషియన్‌ నొగరాజ్‌లో కూడా నటించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలైన ‘‘బ్యూటీ అండ్‌ ది ఫీస్ట్‌’’, ‘‘బనాకే దిఖా’’, ‘‘లస్ట్‌ స్టోరీస్‌’’ వంటివాటిని క్రియేట్‌ చేసి దానిలో సుముఖి నటించింది. వీటితోపాటు అమెజాన్‌ ఒరిజినల్‌ ‘‘కామిక్‌స్థాన్‌’’లో అతిథిగా, జడ్జిగా పాల్గొంది. ఈ మధ్యకాలంలో ‘‘డోంట్‌ టెల్‌ అమ్మా’’ స్టాండప్‌ కామెడీని విడుదల చేసింది. ‘‘నోటరీ’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ను నిర్మిస్తోంది. అంతేగాక  ‘ఇస్తాంబుల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’లో పుష్పవల్లి బెస్ట్‌ డైరెక్టర్, బెస్ట్‌ ఫిమేల్‌ యాక్టర్‌ అవార్డులను గెలుచుకుంది. 

 ‘‘మనం అందంగా లేమని, మనం ఎవరికీ నచ్చమని బాధపడేకంటే మనకున్న గుణాలు, తెలివితేటలతో కష్టపడి పనిచేస్తే గుర్తింపు దానంతట అదే వస్తుంది. కామెడీ ఎవరి సొంతం కాదు. వీక్షకులను హాస్యంతో ఆకట్టుకోవడమే ముఖ్యం’’ అని సుముఖి చెబుతోంది. ఇండియాలో ఉన్న ప్రముఖ కమేడియన్‌లలో ఫాలోవర్స్‌తోపాటు అధిక మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తోన్న జాబితాలో ఆమె ఉండడం విశేషం. ఒకపక్క వెబ్‌సిరీస్‌లో కామెడీని పండిస్తూనే, మరోపక్క స్టాండప్‌ కామెడీ, యూ ట్యూబ్, ఇన్‌స్టాగామ్‌లలో కామెడీ వీడియోలతో లక్షల మందిని అలరిస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది.  

చదవండి: ఇళ్లు లేని విద్యార్థులకు ఏకంగా 150 ఇళ్లు కట్టించన టీచర్‌.. ఎక్కడంటే..

>
మరిన్ని వార్తలు