సోల్‌ ట్రేడ్‌..: ఉత్తమ అత్తాకోడళ్లు

5 May, 2022 01:18 IST|Sakshi

చెన్నైలోని ఎస్‌ఆర్‌యం యూనివర్శిటీలో ఇంజినీరింగ్‌ చేస్తున్న రోజుల్లో సురభి సొంత వ్యాపారం గురించి కల కనేది. నిజానికి ఆమెది వ్యాపారనేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ, తన ఆలోచనకు కుటుంబసభ్యులు పెద్దగా మద్దతు ప్రకటించలేదు. ‘ఉద్యోగం చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు. కాలం కలిసొస్తే అమెరికా వెళ్లి స్థిరపడిపోవచ్చు. వ్యాపారం చేయడమనేది పెద్ద రిస్క్‌. అందరికీ అది సాధ్యం కాదు’ అంటుండేవారు. అంతమాత్రాన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు సురభి.

నిర్మాణ్‌ షాతో వివాహం అయిన తరువాత ఆమె ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌)కు వెళ్లింది. అక్కడ అత్త రూపంలో తనకొక ‘అదృష్టం’ పరిచయం అయింది. అత్త చేత్న షా తనతో ఒక స్నేహితురాలిలా ఉండేది. అత్తగారితో తన ఆలోచన పంచుకుంది సురభి. ‘ఎందుకమ్మా రిస్క్‌’ అని అత్తగారు అనలేదు. కోడలి ఉత్సాహానికి మరింత ప్రోత్సాహం ఇచ్చింది. అలా ‘కారాగ్రీన్‌’స్టార్టప్‌కు అంకురార్పణ జరిగింది.

ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల జరిగే నష్టాల గురించి పుస్తకాల్లో చదవడమే కాదు, ఆ విషాదాన్ని కళ్లతో చూసింది సురభి. ‘ఎవరికి వారు ఇది నా సమస్య కాదు. ఎవరో వస్తారు. ఏదో చేస్తారు అనుకుంటే సమస్య మరింత పెరుగుతుంది తప్ప తగ్గదు. అందుకే నా వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచనలో నుంచి వచ్చిందే కారాగ్రీన్‌’ అంటుంది సురభి.
‘కారాగ్రీన్‌’ అనేది బయోడిగ్రేడబుల్‌ అంకుర సంస్థ. పర్యావరణహితమైన పెన్నులు, పెన్సిల్స్, సీడ్‌ పేపర్‌ డైరీలు, క్యాలెండర్లతో పాటు ప్యాకింగ్‌ సామాగ్రిని తయారు చేస్తారు.

ఊహల్లో ఉన్న ప్రాజెక్ట్‌ కాగితం మీదికి రావడానికి, అక్కడి నుంచి వాస్తవరూపం దాల్చడానికి మధ్యలో సందేహాలు, సమస్యలు, అవాంతరాలు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో కోడలికి అండగా నిలిచి ముందుకు నడిపించింది చేత్న షా. ‘వ్యాపారంలో మన కుటుంబసభ్యుల అండ అనేది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది’ అంటుంది సురభి.

కట్‌ చేస్తే...
షార్క్‌ ట్యాంక్‌ ఇండియా (బిజినెస్‌ రియాలిటీ టెలివిజన్‌ సిరీస్‌)లో ‘కారాగ్రీన్‌’ 50 లక్షల ఫండింగ్‌ ఆఫర్‌ను గెలుచుకుంది.

మరిన్ని వార్తలు