Surat Old Couple Inspirational Story: కూతురి జుట్టు బాగా ఊడిపోవడం చూసి... ఇంటర్నెట్‌లో వెదికి.. వృద్ధ దంపతులు!

25 May, 2022 14:20 IST|Sakshi

వయసు కాదు... సాధించామా లేదా చూడండి!

ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడూ ఏదోఒక సమస్య వస్తూనే ఉంటుంది. వాటిని ఎదిరించి నిలబడి పోరాడేవాళ్లే ముందుకు సాగగలుగుతారు. కొంతమంది సమస్యను కూకటివేళ్లతో పెకిలించి భవిష్యత్‌ తరాల వాళ్లకు ఆదర్శంగా నిలుస్తుంటారు. ఓ వృద్ధజంట ఈ జాబితాలో నిలిచారు.

తమ కూతురికి వచ్చిన సమస్యను వేర్లతో సహా పీకేయడానికి ఎనభై ఏళ్ల వయసులో ఈ  జంట నడుం బిగించి, ఏకంగా హెయిర్‌ ఆయిల్‌ స్టార్టప్‌ను ప్రారంభించి ఔరా అనిపిస్తోంది.

‘‘మీలో శక్తి ఉంటే వయసు గురించి ఆలోచించకండి. మీకిష్టమైన దానిని సాధించే వరకు పోరాడండి’’ అని చెబుతున్నారు సూరత్‌కు చెందిన రాధాకృష్ణ, శకుంతలా చౌదరి దంపతులు. దాదాపు యాభైఏళ్లపాటు కుటుంబ వ్యాపారాలు చూసుకుని 2010లో రిటైర్‌ అయ్యారు ఈ ఇద్దరు. ఈ వయసులో వీరికి ఏమాత్రం ఓపిక తగ్గలేదు. ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా.. సమస్యకు సై అని సవాలు విసురుతూ పరిష్కారం చూపుతున్నారు. 

ఈ చౌదరి దంపతుల కూతురి జుట్టు బాగా ఊడిపోయింది. రకరకాల ప్రయత్నాలు చేసినా జుట్టు రాలడం మాత్రం తగ్గలేదు. దీంతో తన బాధను తల్లిదండ్రుల దగ్గర వెళ్లబోసుకుంది. కూతురి బాధను చూడలేని ఆ దంపతులు అసలు జుట్టు ఎందుకు రాలుతుంది? దానికి గల కారణాలు ఏంటీ? అని ఏడాదిపాటు నెట్‌లో వెదికారు. వెదుకులాటలో అనేక అధ్యయనాలు, పరిశోధన పత్రాలు లోతుగా అధ్యయనం చేయగా...

‘‘పురుషులలో అయితే డైహైడ్రోటెస్టోస్టిరాన్‌ అనే ఆండ్రోజన్, స్త్రీలలో ఈస్ట్రోజెన్‌ స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఉండడవల్ల జుట్టు రాలే సమస్య ఎదురవుతుంది’’ అని గ్రహించారు. ఈ రెండు హార్మోన్లను సక్రమంగా పనిచేయించే పదార్థాల కోసం ఇంటర్నెట్‌ను క్షుణ్ణంగా జల్లెడ పట్టారు. వారు దొరికిన సమాచారంతో... వారే ఒక సరికొత్త ఆయిల్‌ను తయారు చేయడానికి పూనుకున్నారు.

యాభై రకాలతో... 
అనేక పరిశోధనల తరువాత ఈ వృద్ధ జంట యాభై రకాల మూలికలు, కొబ్బరినూనె, నువ్వుల నూనె, ఆలివ్, ఆముదంలను ఉపయోగించి కోల్డ్‌ ప్రెస్డ్‌ పద్ధతిలో హెయిర్‌ అయిల్‌ను రూపొందించింది. వీటన్నింటిని కలిపి ఆయిల్‌ తయారు చేసిన వీరు..తమ కూతురుకిచ్చి వాడమన్నారు.

ఆ ఆయిల్‌ వాడిన దగ్గర నుంచి జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం కనిపించింది. దీంతో తాము రూపొందించిన ఆయిల్‌ బాగా పనిచేస్తుందని అర్థమైంది చౌదరి దంపతులకు. ఆ తరువాత బంధువులు, స్నేహితులు కొంతమందికి ఆయిల్‌ ఇచ్చి వాడమన్నారు. వాడిన వారందరికి మంచి ఫలితం కనిపించింది.  

అవిమీ... 
మూడు నెలలపాటు ఆయిల్‌ను పరీక్షించి, ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో అవిమీ హెర్బల్‌ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించారు. అవిమీ ద్వారా ఎంతో నాణ్యమైన నూనెను విక్రయిస్తూ ఎంతోమంది జుట్టు సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు ఈ దంపతులు. ఇదేగాక ఆర్థో ఆయిల్, స్ప్రేలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

భవిష్యత్‌లో మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మలివయసులోనూ ఇంత బాగా ఆలోచించి సమస్యకు చక్కని పరిష్కారం చూపి ఎంతోమంది యువతరానికి ప్రేరణ ఇవ్వడమేగాక, చిన్నపెద్దా అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ జంట.

గమనిక: ఈ వృద్ధ జంట ప్రయత్నాన్ని ఒక స్ఫూర్తిదాయక కథనంగా మాత్రమే అందించడం జరిగింది.

చదవండి👉🏾Youtube Village: ఘుమఘుమలాడే బిర్యానీ, చేపలు సులభంగా ఎలా పట్టాలి? వీటన్నింటికీ సమాధానం!

మరిన్ని వార్తలు