Vitamin C: తక్కువైతే తంటా.. ఎక్కువైతే మంట!

28 Jun, 2021 13:08 IST|Sakshi

కరోనా వైరస్‌ మహమ్మారి ఎంతో మందిని బలి తీసుకుంటోంది. పైగా వైరస్‌లో కొత్త వేరియంట్స్ పుట్టుకొస్తూ మనిషికి కునుకు లేకుండా చేస్తోంది. కేసులు తగ్గినంత మాత్రాన అశ్రద్ధ ఉండొద్దని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే అప్రమత్తం అవుతున్నాయి. ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి కనీస జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని అంటున్నారు. ఇక  వీటితోపాటు వ్యాయామం చేస్తూ.. సరైన పోషకాలు శరీరానికి అందేలా చూసుకోవాలి.  అయితే విటమిన్-సీ.. మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రకరకాల వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. మరి విటమిన్-సీ వల్ల కలిగే ప్రయోజనాలు.. నష్టాలను ఓసారి తెలుసుకుందాం.

హృదయం పదిలం:
గుండె జబ్బులు పెరగడానికి ప్రదాన కారణం అధిక బరువు. చెడు కొలెస్ట్రాల్‌ స్థాయి పెరిగి అది క్రమంగా వివిధ రకాల జబ్బులకు దారి తీస్తుంది. అయితే విటమిన్‌ సి తీసుకుంటే బరువును నియంత్రిస్తుందని పలు పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఇది గుండె జబ్బులను అరికడుతుందని నిపుణులు అంటున్నారు.  బరువు పెరిగే వారికి సహజంగానే పొట్ట వస్తుంది. పొట్ట పెరుగుతూ ఉంటే... బరువు కూడా పెరుగుతారు. దీనంతటికీ కారణం... బాడీలో సరిపడా విటమిన్-సీ లేకపోవడమే అంటున్నారు పరిశోధకులు.

జ్ఞాపకశక్తికి శ్రీరామ  రక్ష:
మెదడు, వెన్నెముక, నరాల దగ్గర ఉన్న ఆక్సీకరణ ఒత్తిడి జ్ఞాపకశక్తి లోపాలను పెంచుతుంది. విటమిన్-సీ బలమైన యాంటీ ఆక్సిడెంట్ కావడం వల్ల మెదడు ఆలోచన, జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని పెంపొదిస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.

ఐరన్‌ లోపం నియంత్రణ: 
ఐరన్‌ ఒంట్లో తగినంత లేకపోతే శరీరం చతికిల పడిపోతుంది.  హిమోగ్లోబిన్, మయోగ్లోబిన్‌ అనే ప్రోటీన్ల తయారీకిది అత్యంత అవసరం. హార్మోన్లు, కండర బంధనాలు, ఇతర అనుసంధాన కణజాలాల తయారీకి సైతం ఐరన్‌ తోడ్పడుతుంది. అయితే విటమిన్‌ సీ ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఐరన్‌ లోపం నుంచి బయటపడవచ్చని నిపుణలు పేర్కొంటున్నారు.

గౌట్ వ్యాధికి అడ్డుకట్ట: 
రక్తంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నప్పుడు గౌట్ వ్యాధి సంభవిస్తుంది. ఈ యాసిడ్ కీళ్ళ మధ్యలో సూది వంటి స్పటికాలను ఏర్పరుస్తుంది. దీంతో ఆ ప్రాంతం ఎరుపెక్కడం, తీవ్రమైన నొప్పి, కీళ్ళవాపులకు కారణమవుతుంది. ఈ గౌట్ వ్యాధి ఎక్కువగా కాలి పెద్ద బొటనవేలు దగ్గర సంభవిస్తుంది. అలాగే చేతివేళ్ళు, మణికట్టు, మోకాళ్లలో కూడా సంభవించవచ్చు. కాగా, విటమిన్ సి యూరిక్ ఆమ్లం రక్త స్థాయిలను తగ్గించి, గౌట్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని న్యూట్రీషియన్‌లు చెబుతున్నారు.

వాయు కాలుష్యం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలకు చెక్‌:
బహిరంగ ప్రదేశాల్లో వాయు కాలుష్యం ఉబ్బసం వంటి అనేక శ్వాస సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అయితే విటమిన్-సీ యాంటీ ఆక్సిడెంట్స్‌గా మారి ఫ్రీ రాడికల్స్ అని పిలిచే హానికరమైన అణువుల నుంచి  శరీరాన్ని రక్షిస్తుంది. వాయు కాలుష్యం  ఊపిరితిత్తులలోకి ప్రవేశించినప్పుడు గుండె జబ్బులు, క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులకు దారి తీస్తుంది. అయితే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను బంధించి వాటితో పోరాడుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

విటమిన్‌-సీ దుష్ప్రభావాలు:
ఏదైనా తక్కువగా తీసుకోవడం, అధికంగా తీసుకోవడం రెండూ హానికరమే. విటమిన్-సీ అధికంగా ఉండటం వల్ల వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, ఛాతీలో మంట, తలనొప్పి, నిద్రలేమి వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. విటమిన్‌-సీ ని అధికంగా తీసుకుంటే జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. అంతే కాకుండా విటమిన్‌ సీ ఐరన్‌ను పెంచుతుంది. కాబట్టి ఇది ఎక్కువైతే హిమోక్రోమాటోసిస్ అనే వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. ఇక విటమిన్-సీ శరీరం నుంచి మూత్రం ద్వారా ఆక్సలేట్ గా విసర్జించబడుతుంది. కొన్ని పరిస్థితులలో, ఆక్సలేట్ ఖనిజాలతో బంధించి, మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే స్ఫటికాలను ఏర్పరుస్తుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

శరీరానికి “విటమిన్-సీ” ఎంత అవసరం
నిపుణుల అభిప్రాయం ప్రకారం  రోజూ 65 నుంచి 90 మీ.గ్రా.ల విటమిన్-సీ తీసుకుంటే సరిపోతుంది. కాని మనం 1000 మి.గ్రా కంటే ఎక్కువగా విటమిన్-సీ తీసుకుంటే అది మన ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. సాధారణంగా మహిళలు విటమిన్-సీ 75 మి.గ్రా, పురుషులకు 90 మి.గ్రా, గర్భిణీ స్త్రీలకు 85 మి.గ్రా, పాలిచ్చే మహిళలకు 120 మి.గ్రా సరిపోతుంది.

విటమిన్-సీ ఎలా లభిస్తుంది
విటమిన్‌-సీ… నారింజ, కివి, ఆకుపచ్చ మిరపకాయ, అరటి, బ్రోకలీ, స్ట్రాబెర్రీ, బచ్చలికూర, బొప్పాయి, పైనాపిల్, నిమ్మ, ఉసిరి, మామిడి మొదలైన వాటిలో పుష్కలంగా లభిస్తుంది.

చదవండి: 
మీకు తెలుసా.. డయాబెటీస్‌ పేషెంట్లకు ప్రత్యేక మామిడి పండ్లు
Amla: విటమిన్‌ ఉసిరి.. ఎన్నెన్నో ఉపయోగాలు

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు