సూర్యకళ: రైతుల అక్కయ్య.. నేల రుణం తీర్చుకుందాం!

23 Dec, 2022 00:32 IST|Sakshi
సూర్యకళ

నేడు జాతీయ రైతు దినోత్సవం

సూర్యకళ పుట్టింది పెరిగింది హైదరాబాద్‌ నగరంలో. ఆమె సాంత్వన పొందుతున్నది మాత్రం గ్రామసీమల్లో. ప్రకృతిమాత కోసం మొదలు పెట్టిన సేవను రైతుల సేవతో పరిపూర్ణం చేస్తున్నారామె.

హ్యూమన్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన సూర్యకళ రెండు దశాబ్దాలుగా కార్పొరేట్‌ కంపెనీల్లో ఉన్నతస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘ఆ ఉద్యోగం బతకడానికి మాత్రమే. గ్రామాలు, రైతుల కోసం చేస్తున్న పని జీవితానికి ఒక అర్థం, పరమార్థం’ అంటారామె. ఆమె తన ఫార్మర్‌ ఫ్రెండ్లీ జర్నీ గురించి ‘జాతీయ రైతు దినోత్సవం’ సందర్భంగా సాక్షితో పంచుకున్న వివరాలివి.
 
‘‘రైతును బతికించుకోకపోతే మనకు బతుకు ఉండదు. నేలను కాపాడుకోక పోతే మనకు భూమ్మీద కాలం చెల్లినట్లే. మనిషిగా పుట్టిన తరవాత మన పుట్టుకకు అర్థం ఉండేలా జీవించాలి. ఎంతసేపూ మనకోసం మనం చేసుకోవడం కాదు, మనకు బతుకునిస్తున్న నేలకు కూడా పని చేయాలి. మనం పోయిన తర్వాత కూడా మనం చేసిన పని భూమ్మీద ఉండాలి. మన స్ఫూర్తి మిగిలి ఉండాలి. ఇదీ నా జీవిత లక్ష్యం. నా లక్ష్యం కోసం నేను పని చేస్తున్నాను. ఒక దశాబ్దకాలంగా మొదలైందీ మిషన్‌. తెలంగాణ జల్లాల్లో 2016 నుంచి యాభైకి పైగా రైతు శిక్షణ సదస్సులు నిర్వహించాను. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల ఇళ్లకు వెళ్లి, వాళ్లందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చాను.  

రైతు సేవల నిలయం
భావసారూప్యత ఉన్న వాళ్లందరం కలిసి నల్గొండ జిల్లా, మర్రిగూడలో గ్రామ భారతి హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌ కాలేజ్‌ ఆవరణలో రైతు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. మార్చి నాటికి ఒక రూపానికి వస్తుంది. రైతులకు ఉపయోగపడేవిధంగా పాలేకర్‌ మోడల్, సుథారియా అభివృద్ధి చేసిన గోకృపామృతం మోడల్, చౌరాసియా మోడల్‌ వంటి వివిధ రకాల మోడల్స్‌ని మరింతగా అభివృద్ధి చేయడం ఈ శిక్షణాకేంద్రం ఉద్దేశం. రైతులకు ఉపయోగపడే సేవలను ఒక గొడుగు కిందకు తీసుకురావడమన్నమాట. వ్యవసాయం కోసం చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం, మొక్కల పెంపకం కోసం లక్షల్లో సీడ్‌ బాల్స్‌ తయారు చేయించి ఖాళీ నేలల్లో విస్తరింపచేయడం వంటి పనుల్లో నాకు సంతృప్తి లభిస్తోంది.
 
నింగి– నేలకు బంధం

ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు తన కాళ్ల మీద తాను నిలబడడం అంత సులువు కాదు. అందుకే సమాజంలో ఆర్థిక పరిపుష్టి కలిగిన వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో రైతును దత్తత తీసుకోవలసిందిగా కోరుతున్నాను. నా అభ్యర్థన మేరకు కొంతమంది విదేశాల్లో ఉన్న వాళ్లు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మన రైతులకు సహాయం చేస్తున్నారు కూడా.

వ్యవసాయంలో మంచి దిగుబడులు తెస్తూ నలుగురికి ఆదర్శంగా నిలిచిన రైతులకు రైతు దినోత్సవం నాడు ఐదేళ్లుగా సన్మానం చేస్తున్నాం. మొదట్లో చిన్న చిన్న ఖర్చులు సొంతంగా పెట్టుకున్నాం. రైతు శిక్షణ కేంద్రం నిర్మాణం కోసం మా కొలీగ్స్, స్నేహితులతోపాటు కార్పొరేట్, మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నాం. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుకు సహాయం చేయడమంటే ఒక వ్యక్తికి సహాయం చేయడం కాదు. మనం కంచంలో ఆరోగ్యకరమైన అన్నానికి చేయూతనివ్వడం. మనల్ని బతికిస్తున్న నేల రుణం తీర్చుకోవడం’’ అన్నారు సూర్యకళ.

మనదేశ మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్‌సింగ్‌ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రైతుల కోసం పని చేయడంలో జీవిత పరమార్థాన్ని వెతుక్కుంటున్న సూర్యకళ పుట్టింది కూడా ఇదే రోజు కావడం విశేషం.

రైతులను కలుపుతున్నారు
రెండున్నరేళ్ల కిందట సిద్ధిపేటలో గోకృపామృతం రూపకర్త గోపాల్‌ భాయ్‌ సుథారియా గారి మీటింగ్‌కి వెళ్లాను. ఆ  సదస్సును నిర్వహించిన సూర్యకళ మేడమ్‌ అప్పుడే పరిచయమమ్యారు. రైతుల సమావేశాలు, కరోనా సమయంలో జూమ్‌ మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. వారి సూచనలతో రెండెకరాల్లో వరి సాగుతోపాటు పండ్ల మొక్కల పెంపకం కూడా మొదలు పెట్టాను.  
– పద్మాల రాజశేఖర్, శిర్నాపల్లి గ్రామం, మండలం ఇందల్వాయి, నిజామాబాద్‌ జిల్లా

నీటి నిల్వ నేర్పించారు
మేము ఎనిమిది ఎకరాల్లో సేద్యం చేస్తున్నాం. అప్పట్లో మాకు పొలంలో నీళ్లు లేవు. సూర్యకళ మేడమ్‌కి మా పరిస్థితి తెలిసి, శర్మ గారనే రిటైర్డ్‌ ఇంజనీర్‌ గారిని మా పొలానికి పంపించారు. ఆయన మాకు నీటిని నిల్వ చేసుకునే పద్ధతులు నేర్పించారు. అలాగే ప్రకృతి సేద్యం చేయడానికి ప్రోత్సహించడంతోపాటు మేము పండించిన పంటను కొనుక్కునే వారిని మాతో కలిపారు. అలా రైతులకు– వినియోగదారులను అనుసంధానం చేస్తూ ఒక నెట్‌వర్క్‌ రూపొందించారు మా మేడమ్‌.    
– వాకాటి రజిత, చౌటుప్పల్, నల్గొండ జిల్లా

పంట వేయకముందే ఆర్డర్‌లు
మూడున్నర ఎకరాల్లో వరి, కూరగాయలు, పశువుల కోసం నాలుగు రకాల గ్రాసం వేస్తుంటాను. ఈ ఏడాది 60 కొబ్బరి మొక్కలు కూడా పెట్టాను. మా పంటలు అమ్ముకోవడానికి వాట్సప్‌ గ్రూప్‌లున్నాయి. మాకు తెలియని పంట పెట్టడానికి ప్రయత్నం చేసి సందేహాలు అడిగితే, ఆ పంటలు సాగు చేస్తున్న రైతు సోదరులతో కలుపుతారు. సూర్యకళ అక్కయ్య మమ్మల్నందరినీ కలపడం కోసం ‘రైతులతో భోజనం’ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. రైతు దినోత్సవం రోజు సన్మానాలు చేస్తారు. మంచి దిగుబడి తెచ్చినందుకు నాకూ ఓ సారి సన్మానం చేశారు.  
– ఒగ్గు సిద్దులు, ఇటికాలపల్లి, జనగామ జిల్లా

– వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు